ప్రాణహితలో గంటగంటకూ పెరుగుతున్న వరద

ప్రాణహితలో గంటగంటకూ పెరుగుతున్న వరద
  • తుమ్మిడిహెట్టి వద్ద కార్తీక స్వామి ఆలయాన్ని తాకిన వరదనీరు

కుమ్రంభీం జిల్లా:  భారీ వర్షాలకు ప్రాణహిత నదిలో వరద పోటెత్తుతోంది. నది పరివాహక తాల్లో కురుస్తున్న భారీ వర్సాల కారణంగా ప్రాణహిత నదిలో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. గూడెం వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.  తుమ్మిడిహెట్టి వద్ద వరద నీరు కార్తీక స్వామి ఆలయాన్ని తాకాయి. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం తలాయి వద్ద ప్రాణహిత ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ గ్రామాలను ముంచెత్తుతూ పోటెత్తుతోంది. 

జలదిగ్బంధనంలో 13 గ్రామాలు
రాత్రి 8 గంటల సమయానికి 13 గ్రామాలు  జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం, సోమిని, పాత సోమిని, గేర్రే, ఇప్పలగూడ, మోగవెళ్ళి, నాగేపల్లి, కోయప్లెలి, సుష్మీర్, దొడ్డిగూడ, బండలగూడ గ్రామాలన్నీ జలమయం అయ్యాయి. ప్రాణహితకి గంట గంటకు భారీగా పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా పాత సోమిని గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చీకటి వల్ల అంధకారంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. 

ఓ వైపు భారీ వర్షాలు.. మరో వైపు ప్రాణహిత బ్యాక్ వాటర్ ముంచెత్తుతున్న తరుణంలో తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిమ్మ చీకట్లో చిక్కుకున్న గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నదికి ఉప నదిగా ఉన్న ప్రాణహిత.. తెలంగాణలోనే పుట్టి ఇక్కడే అంతర్లీనమయ్యే జీవనది ప్రాణహిత గతంలో ఎన్నడూ లేనంతగా కన్నెర్ర చేస్తూ ప్రవహిస్తోంది. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా తుమ్మిడి హెట్టికి పైభాగంలో పెన్ గంగ, వార్దా నదుల కలయికలో పుట్టిన ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో త్రివేణి సంగమం అవుతుంది. ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడంతో నది పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.