ఒక్క మెసేజ్​తో హోమ్​ సర్వీస్!

ఒక్క మెసేజ్​తో హోమ్​ సర్వీస్!
  • ఆస్క్​లో’ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా మెయిడ్ సర్వీసులు 

  •   అందుబాటులోకి  పని మనిషి, డ్రైవర్, కుక్, మరెందరో...

  •   నో బ్రోకరేజ్, నో మిడిల్ మెన్

  •  5 వేల మందితో రన్ అవుతున్న వాట్సాప్​ కమ్యూనిటీ  

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ లైఫ్ లో ఉద్యోగులు ఎప్పుడు ఇంటికి వస్తారో.. ఎప్పుడు ఆఫీసులకు వెళ్లాల్సి వస్తుందో తెలియదు. దీంతో ఇంట్లో పనులు చేసుకోవడానికి టైం లేక, చేసేందుకు మనుషులు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. సమయానికి ఎలక్ట్రిషీయన్లు, ప్లంబర్లు, కుక్, డ్రైవర్ల లాంటి వారు దొరక్క సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసమే సిటీకి చెందిన ప్రీతి మిట్టల్ ‘ఆస్క్ లో’ పేరుతో వాట్సాప్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. 20 ఏండ్లు సాఫ్ట్ వేర్ ​ఇంజినీర్​గా పని చేసిన ప్రీతి సోషల్​సర్వీస్​ చేయాలని ఉచితంగానే ఈ సర్వీస్ అందజేస్తోంది. సేవతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.  

ముందే మాట్లాడుకోవచ్చు...

ఈ ఏడాది జనవరిలోనే ప్రీతి మిట్టల్ వాట్సాప్ కమ్యూనిటీలో ‘ఆస్క్ లో’ ప్రారంభించారు. ఇది పని చేయించుకోవడానికి చూసేవారితో పాటు పని దొరక్క ఇబ్బంది పడే వారికి కూడా ఉపయోగపడుతోంది. ఎవరికైనా ప్లంబర్స్, ఎలక్ట్రిషీయన్స్, డాగ్ వాకర్స్, ప్లంబర్స్, గార్డెనర్స్ ఇలా ఏ పని చేసేవారు కావాలన్నా ‘ఆస్క్ లో’లో మెసేజ్ పెడితే చాలు ఆ ఏరియాలోని సర్వీస్ ప్రొవైడర్లకు మెసేజ్ వెళ్తుంది.  అందుబాటులో ఉన్న వారు రిప్లై ఇస్తారు. తర్వాత వారి కాంటాక్ట్ నంబర్​తీసుకుని సర్వీస్ చార్జెస్, టైం ఇతర వివరాలు నేరుగా మాట్లాడుకోవచ్చు. పని పూర్తయిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్లకు రేటింగ్ కూడా ఇవ్వొచ్చు. ఇప్పటివరకు రెసిడెంట్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకోవచ్చు. అయితే దీనికి ముందు 7386361612 నంబర్​కు ఫోన్​ గాని, మెసేజ్​ గాని చేస్తే కమ్యూనిటీ గ్రూప్​లో యాడ్​ చేస్తారు. 

వాట్సాప్ కమ్యూనిటే ఎందుకంటే.. 

ఇండ్లలో పనిచేసేవారు, ప్లంబర్లు, ఎలక్ర్టీషియన్లు, గార్డెనర్లకు చాలా మందికి టెక్నాలజీపై పట్టు ఉండదు. కానీ,  ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు వాడుతూ..వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సెపరేట్ యాప్‌‌‌‌లు వాడాలంటే రిజిస్ట్రేషన్, ఆపరేటింగ్ ఇబ్బందులు ఉంటాయి. అందుకే వాట్సాప్​కమ్యూనిటీ ద్వారా ఈ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం 5 వేల మంది మెంబర్స్ తో ‘ఆస్క్ లో ’​కమ్యూనిటీ రన్​అవుతోంది.  

సామాజిక దృక్పథంతో.. 

సామాజిక దృక్పథంతోనే ఆస్క్ వాట్సాప్ కమ్యూనిటీ ప్రారంభించా. మెయిడ్స్, రెసిడెంట్స్ నుంచి ఎలాంటి చార్జీలు తీసుకోవట్లే. మొదట్లో ఒక్కదాన్నే కష్టపడ్డా.. ఇప్పుడు మరో ఇద్దరు ఎంప్లాయిస్ ను నియమించి ‘ఆస్క్ లో ’ కమ్యూనిటీ రన్ చేస్తున్నా.  ప్రస్తుతం పనిమనుషులు, డ్రైవర్స్, కుక్​ సర్వీసులను అందిస్తున్నం. ఫ్యూచర్​లో డాగ్​వాకర్స్​, మసాజర్స్​, గార్డెనర్స్, పెస్ట్​కంట్రోల్, టైలర్స్​వంటి మరిన్ని సర్వీసులను యాడ్ చేస్తం. ఇప్పుడు కొద్ది ఏరియాల్లోనే ‘ఆస్క్ లో’ ​అందుబాటులో ఉంది. త్వరలోనే సిటీ అంతటా విస్తరిస్తాం.    - ప్రీతి మిట్టల్