ఇందిరమ్మ స్కీమ్ లో అవినీతిని ఉపేక్షించం : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ స్కీమ్ లో అవినీతిని ఉపేక్షించం : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
  •     ఇండ్ల స్టేటస్​ను స్థానిక ఎమ్మెల్యేలకు వివరించండి 
  •     అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి 
  •     మార్చ్ చివరి నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేయాలి 
  •     హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీర్లకు కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కలెక్టర్ల రిపోర్టుల ఆధారంగా పంచాయతీ సెక్రటరీల నుంచి హౌసింగ్ శాఖ అధికారుల వరకు అందరిపైనా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

శనివారం హిమాయత్ నగర్ లోని కార్పొరేషన్ ఆఫీస్ లో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు, డిప్యూటీ ఇంజనీర్లతో ఎండీ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఇల్లు మంజూరైన ప్రతి లబ్దిదారుడు పనులను ప్రారంభించేలా పీడీలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి చర్యలు చేపట్టాలన్నారు. 

నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణ స్టేటస్ ను స్థానిక ఎమ్మెల్యేలకు వివరించాలని, ఇండ్లను పూర్తి చేయడంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఎండీ సూచించారు. ప్రస్తుత ఇండ్ల నిర్మాణాల పురోగతిని కొనసాగిస్తూ.. మార్చి నెలకల్లా లక్ష ఇండ్లను పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఆన్ లైన్ లో అధికారులకు అందుబాటులో ఉందన్నారు. ఇంటి నిర్మాణ పనులు ఆగితే లబ్దిదారులతో మాట్లాడి, సమస్య తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను, వాటి అలాట్ మెంట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి అన్ని నిర్మాణాలను సెప్టెంబరు నాటికల్లా పూర్తి చేయాలన్నారు. ఈ రివ్యూలో కన్సల్టెంట్ ఈశ్వరయ్య, సీఈ చైతన్యకుమార్, స్పెషల్ ఆఫీసర్ బలరాం, జీఎంలు మమత, శ్రీదేవి, ఎస్ఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు.