
- ఫోన్ కాల్ రాకతో బాంబ్ స్క్వాడ్‌తో 2 గంటలపాటు తనిఖీలు
- భట్టి ఇంట్లో, చుట్టుపక్కలా సోదాలు
పంజగుట్ట, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్న మహాత్మా జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం 100 కు డయల్ చేసి ప్రజాభవన్‌లో బాంబు ఉందని చెప్పాడు. దాంతో ఇంటలిజెన్స్, సెక్యూరిటీ టీమ్స్, హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ చేరుకుని తనిఖీలు చేపట్టాయి.
పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, ఇన్స్పెక్టర్ శోభన్ తన సిబ్బందితో స్పాట్‌కు చేరుకుని తనిఖీలు చేశారు. ప్రజాభవన్ మెయిన్ గేటు నుంచి మొదలు.. భట్టి నివాసం ఉంటున్న బిల్డింగ్ గదులు, కిచెన్, బెడ్రూమ్, విజిటర్స్ హాల్, జిమ్, గార్డెన్, డిప్యూటీ సీఎం చాంబర్ తదితర అన్ని చోట్లా డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. భట్టి కాన్వాయ్, ఆయన కుటుంబ సభ్యులు వాడే వెహికల్స్ నూ పోలీసులు పరిశీలించారు. ప్రజాభవన్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలోనూ తనిఖీలు చేశారు. అయితే, ఎక్కడా బాంబు ఉన్న ఆనవాళ్లు లేనట్లు పోలీసులు తేల్చారు.
కాల్ చేసిన వ్యక్తి గుర్తింపు
ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్టు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి కనిపెట్టారు. అయితే, బెదిరించిన వ్యక్తి మానసిక రోగి అని నిర్ధారించారు. అతడు గతంలోనూ ఫోన్ చేసి బెదిరించాడని, అలా బెదిరించడం ఇది మూడోసారని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అతని వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.