
హాంకాంగ్: టూరిస్టులను ఆకట్టుకునేందుకు హాంకాంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వందా వెయ్యి కాదు.. ఏకంగా 5 లక్షల విమాన టికెట్లను టూరిస్టులకు ఉచితంగా ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం ‘హలో హాంకాంగ్’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ గురువారం ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటివరకు మరే దేశమూ ఇంత పెద్ద ఆఫర్‌ను ప్రకటించలేదన్నారు.
ఫ్రీ టికెట్ స్కీం ఇలా..
హాంకాంగ్‌కు చెందిన 3 ఎయిర్‌లైన్స్ కంపెనీలు కలిసి ఈ టూరిజం స్కీంను రూపొందించాయి. ఇది మార్చి నుంచి ఆగస్టు వరకు (ఆరు నెలల పాటు) అమలవుతుంది. మొత్తం 5 లక్షల ఫ్రీ విమాన టికెట్లు ఇచ్చేందుకు ఈ మూడు ఎయిర్ లైన్స్ కంపెనీలు దాదాపు రూ.2వేల కోట్లకు పైనే (2 బిలియన్ల హాంకాంగ్ డాలర్లు) ఖర్చు చేస్తున్నాయి. 5 లక్షల మందికి చెరో ఎయిర్ టికెట్‌ను ఫ్రీగా ఇస్తే.. వారు మరో ఇద్దరిని హాంకాంగ్‌కు తీసుకొస్తారని ఎయిర్ లైన్స్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఉచిత టికెట్ల పంపిణీ ద్వారా తమ దేశానికి దాదాపు 15 లక్షల మంది టూరిస్టులు వస్తారని భావిస్తున్నాయి. ఇక, ఉచితంగా టికెట్లు ఇచ్చే విషయానికి వస్తే.. వాటిని ‘ఒకటి కొంటే ఒకటి ఫ్రీ’ ఆఫర్ ద్వారా టూరిస్టులకు కేటాయిస్తారు.
లక్కీ డ్రాలు, గేమ్స్‌లలో గెలిచిన టూరిస్టులకు.. ప్రమోషనల్ ఆఫర్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి కూడా టికెట్‌ను ఫ్రీగా అందిస్తారు. హాంకాంగ్ పొరుగునే ఉండే మకావు (అటానమస్ రీజియన్), గ్వాంగ్ డాంగ్ప్రావిన్స్(చైనా)లకు వచ్చే టూరిస్టులకు మరో 2 లక్షల విమాన టికెట్లను ఈ స్కీం ద్వారా ఫ్రీగా అందించనున్నారు. ఐసొలేషన్, క్వారంటైన్ లాంటి నిబంధనలేవీ లేవని.. టూరిస్టులు నిస్సంకోచంగా హాంకాంగ్‌కు వచ్చి టూర్‌ను ఎంజాయ్ చేయాలని ఎయిర్ లైన్స్ కంపెనీలు కోరుతున్నాయి.
మూడేళ్లుగా టూరిస్టులు రాకపోవడంతో..
హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థకు టూరిజమే ఆరో ప్రాణం. 2019 సంవత్సరంలో ఆ దేశంలో 5.6 కోట్ల మంది పర్యటించారు. ఇది ఆ దేశ జనాభా కంటే 8 రెట్లు ఎక్కువ. హాంకాంగ్ జనాభా 74 లక్షలు. 2019 తర్వాత కరోనా వ్యాప్తి మొదలు కావడంతో సీన్ రివర్స్ అయింది. చైనా పక్కనే ఉండటంతో.. మూడేళ్లుగా హాంకాంగ్ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2022 సంవత్సరంలో కేవలం 60 లక్షల మంది టూరిస్టులే ఆ దేశాన్ని విజిట్ చేశారు.