సిటీలో ఇండ్లకు మస్తు గిరాకీ

సిటీలో ఇండ్లకు మస్తు గిరాకీ
  • జనవరి  నుండి రూ. 12 వేల కోట్ల విలువైన  సేల్స్​
  • 1,000, - 2,000 చ.అ. ఇండ్లకు మస్తు గిరాకీ
  • ఏప్రిల్​లో రూ. 2,767 కోట్ల విలువైన ఇండ్లు అమ్మకం  
  • వెల్లడించిన నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టు

హైదరాబాద్, వెలుగు: కరోనా, యుద్ధం, ఇన్​ఫ్లేషన్​ వంటి సమస్యలేవీ హైదరాబాద్​ రియల్టీ పరుగును అడ్డుకోలేకపోతున్నాయి. ఈ ఏడాదిలో ఏప్రిల్​ వరకు హైదరాబాద్​లో రూ.12 వేల కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. దీని ప్రకారం... ఏప్రిల్‌‌లో హైదరాబాద్‌‌లో 5,331 ఆస్తుల అమ్మకాలు రికార్డయ్యాయి.  మొత్తం అమ్మకాల్లో హైదరాబాద్​ రెసిడెన్షియల్​ మార్కెట్లో  (మేడ్చల్–మల్కాజిగిరి​, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు కలిపి) వాటా 15 శాతం వరకు ఉంది. ఈ మార్కెట్లో అన్ని కేటగిరీల ప్రాపర్టీల ధరలు పెరిగాయి.  ఈ ఏడాది ప్రారంభం నుంచి రెసిడెన్షియల్ ఆస్తుల మొత్తం రిజిస్ట్రేషన్లు 24,797 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 ఏప్రిల్​లో లావాదేవీలు జరిపిన ఆస్తుల మొత్తం విలువ రూ. 2,767 కోట్లకు చేరుకుంది (ఏడాది లెక్కన 10శాతం పెరుగుదల). 2022 జనవరి నుండి రిజిస్టర్ అయిన అన్ని ఆస్తుల పూర్తి విలువ  రూ. 11,998 కోట్లకు చేరింది. అయితే పోయిన ఏప్రిల్​తో పోలిస్తే ఈసారి ఏప్రిల్​ ఆస్తి రిజిస్ట్రేషన్ల  సంఖ్య 10 శాతం తగ్గింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌లో హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి, రంగారెడ్డి  సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. 

రూ. 25-రూ. 50 లక్షల కేటగిరీకీ గిరాకీ

2022 ఏప్రిల్​లో రికార్డయిన రెసిడెన్షియల్ అమ్మకాలలో రూ. 25 లక్షలు – 50 లక్షల మధ్య ధర గల ఇండ్ల అమ్మకాల వాటా 53శాతం ఉంది.  రూ. 25 లక్షలు  కంటే తక్కువ ధర గల యూనిట్ల వాటా 17శాతమే ఉంది.  2022 ఏప్రిల్​లో  ఇతర టిక్కెట్-సైజ్ విభాగాల అమ్మకాల రిజిస్ట్రేషన్లు ఏడాది లెక్కన కొంచెం పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న యూనిట్ల అమ్మకాల వాటా  2022 ఏప్రిల్​లో జరిగిన మొత్తం ఇండ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్‌‌లలో సుమారు 83 శాతం వరకు ఉంది. వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల మధ్య ఉండే ఇండ్ల వాటా  72శాతం వరకు ఉంది. ఇండ్ల కొనుగోలుదారులు అప్‌‌గ్రేడేషన్​ కోసం పెద్ద బంగళాలు కొనడం పెరిగింది.  2022 ఏప్రిల్‌‌లో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఇండ్ల రిజిస్ట్రేషన్లు 44శాతం రికార్డు కాగా, రంగారెడ్డి జిల్లాలో 40శాతం రికార్డు అయ్యాయి.  2022 ఏప్రిల్​లో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ మార్కెట్​ వాటా 15శాతం ఉంది. రెసిడెన్షియల్​ ప్రాపర్టీల సగటు ధరలు 2022 ఏప్రిల్​లో సంవత్సరం లెక్కన 20శాతం పెరిగాయి. సంగారెడ్డి ప్రాంతంలో ధరలు 2022 ఏప్రిల్‌‌లో అత్యధికంగా 36శాతం పెరిగాయి.  ఇటీవలి కాలంలో హైదరాబాద్ జిల్లాలో ధరల పెరుగుదల బాగా ఉంది. 2022 ఏప్రిల్​లో హయ్యర్​ వాల్యూ ప్రాపర్టీల ఆస్తుల అమ్మకాలు పెరిగాయి.  హైదరాబాద్‌‌ జిల్లాలోని అన్ని మైక్రో-మార్కెట్లలో వెయిటెడ్ సగటు ధర పెరిగిందని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు పేర్కొంది. 

జిల్లాల వారీగా అమ్మకాలు ఇలా ఉన్నాయి

జిల్లా                                     ఏప్రిల్ 2021                    2022 ఏప్రిల్
                                                             (సంఖ్యలన్నీ శాతాల్లో)
హైదరాబాద్                            15                                      15 
మేడ్చల్ 
మల్కాజిగిరి                             41                                      44
రంగారెడ్డి                                 39                                        40 
సంగారెడ్డి                                 5                                          1