అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలో జరుగుతున్న వరస ఘటనలు.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపుతున్నాయి. ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన తెలుగు అమ్మాయి హత్య వార్త తర్వాత.. మరో విషాద ఘటన బయటకొచ్చింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కృష్ణ కిషోర్, అతని భార్య ఆశ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలకొల్లుకు చెందిన కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్యామిలీతో అక్కడే నివాసం ఉంటున్నారు. భార్య ఆశతోపాటు కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో వెళుతున్న సమయంలో.. వాషింగ్టన్ సిటీలో వీరి కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కృష్ణ కిషోర్, అతని భార్య ఆశ చనిపోయారు. తీవ్ర గాయాలతో కుమారుడు, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వారం రోజుల క్రితమే కృష్ణ కిషోర్ అతని ఫ్యామిలీ పాలకొల్లు వచ్చింది. ఇండియా నుంచి తిరిగి అమెరికా వెళుతూ.. మధ్యలో దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. దుబాయ్ లో కొత్త ఏడాది సెలబ్రేషన్స్ తర్వాత.. అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. ఇండియా నుంచి తిరిగి అమెరికా వెళ్లిన వారం రోజుల్లోనే ఈ ఘటన జరగటంతో.. పాలకొల్లులోని వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో విషాదం నెలకొంది.