Hollywood : బాలీవుడ్‌కు షాక్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హాలీవుడ్ చిత్రాలు!

Hollywood : బాలీవుడ్‌కు షాక్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హాలీవుడ్ చిత్రాలు!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలు షేక్ చేస్తున్నాయి.  గత మూడు వారాల నుంచి వారానికొకటి చొప్పున విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.  దీనికి ప్రధాన కారణం అగ్రతారల సినిమాలు, ఆసక్తికరమైన చిత్రాలు లేకపోవడంతో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.  భారీ అంచనాలతో వచ్చిన ఒకటి రెండు చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక చతికిలపడ్డాయి. ఈ అవకాశాన్ని హాలీవుడ్ మూవీస్ అందిపుచ్చుకున్నాయి.  భారతీయ బాక్సాఫీస్ వద్ద రిక్డులు సృష్టిస్తున్నాయి.

'F1', 'జురాసిక్ వరల్డ్: రీబర్త్', 'సూపర్ మ్యాన్' వంటి చిత్రాలు భారతీయ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాయి. హై-ఎండ్ విజువల్స్, అత్యాధునిక సాంకేతికత,  ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకునే కథాంశాలతో ఈ సినిమాలు భారతీయ బాక్సాఫీస్‌ను దండయాత్ర చేశాయి. హాలీవుడ్ స్టూడియోలు కూడా తమ చిత్రాలకు భారత్‌లో మంచి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడం, మంచి విడుదల తేదీలను ఎంచుకోవడం ఈ విజయానికి దోహదపడింది. 

'జురాసిక్ వరల్డ్: రీబర్త్' భారీ వసూళ్లు
జులై 4న విడుదలైన 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' (Jurassic World: Rebirth) డైనోసార్ల నేపథ్యం కలిగిన చిత్రాలు ఎప్పటికీ భారీ కలెక్షన్లు రాబడతాయని మరోసారి నిరూపించింది. మహర్షలా అలీ (Mahershala Ali), స్కార్లెట్ జాన్సన్ (Scarlett Johansson) వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం, విడుదలైన కొద్ది రోజుల్లోనే దాదాపు రూ. 73 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. డైనోసార్ ఫ్రాంచైజీకి ఉన్న గ్లోబల్ అప్పీల్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ భారత ప్రేక్షకులను కూడా థియేటర్లకు ఆకర్షించడంలో విజయం సాధించాయి.

'సూపర్‌ మ్యాన్' విప్లవం!
జేమ్స్ గన్ (James Gunn) దర్శకత్వంలో వచ్చిన 'సూపర్‌ మ్యాన్' (Superman) ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు రూ. 25.50 కోట్లను రాబట్టింది. గత సూపర్ మ్యాన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా, యాక్షన్‌తో పాటు, వినోదాన్ని మేళవించి జేమ్స్ గన్ ఈ మూవీని తీర్చిదిద్దారు.  ఈ కొత్త తరహా అప్రోచ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. జూలై 11న విడుదలైన ఈ మూవీ..  సూపర్ హీరో జానర్‌కు ఉన్న అశేష అభిమాన గణం, దర్శకుడి కొత్త పంథా ఈ సినిమాకు కలిసొచ్చాయి. 

బాక్సాఫీస్ రేసులో 'ఎఫ్ 1' దూకుడు!
బ్రాడ్‌ పిట్‌ నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం 'ఎఫ్ 1' (F1) జూన్ 27న విడుదలైంది. జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ, కేవలం మూడు వారాల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 67 కోట్లు రాబట్టింది. ముఖ్యంగా మెట్రో సిటీస్‌లో ఈ సినిమాకు ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ ఉండటం గమనించదగ్గ విషయం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 400 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి, బ్రాడ్‌ పిట్‌ స్టార్‌డమ్,  స్పోర్ట్స్‌ డ్రామా జానర్కున్న ఆదరణను మరోసారి నిరూపించింది. భారత మార్కెట్‌లో హాలీవుడ్ సినిమాలకు పెరుగుతున్న ఆదరణకు 'ఎఫ్ 1' ఒక చక్కటి ఉదాహరణ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

►ALSO READ | Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్? బుల్లితెర స్టార్లతో పాటు చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీ!

ఈ మూడు హాలీవుడ్‌ చిత్రాలు ఇప్పటి వరకు భారతీయ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 165 కోట్లకు పైగా వసూలు చేశాయి. గత మూడు వారాలుగా భారతీయ బాక్సాఫీస్‌ వద్ద విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించకపోవడం ఈ హాలీవుడ్‌ చిత్రాలకు కలిసొచ్చిందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. భారతీయ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమవడంతో, హాలీవుడ్ చిత్రాలు ఆ ఖాళీని సమర్థవంతంగా భర్తీ చేశాయి.  సాధారణంగా భారతీయ బాక్సాఫీస్‌పై దేశీయ చిత్రాలదే పైచేయిగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. అయితే, గత కొన్ని వారాలుగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, బలమైన కథాంశాలు, ఆకట్టుకునే విజువల్స్ లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.