యజమాని ఆత్మహత్యను చెప్పిన కుక్క.. చెప్పులు గుర్తుపట్టి బ్రిడ్జి దగ్గర ఉండిపోయింది

యజమాని ఆత్మహత్యను చెప్పిన కుక్క.. చెప్పులు గుర్తుపట్టి బ్రిడ్జి దగ్గర ఉండిపోయింది

 కుక్క విశ్వాసానికి మారు పేరని మరోసారి నిరూపితమైంది. పట్టెడు అన్నం పెడితే చాలు.. ఎప్పటికీ ఆకలి తీర్చిన వారిని మరవదు. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అంటారు చాలామంది. తన యజమానిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. శత్రువులు హాని తలపెట్టాలని చూస్తే వారి అంతు చూస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతుంది. ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చి మనకు అండగా ఉంటుంది. అందుకే చాలా మంది వాటికి పుట్టినరోజులు జరపడం, చనిపోతే సమాధి కట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడో ఓ శునకం చేస్తున్న పని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఓ శునకం  తమ యజమానురాలు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం   తెలియక…రాత్రంతా బ్రిడ్జిపై.. ఆమె చెప్పులకు కాపలా కాస్తూ  నిరీక్షించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. 

వివరాల్లోకి వెళ్తే...

ఆంధ్రప్రదేశ్ లోనిఅంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం యానాం--యెదుర్లంక మధ్యనున్న జీఎంసీ బాలయోగి బ్రిడ్జి వద్ద  గౌతమీ గోదావరిలోకి దూకి  మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.  అయితే మృతురాలు బ్రిడ్జిపై చెప్పులు వదిలేసి దూకింది.  ఇక ఆ శుకనం ఆమె చెప్పులకు కాపలా కాస్తూ.. యజమానురాలు కోసం ఎదురు చూసింది.  ఈ ఘటన సాయం  వేళల్లో ఈ  ఘటన జరగడంతో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన పలువురు ఈ ఘటనను చూశారు. 

 మహిళతో పాటుగా వచ్చిన పెంపుడు శునకం ఆమె వదిలిన చెప్పులు వద్దనే ఉండి మధ్య మధ్యలో గోదావరి వైపు చూస్తూ మొరగడం.. యజమానురాలు కోసం ఎదురుచూడటం చేస్తోంది. ఈ విషయం వారిధిపై వెళ్తున్న వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.  ఆమె పెంపుడు కుక్క అక్కడ వంతెనపై ఆమె వేచి ఉన్న హృదయ విదారక దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. రాత్రంతా ఘటనా స్థలంలోనే యజమానురాలి కోసం ఎదురు చేస్తూ  అక్కడే పడుకుంది. ఆ తరువాత మృతురాలి తల్లితో కలిసి ఆ కుక్క వెళ్లింది. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు యానాం ఫెర్రీ రోడ్డులో నివాసముంటున్న మందంగి కాంచన (22) అనే మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.