ప్రీ ప్రైమరీ పిల్లలకు ఇంట్లోనే చదువులు

ప్రీ ప్రైమరీ పిల్లలకు ఇంట్లోనే చదువులు
  • ప్రీ ప్రైమరీ పిల్లలకు ఇంట్లోనే చదువు చెప్తున్నరు
  • స్కూల్స్​లో జాయిన్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపని పేరెంట్స్
  • ఆన్ లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించడం ఎందుకనే ఆలోచన
  • గ్రేటర్​లోని చాలా ఏరియాల్లో ప్లే స్కూల్స్ క్లోజ్
  • అడ్మిషన్లు 50 శాతానికి పడిపోయాయంటున్న మేనేజ్​మెంట్లు

హైదరాబాద్, వెలుగు: ప్రీ ప్రైమరీ పిల్లలకు పేరెంట్స్ ఇంట్లోనే చదువు చెప్తున్నారు. నర్సరీ, ఎల్​కేజీ, యూకేజీ చదివే పిల్లలకు ఆన్​లైన్ క్లాసుల కోసం ఫీజుల కట్టడం ఎందుకని ఆలోచిస్తున్నారు.  ప్లే  స్కూల్స్ లో నేర్పించే ఏబీసీడీ లను ఇంట్లోనే తమ పిల్లలకు నేర్పిస్తున్నారు.  ఇప్పటికే గ్రేటర్​లోని చాలా చోట్ల ప్రీ ప్రైమరీ, ప్లే స్కూల్స్​ను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. కొంతమంది రెంట్లు, మెయింటెనెన్స్ భరించలేక బ్రాంచిలను మూసివేస్తున్నారు. అడ్మిషన్లు 50 శాతానికి పడిపోయాయని పలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి. 3 నుంచి5 ఏండ్లలోపు చిన్నారులకు ఆన్​లైన్ క్లాసులెందుకని భావించిన పేరెంట్స్ చాలామంది గతేడాది లాక్ డౌన్ నుంచే  ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుంచి మానిపించేశారు. రూ. వేలు ఫీజులు కట్టి  చిన్నారులకు ఆన్ లైన్ క్లాసుల ద్వారా బెనిఫిట్ లేదని పేరెంట్స్ అంటున్నారు. 

కరోనా ఎఫెక్ట్ తో...
ఉద్యోగాల రీత్యా పిల్లలను చూసుకునే టైమ్ లేని పేరెంట్స్ డే కేర్ సెంటర్ లేదా ప్లే స్కూల్స్ లో  వారిని జాయిన్ చేస్తుంటారు. అక్కడ పిల్లలను చూసుకునేందుకు ఆయాలు, గేమ్స్, టీచర్స్, ఫన్ యాక్టివిటీస్ ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులను ఈ సెంటర్స్​లో జాయిన్ చేస్తుంటారు.  డే కేర్ సెంటర్, ప్లే స్కూల్ ని  బట్టి ఒక్కో చిల్డ్రన్ కు  రూ. 5 వేల నుంచి రూ.లక్షల్లో ఫీజులు ఉంటాయి. కరోనా ఎఫెక్ట్ తో స్టూడెంట్స్ స్టడీస్ కు దూరం కాకూడదని  ప్రైవేటు స్కూల్స్ గతేడాది నుంచే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి. హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ కే ఆన్ లైన్ క్లాసులు సరిగా అర్థం కావడం లేదు. దీంతో ప్రీ ప్రైమరీ అయిన నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలకు అప్పుడే ఆన్ లైన్ క్లాసులు ఎందుకని పేరెంట్స్ అనుకుంటున్నారు. ఆన్ లైన్ క్లాసులతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడటం, అడిక్షన్ వల్ల చిన్నారులకు కళ్లు పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో ప్రీ ప్రైమరీ స్కూల్​ను మానిపించేసి అక్కడ నేర్పే బేసిక్ లెసెన్స్​ను ఇంట్లో తామే చెప్తున్నామంటున్నారు. మరోవైపు కొన్ని స్కూల్స్ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. కచ్చితంగా తర్వాత ఇయర్​కు ఫీజు కట్టాల్సిందేనని పేరెంట్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అప్పటి వరకు కట్టిన ఫీజుని రిటర్న్ చేయాలని అంటున్నా ఇవ్వకుండా అందుకు బదులు టీసీలను ఇచ్చేస్తుయి. దీంతో ఇంట్లోనే పిల్లలకు బేసిక్ లెసెన్స్ చెప్పుకోవడం బెటరని పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు.

