భూమ్మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత…

భూమ్మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత…

భూమ్మీద నమోదైన అతి వేడి ఉష్ణోగ్రతలివేనంటూ వచ్చిన రిపోర్టుల్లో రెండింటిని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ఆమోదించింది. 2016 జులై 21న కువైట్ లోని మిత్రిబాలో 53.9 డిగ్రీల అగ్గి వేడి నమోదైందని చెప్పింది. ఆ తర్వాత 2017 మే 28న పాకిస్థాన్ లోని తుర్బత్ ప్రాంతంలో 53.7 డిగ్రీల వేడి కాక పుట్టించిందని వివరించింది. ఆసియా ఖండంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా మిత్రిబాను గుర్తిస్తున్నట్లు డబ్ల్యూఎంఓ వెల్లడించింది. మిత్రిబా, తుర్బత్ ప్రాంతాల్లో నమోదైన వేడికి 76 ఏళ్లలో భూమ్మీద రికార్డైన ఉష్ణోగ్రతల్లో మూడు, నాలుగు స్థానాలనిస్తున్నట్టు డబ్ల్యూఎంఓ చెప్పింది. 2013 జూన్ 30న అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఫర్నేస్ క్రీక్ ప్రాంతంలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ టెంపరేచర్‌ను డబ్ల్యూఎంఓ ఈసారి లెక్కల్లోకి తీసుకోలేదు. ఇందుకు ఓ కారణం ఉంది. ఇదే ప్రదేశంలో 1913లో 56.7 డిగ్రీల వేడి నమోదైంది. భూమ్మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా దీన్ని పరిగణిస్తారు. కానీ కొందరు నిపుణులు అదెంత వరకు నిజమని ప్రశ్నిస్తున్నారు. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం అసాధ్యమంటున్నారు.

ట్యునీసియాది ఇదే కథ…

1931 జులై 7వ తేదీన ట్యునీసియాలోని కెబిలీ అనే ప్రాంతంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీన్ని భూమ్మీద నమోదైన రెండో అత్యధిక ఉష్ణోగ్రతగా భావిస్తారు. 2013లో ఫర్నేస్ క్రిక్ వేడి నిజమైనదేనని డబ్ల్యూఎంఓ ఒప్పుకుంటే, 1913లో నమోదైన వేడి, ట్యూనిసియాలో నమోదైన ఉష్ణోగ్రతా సరైనదేనని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లే  ఆ రికార్డులను లెక్కలోకి తీసుకోకుండా ఎక్కువ వేడి నమోదైన మూడు, నాలుగు ప్రాంతాలుగా మిత్రిబా, తుర్బత్‌‌ను డబ్ల్యూఎంఓ పేర్కొంది.