
- నిండిన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్
- నేడో రేపో గేట్లు ఓపెన్.. శ్రీరాంసాగర్‌కు నీళ్లొచ్చే చాన్స్
- ప్రాజెక్టుకు క్రమంగాపెరుగుతున్న వరద
- ఆయకట్టుకుఢోకా లేదంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: గోదావరి ప్రాజెక్టుల్లో కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే గోదావరి బేసిన్‌లోని మహారాష్ట్ర నాసిక్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. నదికి వరదలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు దాదాపు నిండిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదలు మొదలవుతాయని అంటున్నారు.
ఆగస్టులో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నట్టు చెప్తున్నారు. నిన్నటిదాకా ప్రాజెక్టుకు కేవలం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ ఉండగా.. శుక్రవారం స్వల్పంగా పెరిగి 5,208 క్యూసెక్కులకు చేరింది. ఆగస్టు, సెప్టెంబర్ మొత్తం గోదావరి బేసిన్ప్రాంతాల్లో వర్షపాతం అంచనాలు మెరుగ్గా ఉన్నాయని, దీంతో ఆయకట్టుకు ఇబ్బందేమీ ఉండబోదని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు దాదాపు నిండడంతో.. అక్కడి నుంచి కూడా శ్రీరాంసాగర్‌కు నీళ్లు వచ్చే అవకాశాలు పెరిగాయని చెప్తున్నారు.
కృష్ణాకు కొనసాగుతున్న వరద
కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద వస్తున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 85 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. 1.54 లక్షల క్యూసెక్కులను అవుట్ ఫ్లో ఉంది. ఇటు సాగర్‌కు 1.2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. కాగా, ఏపీ శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా నీటి విడుదలను 30 వేల క్యూసెక్కులకు పెంచింది.
మోస్తరు వర్షాలు..
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ముసురు ప్టటింది. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా నెక్కొండలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేటలో 5.1, మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 4.9, టేకులపల్లిలో 4.8, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 4.8, వనపర్తి జిల్లా కన్నయ్యపల్లిలో 4.5, హనుమకొండలో 4.5, ఖాజీపేటలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోనూ ముసురు పట్టింది.
సాయంత్రం పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. మెట్టుగూడ, యూసుఫ్‌గూడ, నాచారం లో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కాగా, గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని లోటు వర్షపాతం మొత్తం పూడింది. మొన్నటివరకు 30 శాతం వరకు లోటు ఉండగా.. అదంతా పూడింది. మరో నాలుగైదు రోజులు కూడా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ప్రాజెక్టుల్లో వరద.. కెపాసిటీ వివరాలు..
ప్రాజెక్ట్ సామర్థ్యం (టీఎంసీల్లో) ప్రస్తుత నిల్వ (టీఎంసీల్లో) ఇన్ ఫ్లో (క్యూసెక్కుల్లో) అవుట్ ఫ్లో (క్యూసెక్కుల్లో)
ఆల్మట్టి 129.72 102.65 34,000 42,500
నారాయణపూర్ 37.64 35.12 42,500 43,488
జూరాల 9.66 8.41 80,000 85,391
తుంగభద్ర 105.79 78.04 39,439 48,248
శ్రీశైలం 215.81 202.04 99,122 1,54,187
సాగర్ 312.05 280.12 1,20,635 6,598
నిజాంసాగర్ 17.8 4.14 000 000
సింగూరు 29.91 19.48 1,373 243
శ్రీరాం సాగర్ 80.5 21.71 5,208 622
ఎల్లంపల్లి 20.18 9.48 5,285 452
మిడ్ మానేరు 27.5 6.95 955 110
కడెం 4.7 3.63 4,004 866