అఖిలేశ్‌‌‌‌ను ఎన్నుకోవడమంటే.. గూండారాజ్‌‌‌‌ తిరిగిరావడమే

అఖిలేశ్‌‌‌‌ను ఎన్నుకోవడమంటే.. గూండారాజ్‌‌‌‌ తిరిగిరావడమే
  • అఖిలేశ్‌‌‌‌ను ఎన్నుకోవడమంటే.. గూండారాజ్‌‌‌‌ తిరిగిరావడమే
  • యూపీ అభివృద్ధి దారిలో నడుస్తున్నదని కామెంట్
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా

మధుర (యూపీ): దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఉత్తరప్రదేశేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 20 కోట్ల జనాభా ఉన్న యూపీ అభివృద్ధి చెందకపోతే.. ఇండియా అభివృద్ధి చెందదన్నారు. బీజేపీ మీద ప్రజలకు ఉన్న నమ్మకమే యూపీని అభివృద్ధి దారిలో నడిపిస్తోందన్నారు. గురువారం మధురలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమాజ్‌‌‌‌వాదీ పార్టీ చీఫ్‌‌‌‌ అఖిలేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను ఎన్నుకోవడమంటే.. గూండారాజ్‌‌‌‌ తిరిగిరావడమేనని ఆయన విమర్శించారు. ‘‘అప్పట్లో గ్యాంగ్‌‌‌‌స్టర్స్, క్రిమినల్స్ రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించారు. వాళ్లను చూసి పోలీసులు కూడా భయపడే పరిస్థితి. మహిళలు, అమ్మాయిలు బయటికి రావాలంటేనే వణికిపోయేటోళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పోలీసులను చూసి గ్యాంగ్‌‌‌‌స్టర్స్, క్రిమినల్స్ భయపడుతున్నారు. స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు” అని అమిత్ షా అన్నారు. 

నేను ఎన్నికైతే.. ఎమ్మెల్యేని దోచుకుంట: ఎస్పీ నేత 
యూపీలోని హసన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ అభ్యర్థి ముఖియా గుర్జార్‌‌‌‌‌‌‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్రోహలో నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేనుగానీ ఎన్నికైతే.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టిన ప్రస్తుత ఎమ్మెల్యేను దోచుకుంటా. నా అనుచరులకు పంచుతా’’ అని కామెంట్ చేశారు. తాను ఇప్పటిదాకా16 సార్లు జైలుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల కోడ్, కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు.

ఉత్పల్ పారికర్ నామినేషన్ 
బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేస్తానని ప్రకటించిన గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్.. పనాజిలో నామినేషన్ వేశారు. అంతకుముందు మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. ‘‘నేను మా నాన్న చేసిన పనిని  కొనసాగించాలని అనుకుంటున్నా. పనాజి ప్రజల కోసం 200 శాతం కష్టపడి పని చేస్తాను. వాళ్లు నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మకముంది’’ అని ఉత్పల్ అన్నారు.

కోడలే ప్రత్యర్థి.. తప్పుకున్న గోవా మాజీ సీఎం   
గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రతాప్‌‌‌‌ సింగ్ రాణే ఉన్నట్టుండి తన నామినేషన్‌‌‌‌ను విత్ డ్రా చేసుకున్నారు. తనకు ప్రత్యర్థిగా తన కోడలు పోటీ చేయడమే ఇందుకు కారణం. పోరియం నుంచి రాణే పోటీ చేస్తారని డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే కాంగ్రెస్ ప్రకటించింది. తాము దేవియా విశ్వజీత్ రాణేని అదే సీటు నుంచి పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ వారం కిందట ప్రకటించింది. దీంతో వయసు రీత్యానే తాను బరి నుంచి తప్పుకున్నట్లు రాణే వెల్లడించారు. 

ఉత్తరాఖండ్‌‌‌‌ కాంగ్రెస్ మాజీ చీఫ్.. బీజేపీలోకి 
ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయ్ బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన్ను బుధవారం కాంగ్రెస్ బహిష్కరించగా.. గురువారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ‘‘ఉత్తరాఖండ్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీలో జాయిన్ అయ్యాను. ఇలాంటి పరిస్థితి (పార్టీ నుంచి బయటికి రావడంపై) ఎందుకు వచ్చిందో కాంగ్రెస్‌‌‌‌నే అడగాలి” అని అన్నారు. ఆయన తెహ్రీ సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.