హాలీవుడ్ షూటింగ్లు హైదరాబాద్లో జరగాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు రప్పిస్తానని అన్నారు. మంగళవారం (అక్టోబర్ 28) హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన సీఎంకు సినీ కార్మికుల అభినందన సభలో మాట్లాడిన సీఎం..తెలుగు పరిశ్రమ ఆస్కార్ స్థాయికి ఎదిగిందంటే అది కార్మికుల కృషి వల్లనేనని కొనియాడారు.
సినీ కార్మికుల కష్టాలు తనకు తెలుసని, కార్మికుల అండ ఉంటే హాలీవుడ్‌ను కూడా హైదరాబాద్‌కు తీసుకొస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమ కోసం స్థలాలు, కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలుగు సినిమాను ప్రంపచ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామని అన్నారు.
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ‘మదరాసి’ అని పిలిచేవారని.. ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడానికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటుల సహకారంతోనే పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడిందని తెలిపారు. సినీ కార్మికుల కోసం మణికొండలో 10 ఎకరాల స్థలం కేటాయించి, చిత్రపురి కాలనీ ఏర్పాటుకు కృషి చేసిన డా. ప్రభాకర్ రెడ్డి సేవలను ప్రశంసించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పిన సీఎం రేవంత్.. 1964లో నంది అవార్దులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.
