- పైలట్ తోపాటు ఇద్దరు ప్రయాణికులు సురక్షితం
- బెలూన్ ల్యాండింగ్‌పై తప్పుడు ప్రచారం వద్దన్న సేఫ్టీ మేనేజర్
- ఏర్పాట్లపై సందర్శకుల అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో రాష్ట్ర పర్యాటక శాఖ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో శనివారం ఓ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి వెళ్లిన ఓ హాట్ఎయిర్ బెలూన్ మణికొండ సమీపంలోని నెక్నాపూర్ చెరువు వద్ద అత్యవసరంగా దిగడం కలకలం రేపింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అనంతరం ఆ బెలూన్ ను మడతపెట్టి ట్రక్కులో తరలించడంతో ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే ప్రచారం జరిగింది. కాగా, బెలూన్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, దీనిపై నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఫెస్టివల్ సేఫ్టీ మేనేజర్ కెప్టెన్ ఎం.చౌహాన్ అన్నారు. బెలూన్ ఎక్కడా ప్రమాదానికి గురికాలేదని, పైలట్ నియంత్రిత పద్ధతిలోనే సురక్షితంగా కిందకు దించారని స్పష్టం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లకు విమానాల మాదిరిగా నిర్ణీత రన్వేలు ఉండవని, ఇవి గాలి వీచే దిశను బట్టి ప్రయాణిస్తాయని ఆయన వివరించారు. భద్రతా నిబంధనల ప్రకారం పైలట్లు ఖాళీ ప్రదేశాలను చూసుకుని ల్యాండ్ చేస్తారని, నెక్నాపూర్లో కూడా అదే జరిగిందని తెలిపారు.
డీజీసీఏ నిబంధనలకు లోబడే అన్ని బెలూన్లు ప్రయాణించాయని, 18 బెలూన్లు విజయవంతంగా తమ పర్యటన ముగించాయని పేర్కొన్నారు. ఎటువంటి సాంకేతిక లోపం తలెత్తలేదని వివరణ ఇచ్చారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, అవాస్తవాలను ప్రచారం చేసి అపార్థాలకు తావివ్వవద్దని నిర్వాహకులు కోరారు.
సందర్శకుల ఆగ్రహం..
మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్ షో ఈవెంట్ నిర్వహణపై సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోల్ఫ్ క్లబ్ లో సందర్శకుల కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలుచేసినా.. కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ఉదయం 6 గంటలకే రమ్మని చెప్పి.. గంటల తరబడి వెయిట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని పలువురు పర్యాటకులు పేర్కొన్నారు. పార్కింగ్ లేకపోవడం, ఎంట్రీ దగ్గర సందర్శకులను నిలిపేయడంతో కొంత గందరగోళం నెలకొంది.
