- అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తిచేసి ఈ ఏడాది మార్చిలోపు కేటాయించాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ఎండీ స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇండ్ల పనులను కార్పొరేషన్ సీఈ చైతన్య కుమార్, స్పెషల్ ఆఫీసర్ బలరాంలతో కలిసి ఎండీ గురువారం పరిశీలించారు. కర్మన్ ఘాట్ నందనవనం కాలనీ, మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో డబుల్ ఇళ్లను తనిఖీ చేశారు.
కర్మన్ ఘాట్ నందనవనం కాలనీలో పునరావాసంలో భాగంగా నిర్మించిన 2 బీహెచ్ కే 80 (2 బ్లాక్ లను) ఫ్లాట్స్ ను కూడా ఎండీ పరిశీలించారు. పూర్తయిన వాటిని వారం రోజుల్లో లాటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే మల్లాపూర్ లో నిర్మాణంలో ఉన్న 17 బ్లాక్ ల పనులను కూడా పరిశీలించారు.
ఈ ప్రాంతంలో భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైతే హైడ్రా అధికారుల సహాయం తీసుకోవాలని స్థానిక తహశీల్దార్ కు ఎండీ సూచించారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గం కుర్మల్ గూడలో పూర్తికావస్తున్న ఫ్లాట్లను కూడా పరిశీలించారు.
