మైనార్టీలకు అండగా కేసీఆర్ : మహమూద్ ఆలీ

మైనార్టీలకు అండగా కేసీఆర్ : మహమూద్ ఆలీ
  •     హోమ్ మినిస్టర్ మహమూద్ ఆలీ

నర్సాపూర్, వెలుగు : మైనార్టీలకు అండగా సీఎం కేసీఆర్​ ఉన్నారని, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హోమ్ మినిస్టర్ మహమూద్ ఆలీ ముస్లింలను కోరారు. శనివారం పట్టణంలోని కంజర్ల ఫంక్షన్ హాల్ లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా మహమూద్ అలీ, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ లో నలుగురు సీఎం కుర్చీ కోసం కొట్లాడుతున్నారని వారికి ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక లేదన్నారు. సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో మరోసారి బీఆర్ఎస్ గులాబి జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నర్సాపూర్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత రెడ్డి  మాట్లాడుతూ స్థానికంగా షాదీఖానా, ఇళ్ల స్థలాలు, తదితర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ , జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సుర్ ఆలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్, అభిబ్ ఖాన్, డైరెక్టర్ రావుప్, బాబా పాల్గొన్నారు.

మహిళల నిరసన

శివ్వంపేట : బ్రాహ్మణపల్లిలో బీఆర్​ఎస్​ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్​ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లగా దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  రాలేదంటూ  మహిళలు నిరసన తెలిపారు. సునీతా లక్ష్మారెడ్డి ఎంత సముదాయించినా వారు వినిపించుకోలేదు. తుజాల్పూర్ తండా గిరిజనులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు కానీ, ఏ ముఖం పెట్టుకుని మా దగ్గరికి ఓట్ల కోసం వచ్చారని నిలదీశారు.