బాలికపై లైంగిక దాడి చేసిన హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష

V6 Velugu Posted on Aug 03, 2021

  • జైలు శిక్షతోపాటు 50 వేలు జరిమానా విధించిన నాంపల్లి కోర్టు తీర్పు
  • దివ్యాంగురాలిపై లైంగికంగా దాడి చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు
  • బాలిక గర్భం దాల్చడంతో బయటపడ్డ వైనం

హైదరాబాద్: దివ్యాంగురాలైన మైనర్ బాలికపై కన్నేసి లైంగిక దాడి చేసిన హోంగార్డుకు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని.. ఇందులో 40 వేలు బాధితురాలికి చెల్లించాలని కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. సీసీఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు మల్లికార్జున్ దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా గత ఏప్రిల్ నెలలో వెలుగులోకి వచ్చింది. తుకారాం గేటు ప్రాంతంలో నివసిస్తున్న దివ్యాంగురాలిపై కన్నేసిన మల్లికార్జున్ గత ఏడాది అక్టోబర్ లో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం గుర్తించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను పోలీసునంటూ బాలికను బెదిరించాడు. ఎవరికైనా చెబితే మీ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని హెచ్చరించాడు. దివ్యాంగురాలైన బాలిక ఎవరికీ చెప్పకపోవడంతో మరోసారి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
అయితే గత మార్చి నెలలో బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చిందని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా హోంగార్డు లైంగిక దాడికి పాల్పడిన విషయం చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలితోపాటు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా.. నిందితుడు మల్లికార్జున్ లైంగిక దాడికి పాల్పడ్డాడని.. బాలిక గర్భానికి ఇతడే కారణమని నిర్ధారణ అయింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 
 

Tagged Hyderabad Today, , nampalli court today, thukaram gate today, home guard mallikarjun rape case, nampalli court judgement

Latest Videos

Subscribe Now

More News