
గచ్చిబౌలి, వెలుగు: కొన్నేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో హాస్టల్‌ను ఖాళీ చేయించేందుకు వచ్చిన బిల్డింగ్ ఓనర్లపై హాస్టల్ నిర్వాహకుడు, తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన ప్రకారం.. గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో కోడూరు మాన్షన్ అపార్ట్మెంట్లో ఉన్న 20 ప్లాట్లను వాటి యజమమానులు 2016లో అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తికి రెంట్‌కు ఇచ్చారు. ఆయన ‘ఎవర్డెన్ స్టే’ పేరుతో హాస్టల్ నిర్వహిస్తున్నాడు. వీరి మధ్య అగ్రిమెంటు 2020లో ముగిసింది. అప్పటి నుంచి అద్దె కట్టకుండా హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. దీంతో ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఒక్కో ప్లాటు మీద దాదాపు17 లక్షల రెంట్ బకాయి ఉంది. ఆ బిల్డింగును ఖాళీ చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. సోమవారం హాస్టల్‌ను ఖాళీ చేయించేందుకు యజమానులు, కోర్టు ఉద్యోగులు, యజమానుల తరఫున అడ్వకేట్ ఇందిరానగర్‌లో ఉన్న కోడూరు మాన్షన్ భవనం వద్దకు వచ్చారు. వారిపై అమర్నాథ్రెడ్డి, 30 మంది అనుచరులు కలిసి దాడి చేశారు. కర్రలు, రాడ్లతో కొట్టడంతో ప్లాట్ల యజమానులు కోడూరు విశ్చేశ్వరరావు, రజనీ, సునీశ్, శ్రీధర్, ప్రసూనాంభ, అడ్వకేటు, కోర్టు ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులు దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు
చేస్తున్నారు.