- శ్రావణపల్లి, సత్తుపల్లి, కేకే 6, కోయగూడెం ఓసీపీ గనులను వేలంలో చేర్చిన కేంద్రం
- కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్‌రెడ్డి
- కొత్త గనులు సింగరేణికే దక్కేలా చొరవ చూపాలంటున్న కార్మికులు
కోల్‌బెల్ట్, వెలుగు : కొత్త బొగ్గు గనులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సింగరేణి సంస్థకు.. మన రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో మరిన్ని ఆశలు పెరిగాయి. సింగరేణిలో ప్రస్తుతం తవ్వుతున్న గనులన్నీ పాతవి కావడంతో బొగ్గు నిక్షేపాలు అంతరించిపోతున్నాయి. భవిష్యత్‌లో కొత్త గనులు రాకుంటే మరో 20 ఏండ్లలో ఇప్పుడున్న గనులన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం గనులను వేలంలోనే దక్కించుకోవాలి. బొగ్గు ఉత్పత్తిని 100 మిలియన్ టన్నులకు పెంచేందుకు సింగరేణి ప్రయత్నం చేస్తున్నందున కొత్త గనుల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు.
సింగరేణి బ్లాక్‌లను వేలంలో చేర్చిన కేంద్రం
సింగరేణి ప్రాంతాల్లో ఉన్న గనులకు గతంలో సంస్థే పూర్తి హక్కుదారుగా ఉండేది. కేవలం పర్యావరణంతో పాటు గనులు తవ్వుకోవడానికి మాత్రమే పర్మిషన్ తీసుకునేది. కానీ కేంద్రం తీసుకొచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులరైజేషన్ చట్టం (ఎంఎండీఆర్) 2015 ప్రకారం ఏ సంస్థ అయినా వేలం ద్వారానే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాలి. సింగరేణి పరిధిలో ఉన్న శ్రావణపల్లి, సత్తుపల్లి 3, కేకే 6, కోయగూడెం ఓసీపీ బొగ్గు బ్లాక్‌లను సైతం కేంద్రం వేలం లిస్ట్‌లో చేర్చింది. దీంతో నాలుగు బొగ్గు బ్లాక్‌లను దక్కించుకునేందుకు సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రెండు సార్లు నాలుగు గనులకు టెండర్లు పిలువగా కోయగూడెం ఓసీపీని అరబిందో కంపెనీ దక్కించుకుంది. అయితే సింగరేణి గనులను వేలం వేయడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. పాత పద్ధతిలో గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ గనులు కావాలంటే వేలంలో పాల్గొనాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
కేసీఆర్ వైఖరితో నష్టం
ఎంఎండీఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కోల్ ఇండియా యాజమాన్యం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, సెక్రటరీని కలిసి రిజర్వేషన్స్ విధానంలో బొగ్గు గనులను పొందారు. ఈ విధానంలో కోల్ ఇండియా 116 బొగ్గు గనులను దక్కించుకుంది. కానీ గత సీఎం కేసీఆర్వైఖరి కారణంగా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్‌లు దక్కించుకునే అవకాశం లేకుండా పోయింది. సింగరేణి యాజమాన్యం కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి అప్పటి సీఎం కేసీఆర్, జాతీయ కార్మిక సంఘాల ద్వారా సంప్రదింపులు చేసి ఉంటే 2019 నాటికే కొత్త గనులను సాధించే అవకాశం ఉండేది.
కానీ బీఆర్‌ఎస్ సర్కార్ సింగరేణిలో రాజకీయంగా జోక్యం చేసుకొని 49 శాతం వాటా కలిగిన కేంద్రాన్ని లెక్క చేయకుండా, వాటాదారుల ఒప్పందాలను తుంగలో తొక్కి విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవగా మార్చింది. అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని చాలా సార్లు కలిసినా సింగరేణికి బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు గురించి గానీ, కార్మికుల సమస్యల గురించి గానీ మాట్లాడలేదు. సింగరేణికి సంబంధించిన కోట్లాది రూపాయలను రాయల్టీ ట్యాక్స్, వివిధ స్కీమ్‌ల పేరుతో బీఆర్‌ఎస్ సర్కార్ తరలించుకుపోయింది. కానీ సింగరేణి మనుగడ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని శ్రావణపల్లి, సత్తుపల్లి 3, కేకే 6, కోయగూడెం ఓసీపీ బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనకుండా, ఒడిశాలోని గనుల కోసం సింగరేణిని వేలంలో పాల్గొనేలా చేయడంతో నష్టం జరిగింది. సింగరేణికి దక్కిన తాడిచర్ల గనిని సైతం ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడానికి కారణమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర సర్కార్, కేంద్రమంత్రి చొరవతో మేలు
బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దని సింగరేణి సంస్థకు గత బీఆర్‌ఎస్ సర్కార్ సూచించింది. కానీ ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం వేలంలో పాల్గొనేందుకు సుముఖంగా ఉంది. వేలంలో పాల్గొనాలా లేదంటే రాయల్టీ చెల్లించి నేరుగా గనులను దక్కించుకోవాలా అనే విధానంపై నిర్ణయం తీసుకోవాలని, ఇందుకోసం చర్చలు జరపాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పని చేస్తున్న సింగరేణికి కొత్త గనుల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఇందులో భాగంగా తెలంగాణలోని శ్రావణపల్లి, సత్తుపల్లి ఓసీపీ3, కేకే 6, కోయగూడెం ఓసీపీని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
వీటి ద్వారా ఏటా కనీసం కోటి టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయొచ్చని భావిస్తోంది. ఇప్పటికే తవ్వుతున్న పాత గనుల పక్కనే ఉన్న నాలుగు బ్లాక్‌లను వేలం నుంచి తప్పించి నేరుగా సింగరేణికి కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. గతంలో సింగరేణి గనుల పర్యటనకు వచ్చిన కిషన్‌రెడ్డి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని అనేక హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధానిని కలిస్తే కొత్త బ్లాక్‌లు సింగరేణికే దక్కుతాయని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.