పాదయాత్రలు, బహిరంగ సభలు పెట్టండి : మహేశ్ కుమార్ గౌడ్

పాదయాత్రలు, బహిరంగ సభలు పెట్టండి :  మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ జోడో యాత్రకు ఏడాది అవుతున్న సందర్భంగా.. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలంటూ ఏఐసీసీ ఆదేశించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రోగ్రామ్స్ నిర్వహించాలని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పాదయాత్రలు, భారత్ జోడో బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఏఐసీసీ సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పేపర్ క్లిప్పింగ్​లను గాంధీభవన్ మెయిల్, వాట్సప్​కు పంపాలని పేర్కొన్నారు.

ఐదు నెలల పాటు జోడో ఎగ్జిబిషన్: శివసేనా రెడ్డి

జోడో యాత్రతో రాహుల్​ను దేశ ప్రజలు తమ ఇంటి సభ్యుడిగా భావిస్తున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. జోడో యాత్రకు ఏడాదైన సందర్భంగా గురువారం నుంచి 5 నెలల పాటు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జోడో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి జనవరి 31 వరకు శక్తి సూపర్ షీ, భారత్ జోడో యూత్ ఫెలోషిప్, గడప గడపకు యువజన కాంగ్రెస్ కార్యక్రమాలు చేపడ్తామని తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి పల్లెలో మొహబ్బత్ కీ దుకాణ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మొహబ్బత్ కీ దుకాణ్ పోస్టర్​ను ఆవిష్కరించారు.