27 మున్సిపాలిటీల్లో 213 కొత్త పార్కులు..అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయం

27 మున్సిపాలిటీల్లో 213 కొత్త పార్కులు..అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయం
  • అర్బన్​ పార్కుల అభివృద్ధిలో భాగంగా ప్రణాళిక
  • కాలనీ సంఘాలకు నిర్వహణ బాధ్యత 
  • పార్కుల్లో ఆకర్షణీయ శిల్పాలు, మినీ ఫౌంటైన్స్‌
  • ప్రాంతాలను బట్టి ఔషధ మొక్కలు, పూల వనాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధి పెరిగిన నేపథ్యంలో కొత్తగా చేరిన ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కాలనీల్లో కొత్త పార్కులను నిర్మించి, వాటి నిర్వహణ బాధ్యతను స్థానిక కాలనీ సంఘాలకు అప్పగించాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 150 పార్కులు ఉండగా, త్వరలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొత్త కాలనీ పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

 ఈ ప్రాజెక్టులో భాగంగా 27 మున్సిపాలిటీలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న భూములను సేకరించి పార్కుల నిర్మాణానికి ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ పార్కుల్లో పచ్చదనాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేయూతనివ్వాలని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. 

పార్కుల నిర్మాణంతో ఆహ్లాదకరంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కూడా అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున హెచ్‌ఎండీఏ పార్కుల అభివృద్ధిని చేపడుతోంది. పెద్ద పార్కులతో పాటు, స్థానిక ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే అర్బన్ పార్కులను నిర్మించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

శిల్పాల కోసం త్వరలో టెండర్లు

హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న ఈ పార్కుల్లో సందర్శకులను ఆకట్టుకునేలా.. గ్రానైట్, రెడ్​స్టోన్​లతో రకరకాల థీమ్స్​తో శిల్పాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. పార్కుల్లో మినీ ఫౌంటైన్స్‌, కొలనులు, ప్రాంతాలను బట్టి ఔషధ మొక్కల పార్కులు, పూల వనాలను కూడా నిర్మించనున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద అందమైన శిల్పాలు, రకరకాల రూపాల్లో ఫౌంటైన్స్‌ తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శిల్పాల తయారీ, ఏర్పాటు కోసం త్వరలో కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు.