హుజూరాబాద్ లో బీజేపీ నేతల హౌస్ అరెస్టు

హుజూరాబాద్ లో బీజేపీ నేతల హౌస్ అరెస్టు

టీఆర్ఎస్, బీజేపీ బహిరంగ చర్చల సవాల్ నేపథ్యంలో హుజూరాబాద్ లో టెన్షన్ నెలకొంది. నియోజకవర్గంలోని పలుచోట్ల బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. చర్చకు సవాల్ విసిరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అనుమతి లేకుండా టీఆర్ఎస్ వేదిక ఏర్పాటు చేసుకోవడానికి, జెండాలు కట్టుకోవడానికి పోలీసులు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేవలం బీజేపీ వాళ్లను మాత్రమే అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో అటెన్షన్ డైవర్ట్ చేసి హుజురాబాద్ లో అశాంతిని రాజేసేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని వెల్లడించారు. 

హుజూరాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు చర్చనీయాంశంగా మారాయి. హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈనెల 5వ తేదీన చర్చకు రావాలంటూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తన వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి దమ్ముంటే తనపై గెలవాలని ఈటలకు కౌశిక్ సవాల్ విసిరారు. నేతల ఆరోపణలతో హుజూరాబాద్ పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయి. మరోవైపు... అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ జెండాలు ఏర్పాటు చేస్తుండగా... పోటీగా వచ్చి గులాబీ జెండాల టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం టీఆర్ఎస్ వ్యక్తులు జరిపిన దాడిలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. రెండు పార్టీల జెండాలు తొలగించినా మళ్లీ టీఆర్ఎస్ వర్గీయులు జెండాలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని, హుజూరాబాద్ ప్రజలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు.