మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ పదవులపై చిగురించిన ఆశలు!

మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ పదవులపై చిగురించిన ఆశలు!
  • వ్యవసాయ మంత్రి ప్రకటనతో ఆశావహుల ప్రయత్నాలు

మెదక్, వెలుగు:  రాష్ట్రంలో మిగిలిన మరో 35 వ్యవసాయ మార్కెట్​ కమిటీల పాలకవర్గాల నియామకాలు త్వరలో పూర్తి చేస్తామని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. దీంతో  నేతల్లో ఆశలు చిగురించాయి. మెదక్ జిల్లాలో 6 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా ఇప్పటి వరకు ఒక్క దానికి కూడా పాలక వర్గం నియామకం కాలేదు. తాజాగా మంత్రి ప్రకటనతో జిల్లాలోని ఆయా మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

చైర్మన్​ రిజర్వేషన్​ ఇలా..

జిల్లాలో మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్​లో వ్యవసాయ మార్కెట్​ కమిటీ (ఏఎంసీ)లు ఉన్నాయి. వాటికి ఇదివరకు ఉన్న  పాలకవర్గాల పదవీ కాలం ముగిసిపోయినందున కొత్త పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ఒక్కో ఏఎంసీకి 12 డైరెక్టర్​ పోస్ట్​లు ఉంటాయి. వారిలో నుంచి ఒకరిని చైర్మన్ గా, మరొకరిని వైస్​ చైర్మన్​గా ఎన్నుకుంటారు. మెదక్, నర్సాపూర్​ ఏఎంసీ చైర్మన్​ పదవులు బీసీ జనరల్​కు, రామాయంపేట ఏఎంసీ చైర్మన్​ పదవి ఎస్టీ జనరల్​కు, పాపన్నపేట ఏఎంసీ చైర్మన్​ పదవి ఎస్సీకి, తూప్రాన్​, చేగుంట ఏఎంసీ చైర్మన్​ పదవులు ఓసీ జనరల్​కు రిజర్వ్​అయ్యాయి. రిజర్వేషన్​కు అనుగుణంగా చైర్మన్​ పదవులకు అర్హులైన వారిని నామినేట్​ చేస్తారు.  

ఎవరి ప్రయత్నాల్లో వారు..

జిల్లాలో మొత్తం 6 మార్కెట్​ కమిటీలు ఉండగా అందులో 3 మెదక్, రామాయంపేట, పాపన్నపేట మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ మేరకు ఆయా ఏఎంసీల చైర్మన్, వైస్​ చైర్మన్, డైరెక్టర్​ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రోహిత్ రావు​, కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశీస్సులతో ఆయా పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక నర్సాపూర్​ ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్​ పదవులు ఆశిస్తున్న వారు ఆ నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి ద్వారా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దుబ్బాక నియోజక వర్గ పరిధిలోని చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్​ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్​ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికోసం ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆశీస్సులతో పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లా ఇన్​చార్జి మంత్రి పాత్ర కీలకం కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా నియమితులైన వివేక్ వెంకటస్వామి దృష్టిలో పడేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రిని కలిసి తమకు అవకాశాలు కల్పించాలని వినతి పత్రాలు అందజేస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట: జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ  మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో6 మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ఏడు మార్కెట్ కమిటీల నియామకం పెండింగ్ లో ఉంది. ఆయా మార్కెట్​ కమిటీల పరిధిలోని ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.