డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‌కు బెయిల్

డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‌కు బెయిల్
  • భక్తులపై అత్యాచారం కేసులో 2017లో డేరాబాబా అరెస్టు
  • హర్యానాలో అల్లర్లకు కుట్ర.. హనీప్రీత్‌పై దేశ ద్రోహం కేసు
  • గతంలో జైలులో ఒకే సెల్‌లో ఉంచాలని కోరిన డేరా బాబా
  • రెండేళ్ల తర్వాత బెయిల్ ఇచ్చిన పంచకుల కోర్టు

డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‌కు బెయిల్ వచ్చింది. డేరా బాబా తన ఆశ్రమంలో భక్తులపై అత్యాచారాలు చేసిన కేసులో అరెస్టయ్యాక అల్లర్లకు కుట్ర పన్నిందన్న ఆరోపణలతో హనీప్రీత్‌ జైలుపాలైంది. దాదాపు రెండేళ్లుగా జైలులో ఉన్న ఆమెకు హర్యానాలోని పంచకుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  బుధవారం ఉదయం పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టిన జడ్జి ఆమె అభ్యర్థనకు ఓకే చెప్పారు. సాయంత్రమే అంబాలా సెంట్రల్ జైలు నుంచి ఆమె విడుదలైంది.

అల్లర్లకు ప్లాన్.. దేశ ద్రోహం కేసు

డేరా బాబా.. రెండేళ్ల క్రితం దేశమంతా సంచలనం రేపిన పేరు. డేరా సచ్ఛా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీం.. తన భక్తులను రేప్ చేసిన కేసులో దోషి.. జైలుకెళ్లాడు. ఆ తర్వాత హర్యానాలోని సిర్సాలో ఉన్న ఆశ్రమంలో డేరాబాబాకు సంబంధించిన అరాచకాలు ఎన్నో బయటకు వచ్చాయి. అతడిని నాడు పోలీసులు అరెస్టు చేసిన తర్వాత 2017 ఆగస్టు 25న హర్యానా, పంజాబ్‌లలో భారీగా అల్లర్లు జరిగాయి. దీనికి హనీప్రీత్ సింగ్ కుట్ర చేసినట్లు నాడు కొన్ని ఆడియో రికార్డింగ్స్ హల్ చల్ చేశారు. డేరా ఆశ్రమంలో హనీప్రీత్ నేతృత్వంలో గుర్మీత్ అనుచరులు సమావేశమై అల్లర్లకు ప్లాన్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దేశ ద్రోహం సహా పలు కేసులు పెట్టి.. 2017 అక్టోబరులో ఆమెతో పాటు 45 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నాలుగు రోజుల క్రితమే ఆమెపై దేశ ద్రోహం ఆరోపణలను కోర్టు కొట్టేసింది. దీంతో బెయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, బుధవారం పిటిషన్ వేయగా.. వెంటనే మంజూరైంది.

డేరా బాబాకు అన్నీ ఆమే!

డేరా బాబాకు ఆశ్రమంలో అత్యంత సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్. అతడికి ఏం అవసరమైనే ఆమే దగ్గరుండి తీర్చేదని నాడు అనుచరులు చెప్పేవారు. బాలికల్ని, మహిళా భక్తుల్ని డేరా బాబా దగ్గరకు పంపడం ఆమే చేసేదని బాధితులు కొందరు ఆరోపించారు. జైలులో ఉన్న డేరా బాబా అరెస్టయిన కొత్తలో తన అవసరాలు తీర్చేందుకు హనీప్రీత్‌ను కూడా తాను ఉన్న లాకప్‌లో ఉంచాలని పిటిషన్ కూడా వేశాడు. దీన్ని కోర్టు కొట్టేసింది.