- రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి సీతక్క
- 18న మేడారం రానున్న సీఎం రేవంత్‌రెడ్డి
తాడ్వాయి, వెలుగు : మేడారంలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. ఇందులో భాగంగానే భూములు ఇచ్చిన రైతులకు ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇంచర్ల ప్రాంతంలో భూములు కేటాయించామని చెప్పారు.
ఈ మేరకు బుధవారం మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం కోరగానే భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మేడారం జాతరలో షాపులు సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మేడారం భూసేకరణ పనులను పారదర్శకంగా చేపట్టిన కలెక్టర్ దివాకర్ టీఎస్, ఆర్డీవో వెంకటేశ్వర్లును మంత్రి సీతక్క అభినందించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఆదివాసీ-, గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ల్యాండ్ స్కేపింగ్ చేపట్టాలని సూచించారు. క్యూ లైన్ కాంప్లెక్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
18న సీఎం రాక.. 19న మేడారం గద్దెలు, ప్రాంగణ పనుల ప్రారంభం
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 18న మేడారం రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి బుధవారం మేడారం హరిత హోటల్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 18న మేడారం చేరుకోనున్న సీఎం రాత్రి ఇక్కడే బస చేసి 19న సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
18న ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా థింసా, కోయ, గుస్సాడి, కొమ్ము కోయ తదితర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ దివాకర వెల్లడించారు. రివ్యూలో అడిషనల్ కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, ఆర్డీవో వెంకటేశ్ పాల్గొన్నారు.
