హోం ఐసోలేషన్ పేషెంట్లు.. జర భద్రం

హోం ఐసోలేషన్ పేషెంట్లు.. జర భద్రం

సరైన మానిటరింగ్ లేక ప్రాణాలు కోల్పోతున్న రోగులు

వైద్య ఆరోగ్య సిబ్బంది అలెర్ట్​గా ఉండాలని ఆదేశాలు

పేషెంట్లు తప్పించుకు తిరిగే ప్రమాదం ఉందని హెచ్చరిక

వైరస్ మరింత స్ర్పెడ్ అయ్యే చాన్స్

నల్గొండ, వెలుగు:  కరోనా వైరస్ సోకి హోం ఐసోలేషన్లో ఉంటున్న పేషెంట్ల విషయలో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా పేషెంట్లను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. వైరస్ సోకిన పేషెంట్ల కోసం ప్రభుత్వ క్వారంటైన్లు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినప్పటికీ చాలామంది ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని గ్రామాలకు, పట్టణాలకు వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ టెస్ట్​ల పరిమితి పెంచడంతోపాటు ఇంటింటి సర్వే చేస్తున్నారు. దీంతో ఏరోజుకారోజు పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. గత ఆరు మాసాలతో పోలిస్తే  ఒక్క ఆగస్టులోనే వేలల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన పేషెంట్లు అందరికీ ఒకేచోట వైద్యం అందించడం కష్టంగా మారడంతో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ పేషెంట్లు మాత్రం ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడటంతో డాక్టర్లు సైతం ఒత్తిడి చేయడం లేదు. ఓ మోస్తరు లక్షణాలు కనిపించిన వాళ్లందరిని ఇళ్లలోనే ఉంచి మెడికల్ కిట్లు అందిస్తున్నారు. వచ్చే ఒకటి, రెండు మాసాల్లో వైరస్ తీవ్రత మరింత ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.  వైరస్ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయాలంటే ముందుగా హోం ఐసోలేషన్ పేషెంట్ల విషయంలో అలెర్ట్​గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

తప్పించుకుంటున్న పేషెంట్లు

హోం ఐసోలేషన్​లో ఉంటున్న పేషెంట్లు చాటుమాటుగా తిరుగుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. కరోనా రూల్స్​ మేరకు పాజిటివ్ వచ్చిన పేషెంట్లు కనీసం 15 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. కానీ అలాకాకుండా ఐదారు రోజుల్లోనే బయటకు వచ్చేస్తున్నారు. తమలో వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా బాగానే ఉన్నామన్న ధీమాతో బయట తిరుగుతున్నారు. పేషెంట్ల బాగోగుల గురించి మాత్రమే మెడికల్ సిబ్బంది పట్టించుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఫోన్లో సంప్రదిస్తున్నారు. లేదంటే ఏదైన ప్రాబ్లమ్ అనిపిస్తే పేషెంట్లు ఫోన్ చేస్తున్నారు. కానీ కొంతమంది పేషెంట్లు అమాయకత్వంతో, మూర్ఖత్వంతో బయట తిరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అలాంటి వాళ్ల వల్ల వైరస్ మరింత వేగంగా స్ర్పెడ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అన్ని డిపార్ట్​మెంట్లు సహకరిస్తేనే..

హోం ఐసోలేషన్ పేషెంట్లను మానిటరింగ్ చేయాలంటే మెడికల్ సిబ్బంది వల్ల కాదనే నిర్ణయానికి వచ్చారు. ఇంటింటి సర్వేలో భాగంగా నియమించిన మెడికల్ టీంలలో  రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నప్పటికీ వాళ్ల పాత్ర నామమాత్రంగానే ఉందని అంటున్నారు. పేషెంట్లపైన ప్రత్యేక దృష్టి సారించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల సపోర్ట్ తప్పనిసరని చెబుతున్నారు. లేదంటే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రైమరీ టెస్టులు పెంపు

ప్రైమరీ కాంటాక్టు టెస్టులు మరింత పెంచనున్నారు. ఇప్పటివరకు ఎవరికైనా పాజిటివ్ వస్తే వారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్​లో దాదాపు 20 మందికి టెస్టులు చేశారు. ఇకనుంచి ప్రైమరీ కాంటాక్ట్స్ టెస్ట్​ల సంఖ్య 40 వరకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. గతంలో చేసినట్లుగానే పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడికి వెళ్లాడా.. ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో పరిశీలించనున్నారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్​తోపాటు, అతను కాంటాక్ట్ అయిన వాళ్లలో కనీసం 40 మందికి తగ్గకుండా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. హోం ఐసోలేషన్ పేషెంట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో నే ఇలాంటి చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చామని వైద్యాధికారులు  చెబుతున్నారు.