హోంగార్డ్ రవీందర్​కు సీరియస్ .. కిడ్నీలు, లివర్ డ్యామేజ్

హోంగార్డ్ రవీందర్​కు సీరియస్ ..  కిడ్నీలు, లివర్ డ్యామేజ్
  • 75 శాతం కాలిన గాయాలతో 
  • కిడ్నీలు, లివర్ డ్యామేజ్ 
  • ఉస్మానియా నుంచి అపోలో ఆస్పత్రికి తరలింపు
  • ఉస్మానియా వద్ద హోంగార్డుల ఆందోళన 
  • ఇయ్యాల్టి నుంచి విధులు బహిష్కరిస్తం: జేఏసీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  జీతాల ఆలస్యం, పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డ్‌‌‌‌ రవీందర్‌‌‌‌ ఆరోగ్య ‌‌‌‌పరిస్థితి విషమంగా మారింది. ఆయన మంగళవారం హైదరాబాద్​లోని గోషామహల్ కమాండెంట్ ఆఫీసులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా 75 శాతం కాలిన గాయాలయ్యాయి. కిడ్నీలు, లివర్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రవీందర్​ను బుధవారం‌‌‌‌ ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌ నుంచి కంచన్‌‌‌‌బాగ్‌‌‌‌ డీఆర్‌‌‌‌‌‌‌‌డీఓ అపోలో హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా నుంచి హోంగార్డ్స్‌‌‌‌ జేఏసీ నేతలకు వీడియో కాల్‌‌‌‌ చేసి మాట్లాడారు.

దీన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రవీందర్ ఘటనకు సంబంధించి సీసీ పుటేజీ ద్రుశ్యాలను వెంటనే బయటపెట్టాలని పోలీస్​ శాఖను సంజయ్ డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, పాతబస్తీ రక్షకాపురానికి చెందిన రవీందర్.. 15 ఏండ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడం లేదని, జీతాలు చెల్లించడం లేదని రవీందర్ ​మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గోషామహల్ కమాండెంట్ ఆఫీసు కు వెళ్లి అడిగాడు. అక్కడి అధికారులు అవమానించడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

16 వరకు హోంగార్డుల నిరసన.. 

రవీందర్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకుని హోంగార్డులు పెద్ద ఎత్తున ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రవీందర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్‌‌‌‌ జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ మాట్లాడారు. రవీందర్‌‌‌‌‌‌‌‌ను వేధించిన ఏఎస్‌‌‌‌ఐ నర్సింగ్‌‌‌‌రావు, కానిస్టేబుల్ చందుపై చర్య లు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. టైమ్​కు జీతాలు  ఇవ్వకపోవడంతో రవీందర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రవీందర్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా గురువారం నుంచి హోంగార్డులు డ్యూటీలు బంజేస్తారని ప్రకటించారు.

బుధవారం నుంచే కొంతమంది విధులకు హాజరు కాలేదని చెప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16 వరకు నిరసనలు చేపడతామని తెలిపారు. కాగా, రవీందర్​ను బీఎస్పీ చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 26 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని అన్నారు.  కేసీఆర్ పాలనలోనే దారుణ పరిస్థితులు ఉన్నాయి. హోంమంత్రి హాస్పిటల్ కు వచ్చి రవీందర్ ను పరామర్శించాలని, లేదంటే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

నాకు న్యాయం చేయండి.. 

ఏఎస్‌‌‌‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు చాలా ఘోరంగా మాట్లాడారు. నేను జీతం కోసం వెళ్తే అవమానించారు. ఎన్నో ఏండ్ల నుంచి అట్లనే మాట్లాడుతున్నారు. నాకు న్యాయం జరిగేటట్లు చూడండి.  

- రవీందర్‌‌‌‌, బాధిత హోంగార్డ్‌‌‌‌    

నా భర్తను కాపాడండి 

జీతాలు ఆలస్యంగా ఇవ్వడం, జాబ్ రెగ్యులరైజేషన్ చేయకపోవడం, అధికారులు అవమానించడంతోనే  నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇల్లు గడవని పరిస్థితిలో నా భర్త మానసికంగా కుంగిపోయాడు. నా భర్త చనిపోతే మేం రోడ్డునపడ్తం. ప్రభుత్వం నా భర్తను కాపాడాలి. 

- సంధ్య, హోంగార్డ్‌‌‌‌ రవీందర్‌‌ భార్య