ప్రజ్ఞత గైడ్ లైన్స్ ప్రకారం..
ఆన్ లైన్ క్లాసులపై కేంద్ర ప్రభుత్వం గతేడాదే ప్రజ్ఞత గైడ్ లైన్స్​ను రిలీజ్ చేసింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం కిండర్ గార్డెన్, నర్సరీ, ప్రీ స్కూల్ స్టూడెంట్స్ కు 30 నిమిషాలకు మించి ఆన్ లైన్ క్లాసు తీసుకోకూడదు. కానీ కొన్ని స్కూల్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరెంట్స్ వాట్సాప్​కు అసైన్ మెంట్స్ పంపి పిల్లలతో చేయించమని చెప్తున్నాయి. దీంతో ఆన్ లైన్ క్లాసుల కోసం తమ పనులను పక్కన పెట్టి పిల్లలను మానిటరింగ్ చేయాల్సి వస్తోందని పేరెంట్స్ చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని స్కూల్స్ బుక్స్, స్కానర్స్, యూనిఫామ్స్, ట్యాబ్​లను కొనడాలని ఒత్తిడి తేస్తున్నాయంటున్నారు. అందుకే ప్రీ ప్రైమరీ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు అవసరం లేదని అనుకుంటున్నట్లు పేరెంట్స్ చెప్తున్నారు.

అంతంత మాత్రమే.. 
సిటీలో  ప్లే స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్వహించే వారితో పాటు ఫ్రాంచైజీలు నడిపే వారు చాలా మందే ఉన్నారు.  కొన్ని కార్పొరేటర్, ప్రైవేటు స్కూల్స్​లో  ప్రీ ప్రైమరీ సెక్షన్లు ప్రత్యేకంగా ఉంటాయి. నగరవ్యాప్తంగా ఈ రకమైన ప్లే స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ వేలల్లో ఉన్నాయి. ఒక్కో స్కూల్ లో వందల సంఖ్యలో పిల్లలు ఉంటారు. ఒక్కో క్లాస్ లో 15 –20 మంది పిల్లలతో సెక్షన్స్ ఉంటాయి.  మే చివరి  లేదా జూన్ మొదటి వారంలో ఈ స్కూల్స్ కు అడ్మిషన్లు మొదలవుతాయి. కానీ కరోనా ఎఫెక్ట్ తో అడ్మిషన్లు రావడం కష్టంగా మారిందని ప్లే స్కూల్స్ నిర్వాహకులు అంటున్నారు. గతంలో జాయిన్ అయిన పిల్లలను వారి పేరెంట్స్ కంటిన్యూ చేయించేందుకు కూడా ఒప్పుకోవడం లేదంటున్నారు.

ఫీజులో రాయితీ అడిగినందుకు టీసీ ఇచ్చారు
మా పెద్దబ్బాయి థర్డ్ క్లాస్, రెండో అబ్బాయి  నర్సరీ. ఇద్దరూ ఒకే స్కూల్. ప్రీ ప్రైమరీకి ఆన్ లైన్ క్లాసులు ఎందుకని రెండో అబ్బాయికి నేనే ఇంట్లో ఏబీసీడీలు నేర్పిస్తున్నా.  చిన్నబ్బాయికి ఆన్​లైన్​ క్లాసులు వద్దని, పెద్దబ్బాయి ఫీజులో కొంత రాయితీ ఇవ్వాలని స్కూల్​ మేనేజ్​ మెంట్​ను కోరాం.  అలా కుదరదని, ఇద్దరు పిల్లలను కంటిన్యూ చేయాలని మేనేజ్ మెంట్ చెప్పింది. అందుకు మేము ఒప్పుకోకపోవడంతో ఇద్దరి పిల్లల టీసీలను ఇచ్చేసింది.  
- వినీతా, పేరెంట్, మణికొండ

అడ్మిషన్లు తక్కువే
గతేడాది లాక్​డౌన్ టైమ్​లోనే చాలా మంది పేరెంట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుంచి తమ పిల్లలను మానిపించారు. సెకండ్ వేవ్​లో కూడా చాలామంది అదే ఫాలో అయ్యారు. అందుకే మేము ప్రీ ప్రైమరీ క్లాస్ పిల్లలకు ప్రత్యేకంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఆన్​లైన్ క్లాస్ టైమ్ ఎక్కువగా లేకుండా చూస్తున్నాం. ప్రస్తుతం అడ్మిషన్లు తక్కువగా అవుతున్నాయి. 
- అర్చన, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్