స్కూళ్లు, కాలేజీలకు 8 నుంచే సెలవులు

స్కూళ్లు, కాలేజీలకు 8 నుంచే సెలవులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు హాలిడేస్ ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. సోమవారం ప్రగతిభవన్​లో హెల్త్ మినిస్టర్​ హరీశ్​​రావు, మెడికల్ ఆఫీసర్ల​తో కరోనా వ్యాప్తిపై రివ్యూ నిర్వహించిన సీఎం.. శనివారం నుంచి సెలవులు ఇవ్వాలని ఆదేశించారు.

వాస్తవానికి ఈ నెల 11 నుంచి స్కూళ్లకు, 13 నుంచి జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉంది. ఈ హాలిడేస్​ను మూడు రోజులు ముందుకు జరిపారు. ట్రాన్స్​ఫర్లు, పోస్టింగ్ విషయంలో ఆందోళన చేస్తున్న టీచర్లను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ సెలవుల ఎత్తుగడ వేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే సెలవులను ముందుకు జరిపారని అన్నారు. జిల్లాలు మారిన టీచర్లకు ఒకట్రెండు రోజుల్లో కొత్త పోస్టింగులు ఇవ్వనుండగా.. ఆ రెండు, మూడు రోజుల్లో కొత్త పోస్టింగుల్లో టీచర్లు చేరాల్సి ఉంటుంది. స్కూళ్లలో జాయిన్ కాకుండా టీచర్లు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తారనే ఉద్ధేశంతోనే సీఎం సెలవులు ప్రకటించారని టీచర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.