పద్మశ్రీ అందుకోనున్న బల్‌‌‌‌దేవ్‌‌‌‌ సింగ్‌‌‌‌

పద్మశ్రీ అందుకోనున్న బల్‌‌‌‌దేవ్‌‌‌‌ సింగ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా హాకీ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ కోచ్ బల్‌‌‌‌దేవ్ సింగ్‌‌‌‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ లభించనుంది. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌‌‌‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. హర్యానాలోని షహాబాద్ మార్కండ అనే చిన్న పట్టణాన్ని మేటి హాకీ క్రీడాకారులను తయారుచేసే కర్మాగారంగా మార్చిన ఘనత బల్‌‌‌‌దేవ్ సింగ్‌‌‌‌కే దక్కుతుంది.

 75 ఏళ్ల బల్‌‌‌‌దేవ్ సింగ్, 1982లో హర్యానా క్రీడా శాఖలో కోచ్‌‌‌‌గా చేరి షహాబాద్ మార్కండకు వచ్చారు. అక్కడ నాలుగేళ్ల పాటు సేవలందించిన ఆయన, తిరిగి 1993లో అదే పట్టణానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని హాకీ నర్సరీగా మార్చారు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (NIS) నుంచి హాకీ కోచింగ్‌‌‌‌లో డిప్లొమా పొందిన ఆయన, నామ్‌‌‌‌ధారి హాకీ జట్టుతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన సుదీర్ఘ కెరీర్‌‌‌‌లో 80 మందికి పైగా అంతర్జాతీయ హాకీ క్రీడాకారులను, ఎనిమిది మంది ఇండియా జాతీయ జట్టు కెప్టెన్లను దేశానికి అందించారు.