మంచుతో ఇళ్లు గడ్డకట్టినయ్

మంచుతో ఇళ్లు గడ్డకట్టినయ్

ఇవేవీ మంచు ఖండంలో కట్టిన ఇగ్లూలు కాదు. సిటీలో జనం కట్టుకున్న ఇళ్లే. గాలులు మోసుకొచ్చిన మంచుతో గడ్డకట్టిపోయినయ్​. అమెరికాలోని న్యూయార్క్​, హాంబర్గ్​ సిటీల్లోని జనానికి ఈ మంచు ఎఫెక్ట్​ ఎదురైంది. ఇళ్లను మంచు కప్పేసింది. తలుపులు, కిటికీలను మూసేసి ఇళ్లల్లో చీకట్లను కమ్మేసింది. అడ్డొచ్చిన కరెంట్​ లైన్లు, చెట్లనూ కూల్చేశాయి. మ్యాటరేంటంటే..ఈ ఇళ్లన్నీ లేక్​ ఈరీకి సమీపంలోని హూవర్​ బీచ్​ తీరంలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఫాల్​ (ఆకురాలే కాలం) నడుస్తోంది. ఈ టైంలో పై నుంచి తేమతో కూడిన గాలులు వెచ్చటి సరస్సు మీదుగా వస్తున్నాయి. దీంతో టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఆ తేమ గాలుల దెబ్బకు సరస్సులో పది అడుగుల ఎత్తున అలలు ఎగిరి దునుకుతున్నాయి. నీళ్లు గడ్డకడుతున్నాయి. మంచు మొత్తం బీచ్​లలోని ఇళ్లపై పేరుకుపోయి, మొత్తం దారులను మూసేస్తోంది. దీన్నే లేక్​ స్నో ఎఫెక్ట్​ అని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ కరెంట్​, నీళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. టెంపరేచర్లు మైనస్​ 6 డిగ్రీలకు పడిపోయాయి. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. మరికొన్ని రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.