టైటిల్: హనీమూన్ ఫొటోగ్రాఫర్; ప్లాట్‌ఫామ్: జియో సినిమా
డైరెక్టర్: అర్జున్ శ్రీవాత్సవ; కాస్ట్: ఆషా నేగి, రాజీవ్ సిద్ధార్థ, ఆపేక్ష పొర్వాల్, సాహిల్ సలాథియా, సంవేదన
రోమేశ్ ఇరాని (రీతూ రాజ్ సింగ్) పెద్ద బిజినెస్ మెన్. ఆయన కొడుకు అధీర్ (సాహిల్ సలాథియా). అతను జోయా (ఆపేక్ష)తో ప్రేమలో పడతాడు. తండ్రికి ఇష్టం లేకుండా ఆమెనే పెళ్లి చేసుకుని మాల్దీవుల్లో హనీమూన్ ప్లాన్ చేస్తాడు. వాళ్ల వెడ్డింగ్ షూటింగ్ చేసిన అంబిక (ఆశా నేగి)ని హనీమూన్ ఫొటోగ్రాఫర్‌గా పిలుస్తారు. ఆమె కూడా వాళ్లతో పాటు మాల్దీవులకు వెళ్తుంది. అంబిక మీద మనసుపడతాడు అధీర్. అంబికకి మాల్దీవుల్లో రేహాన్ (రాజీవ్ సిద్ధార్థ) పరిచయం అవుతాడు. ఆమె రేహాన్‌తో చనువుగా ఉండటం అధీర్ తట్టుకోలేడు. అంబికపై అధీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విషయం జోయాకి అర్థమవుతుంది. ఒక రోజు అధీర్ బీచ్‌లో శవమై కనిపిస్తాడు. అధీర్ చనిపోయిన దగ్గర నుంచి, రేహాన్ కనిపించకపోవడంతో అంబికకి అనుమానం వస్తుంది.
భర్త మరణించడానికి ముందు రోజు మామగారితో సన్నిహితంగా ఉండే అరవింద్ అక్కడ కనిపిస్తాడు జోయాకి. అధీర్ తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టమ్ జరుగుతుంది. అందులో అధీర్ రక్తంలో పాయిజన్ ఉన్నట్టు తెలుస్తుంది. కొడుకును హత్య చేసింది ఎవరనేది తెలియాలని రోమేశ్ ఇరాని పోలీస్ డిపార్టుమెంటు మీద ఒత్తిడి తెస్తాడు. అప్పుడు ఏసీపీ దివ్య (సంవేదన) రంగంలోకి దిగుతుంది. మొదట అంబికని అనుమానిస్తుంది. స్నేహితుడైన ఎల్విన్ ( జాసన్ ధామ్) ఇంట్లో అంబిక తలదాచుకుంటుంది. అరవింద్‌తో రోమేశ్ ఒక పెన్ డ్రైవ్ గురించి రహస్యంగా మాట్లాడటం జోయా వింటుంది. ఆ పెన్ డ్రైవ్‌లో ఏముంటుంది? అధీర్ హత్యకి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.