మెగా డీఎస్సీపై నిరుద్యోగుల్లో ఆశలు

మెగా డీఎస్సీపై నిరుద్యోగుల్లో ఆశలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరుతుండటంతో నిరుద్యోగుల్లో మెగా డీఎస్సీపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అధికారికంగా వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. నామమాత్రపు పోస్టులతో బీఆర్ఎస్​ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ వేయడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుండడంతో మెగా డీఎస్సీ ఉంటుందని నిరుద్యోగుల్లో ఆశలు మొదలయ్యాయి. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ సర్కారు తొలిసారి 2017లో 8,792 టీచర్ పోస్టుల భర్తీకి టీఆర్టీ నిర్వహించింది. ఆ తర్వాత ఆరేండ్లకు ఈ ఏడాది సెప్టెంబర్ 6న కేవలం 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ పెడ్తామని ప్రకటించింది. ఈ పరీక్షకు ఎప్పుడూ లేని విధంగా ఫీజును రూ.వెయ్యికి పెంచింది. చాలా జిల్లాల్లో పెద్దగా పోస్టులు లేకపోవడంతో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. దీంతో కేవలం 1,77,502 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేశారు. ఏండ్ల నుంచి టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నవంబర్​లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ..

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ప్రకటించి.. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో  పేర్కొన్నది. దీంతో పాటు ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకీ ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుండడంతో టీచర్ పోస్టులు పెరుగుతాయనే ఆశలు నిరుద్యోగుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో  మెగా డీఎస్సీ ఎలా నిర్వహించాలనే దానిపై విద్యాశాఖలోనూ చర్చ మొదలైంది. కొత్త సర్కారు ఆదేశిస్తే పాత డీఎస్సీ నోటిఫికేషన్​కు కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి, మళ్లీ దరఖాస్తులకు చాన్స్ ఇచ్చే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మంత్రివర్గం కొలువైన తర్వాతే, మెగా డీఎస్సీపై స్పష్టత వచ్చే అవకాశముంది. అలాగే, కొత్త ప్రభుత్వం కొలువుదీరి, మంత్రివర్గం ఏర్పాటైన తర్వాతే వాయిదా పడిన డీఎస్సీ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.