రికార్డులు లేనప్పుడు పట్టాలు ఎట్ల అడుగుతరు.. బాధితుల ఆందోళన

రికార్డులు లేనప్పుడు పట్టాలు ఎట్ల అడుగుతరు.. బాధితుల ఆందోళన

గద్వాల, వెలుగు:గద్వాల జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు, బాధితులకు ‘డబుల్’ ఇండ్లు ఇచ్చే విషయంలో రోజుకో తిరకాసు పెడుతున్నారు. 2021 నుంచి తమకు గత ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి న్యాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. పేదల నుంచి లాక్కున్న స్థలంలో హాస్పిటల్, నర్సింగ్​ కాలేజీ, డబుల్​ ఇండ్లు నిర్మించారు. ఇటీవల పట్టణంలోని పేదలకు డబుల్​ ఇండ్లు కేటాయించిన అధికారులు, ఇంటి స్థలాలను కోల్పోయిన వారిని పట్టించుకోలేదు.

తాజాగా ఇంటి స్థలాలు కోల్పోయిన వారు తమ ఒరిజినల్ పట్టా సర్టిఫికెట్లు తీసుకురావాలని ఆఫీసర్లు ప్రకటన చేశారు. ఇదిలాఉంటే గతంలో పేదలకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన రికార్డులు లేవని ఆఫీసర్లు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో బహిరంగంగానే చెప్పారు. 2012లో 77 ఎకరాల భూమిని సేకరించిన ఫైల్ కనిపించడం లేదని తెలిపారు. ఫైల్​ మాయం కావడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో రికార్డులు లేకుండా పట్టాలు ఎలా పరిశీలిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పట్టాదారులు, ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 

స్థలం సేకరించలే..

డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు, హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి ఇప్పటి ప్రభుత్వం స్థలం సేకరించలేదు. గత ప్రభుత్వ హయాంలో పేదలు ఇండ్లు కట్టుకునేందుకు అందించిన పట్టాలను గుంజుకొని ‘డబుల్’ ఇండ్లు, నర్సింగ్ కాలేజీ నిర్మిస్తున్నారు. పట్టాలు ఇచ్చిన వారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో, ఫేక్ సర్టిఫికెట్లు, వాటికి సంబంధించి రికార్డులు లేవని ఆరోపణలు చేస్తూ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. 

ఇదీ ఇంటి జాగల కథ..

2012లో అప్పటి ప్రభుత్వం దౌదర్ పల్లి శివారులోని 968,969,979,980,983,984,985 సర్వే నంబర్లలో భూమిని సేకరించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ నుంచి పట్టాదారులకు డబ్బులు చెల్లించారు. గవర్నమెంట్ రేటుకు భూ యజమానులు స్థలం ఇవ్వకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే డీకే అరుణ సొంతంగా కొంత డబ్బు జమ చేసి పట్టాదారులకు ఇచ్చారు. ఆ తర్వాత 1,230 మంది నిరుపేదలకు 80 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు పంపిణీ చేశారు. 2018లో హాస్పిటల్ కడతామని ముందుకు రాగా, పట్టాదారులు, రాజకీయ నాయకులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. 2021లో దౌర్జన్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకొని డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు, నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్ కడుతున్నారు.

తప్పుదోవ పట్టించడానికేనా..

ఇప్పటి వరకు ఫైల్ లేదని చెబుతూ వచ్చిన ఆఫీసర్లు, ఇప్పుడు పట్టాలు తీసుకురావాలని ప్రకటన చేయడం ప్రతిపక్షాలు, బాధితులను తప్పుదోవ పట్టించడానికేననే విమర్శలున్నాయి. ఒరిజినల్ పట్టాలు తీసుకురాలేదని చెప్పి కోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులుపుకోవాలనే ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి స్థలాలు కోల్పోయిన 615 మంది పట్టాదారులు కోర్టుకు వెళ్లారు. కోర్టు వారికి ఎలాంటి షరతలు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. గద్వాలలో 1,275 ఇండ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 771 ఇండ్లను ఇటీవల డిప్ ద్వారా కేటాయించి, మిగిలిన వాటిని పెండింగ్​లో పెట్టారు. అయితే కోర్టు చెప్పినట్లు ఇండ్లు కేటాయించకుండా, పట్టాలు తీసుకురావాలంటూ కొత్త నాటకానికి తెర లేపారని ప్రజాసంఘాలు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, పట్టాదారులు ఆగ్రహం 
వ్యక్తం చేస్తున్నారు.

సొంతిల్లు లేక తిప్పలు పడుతున్నాం

ఇల్లు, జాగ లేదు. ఉన్న పట్టాను కూడా గుంజుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కిరాయి ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్న. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. - ప్రభావతి, 34వ వార్డు, గద్వాలపేదల స్థలంలో 

కట్టొద్దని చెప్పాం..

పేదలకు ఇచ్చిన జాగలో నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్ కట్టొద్దని చెప్పాం. వజ్రాల గుట్ట దగ్గర స్థలం ఉంది. అక్కడ కట్టుమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలే. అధికారం చేతిలో ఉందని, దుర్మార్గంగా వ్యవహరించి పేదలకు జాగాలు లేకుండా చేస్తున్నారు. - డీకే అరుణ మాజీ మంత్రి

న్యాయం చేసేందుకే..

ఒరిజినల్ పట్టాలు వెరిఫై చేసి పట్టాదారులకు న్యాయం చేస్తాం. బాధితుల వద్ద ఉన్న పట్టాలు ఒరిజినలా కాదా అని వెరిఫై చేస్తాం. కోర్టుకు పోయిన వారి కోసం ఇండ్లు కూడా కేటాయించినం. వారి అర్హతను బట్టి అందజేస్తాం. -రాములు, ఆర్డీవో, డబుల్ బెడ్రూమ్ కో ఆర్డినేటర్