భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నామమాత్రమేమి కాదు. రాజ్యాంగం అంతిమ నిర్ణయాధికారి. ఎందుకంటే తన ప్రమాణ స్వీకారం సందర్భంలో రాజ్యాంగాన్ని సంరక్షించి, కాపాడుతానని ప్రమాణం చేస్తారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రమాదం తలెత్తినప్పుడు లేక సంక్షోభాలు ఏర్పడినప్పుడు తన అధికారాలను వాస్తవంలో వినియోగిస్తారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి తన అధికారాలను నిర్వహించే సందర్భంలో ఏదైనా ఒక అంశంపై రాజ్యాంగంలో ఎలాంటి వివరణ లేనప్పుడు కేంద్ర మంత్రిమండలి సలహాతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి తన సొంత విచక్షణను అనుసరించి నిర్వహించే అధికారాలను విచక్షణ అధికారాలుగా పేర్కొంటారు.
ప్రధాని నియామకం
మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ 1989లో ప్రధాన మంత్రిని నియమించే సందర్భంలో వ్యవహరించిన తీరుపై వ్యాఖ్యానిస్తూ పార్లమెంట్లో ఏకైక అతిపెద్ద పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేని కారణంగా రెండో అతిపెద్ద పార్టీ నాయకుడైన మిమ్మల్ని ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నానని వి.పి.సింగ్‌కు నియామక పత్రాన్ని అందిస్తూ 30 రోజుల్లో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు.
లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో ప్రధాన మంత్రి నియామకంపై రాజ్యాంగం ఎలాంటి మార్గదర్శక సూత్రాలను సూచించడం లేదు. ఈ విషయంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగించి ప్రధాన మంత్రిని నియమిస్తారు. 1989లో మన దేశంలో మొదటిసారిగా హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు 191 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్‌గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ఆహ్వానించారు.
రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించడంతో 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీగా ఉన్న జనతాదళ్‌కు చెందిన వి.పి.సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ఆహ్వానించడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1996లో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీని సాధించని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన వాజ్‌పేయీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 13 రోజుల్లోగా మెజార్టీ నిరూపించుకోలేకపోవడం కారణంగా రాజీనామా సమర్పించారు.
కేంద్ర మంత్రిమండలి రద్దు
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం లోక్‌సభలో తన విశ్వాసాన్ని అంటే మెజార్టీ కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించవచ్చు. లేదా ఆ ప్రభుత్వాన్ని తన విచక్షణాధికారాన్ని వినియోగించి రద్దు చేయవచ్చు.
లోక్‌సభ రద్దు
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశాన్ని కల్పించడం లేదా లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునివ్వడం రాష్ట్రపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
ఉదా: 1998 ఎన్నికల ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో అవిశ్వాస తీర్మానం ద్వారా పడిపోయినప్పుడు లోక్‌సభ పదవీకాలం నాలుగు సంవత్సరాలు మిగిలి ఉన్నా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కాని సందర్భంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు పిలుపు ఇచ్చారు.
బిల్లులపై వీటో అధికారాన్ని వినియోగించడం
కేంద్ర మంత్రిమండలి లేక పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించడం. రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఒకవేళ గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు కూడా రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని వినియోగిస్తాడు.
ప్రభుత్వ బిల్లులపై న్యాయ సలహా కోరడం
పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రిమండలి తీర్మానాలను లేక బిల్లులపై రాజ్యాంగపరమైన సందేహాలు ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి వాటికి తన ఆమోదం తెలుపకుండా న్యాయ సలహాల కోసం సుప్రీంకోర్టు పరిశీలనకు పంపడంలో కూడా రాష్ట్రపతి తన విచక్షణాధికారాలు వినియోగించవచ్చు.
రాష్ట్రాల బిల్లుపై నిరపేక్షమైన వీటో
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి పరిశీలనకు కేంద్రానికి పంపినప్పుడు భారత రాష్ట్రపతి వినియోగించే వీటో అధికారం
నిరపేక్షమైంది. అంటే రాష్ట్రాల బిల్లులను రాష్ట్రపతి వీటో చేసి వెనక్కి పంపినప్పుడు రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి తిరిగి రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు కూడా రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. అంటే తిరస్కరించవచ్చు.
పార్లమెంట్‌కు సందేశాలు పంపడం
రాజ్యాంగంలోని 86వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్‌లోని ఉభయసభలకు వేర్వేరుగా కానీ లేక సంయుక్తంగా కానీ సందేశాలు పంపవచ్చు. ఈ విషయంలో రాష్ట్రపతి అధికారాన్ని విచక్షణాధికారంగా భావించవచ్చు.
ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు
1979లో ప్రధాన మంత్రి మొరార్జీదేశాయ్ తన పదవికి రాజీనామా చేసిన సందర్భంలో చరణ్‌సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రధాన మంత్రిగా చరణ్‌సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించి నెల రోజుల్లోగా మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌సింగ్ లోక్‌సభలో తన మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో 23వ రోజు తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. చరణ్‌సింగ్ రాజీనామా తర్వాత జగ్జీవన్‌రామ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు.
