Indian Cinema AI: ఎప్పటికైనా AI ముప్పేనా? ఉద్యోగాలపై ‘చిరంజీవి హనుమాన్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్

Indian Cinema AI: ఎప్పటికైనా AI ముప్పేనా? ఉద్యోగాలపై ‘చిరంజీవి హనుమాన్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్

నేషనల్ అవార్డు విన్నర్, దర్శకుడు రాజేష్ మాపుస్కర్ (Rajesh Mapuskar) భారతీయ సినిమా హద్దులను చెరిపేస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సాహసోపేతమైన అడుగు వేయబోతున్నారు. భారతదేశంలోనే మొదటి పూర్తిగా, AIతో రూపొందిన థియేట్రికల్ సినిమాగా ‘చిరంజీవి హనుమాన్-ది ఈటర్నల్’ను (Chiranjeevi Hanuman The Eternal) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం హనుమాన్ జయంతి (2026 ఏప్రిల్ 2) సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని తెలుపుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. 

Animation vs AI-తేడా ఏంటి?

ఈ సాహసోపేతమైన ప్రయోగంపై డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. “తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టడం నాకు ఇష్టం. ఈ అవకాశం నాకొచ్చిందంటే నేను దీని కోసం ఎంపికయ్యానన్న భావన ఉంది” అని తెలిపారు. ఈ క్రమంలో యానిమేషన్, AI మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు రాజేష్. “యానిమేషన్‌లో ప్రతి కదలిక మన నియంత్రణలో ఉంటుంది. కానీ AI అలా కాదు. అది మనతో పాటు పనిచేసే మరో మెదడు లాంటిది. మనం ఊహించని అద్భుతాలను కూడా చూపిస్తుంది” అని వెల్లడించారు.

AI వల్ల ఉద్యోగాలు పోతాయా?

సినీ ఇండస్ట్రీలో చాలామందికి AI అంటే భయం. కానీ, డైరెక్టర్ రాజేష్‌కు ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే AI వల్ల ఉద్యోగాలు పోతాయా? అనే ఆ భయాన్ని పూర్తిగా కొట్టిపారేస్తూ రాజేష్ మాట్లాడారు. “AI మనుషుల ఉద్యోగాలను లాక్కోదు. పనిని వేగంగా పూర్తి చేయడంలో మాత్రమే సహాయపడుతుంది. AI మనల్ని నియంత్రిస్తుందా? లేక మనం AIని నియంత్రిస్తామా? అన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో రాజేష్ మాట్లాడుతూ, “నా ఈ ‘చిరంజీవి హనుమాన్ – ది ఈటర్నల్’ ప్రాజెక్ట్‌లోనే 200 మందికి పైగా జనరేటివ్ టీమ్ ఉంది. ఇంకా ఎన్నో రంగాల్లో మానవ శ్రమ అవసరం. AI ఒంటరిగా సినిమా చేయలేదు” అన్నారు.

‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’:

ఇటీవల విడుదలైన AI వెబ్‌సిరీస్ ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ నుంచి తాను చాలా నేర్చుకున్నానని రాజేష్ చెప్పారు. “ఇలాంటి కొత్త టెక్నాలజీతో పని చేస్తున్నప్పుడు ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ చాలా ముఖ్యం. ఆ కామెంట్స్ నుంచే లోపాలు తెలుస్తాయి. అక్కడ ఎక్కడ తడబడ్డారో చూసి, వాటిని కరెక్ట్ చేసుకుని నా ‘చిరంజీవి హనుమాన్’ను తీర్చిదిద్దుతున్నాను” అని  దర్శకుడు రాజేష్ మాపుస్కర్ తెలిపారు.