చర్చలు పూర్తికాకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు?

చర్చలు పూర్తికాకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు?
  •  థాక్రేపై కాంగ్రెస్  నేత సంజయ్ ఫైర్

న్యూఢిల్లీ: ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి శివసేన తరపున అభ్యర్థిని ప్రకటించినందుకు ఆ పార్టీ చీఫ్​ ఉద్ధవ్  ఠాక్రేపై కాంగ్రెస్  నేత సంజయ్  నిరుపమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీట్ల పంపకంపై మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో చర్చలు పూర్తికాక ముందే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. 

లోక్ సభ ఎన్నికల కోసం ప్రస్తుతం ఎంవీఏ కూటమిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ టైంలో అభ్యర్థిని డిక్లేర్  చేయడంపై ఆయన మండిపడ్డారు. శివసేనలో ఒకే ఒక్క నేత (పార్టీ చీఫ్​ ఉద్ధవ్ థాక్రే) మాత్రమే మిగిలి ఉన్నారని విమర్శించారు. ‘‘ముంబై నార్త్ వెస్ట్  సీటు వారిది అని శివసేన చెబుతోంది. ఈ సీటు నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది గెలిచారు.

 ఈసారి నేను ఈ సీటు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. ఐదేండ్లుగా అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నా. ఈ సమయంలో కూటమిలో చర్చలు ముగియకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు? ఇది కూటమి ధర్మాన్ని ఉల్లంఘించడం కాదా? కాంగ్రెస్  పార్టీని అవమానించడానికి కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎంవీఏ కూటమి 24 సార్లు సమావేశమైనా ఇంకా ఆ సీటుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 

ఈ సీటుపై కాంగ్రెస్  పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాతే అభ్యర్థిని ప్రకటించాలి” అని సంజయ్  వ్యాఖ్యానించారు. ఉద్ధవ్  ప్రకటించిన అభ్యర్థి అమోల్ కీర్తికర్ పైనా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఖిచిడి స్కామ్’లో కీర్తికర్  హస్తం ఉందని, కరోనా సమయంలో వలస కార్మికులకు బృహన్  ముంబై మునిసిపల్  కార్పొరేష్  (బీఎంసీ) ప్రారంభించిన పథకంలో కూడా కీర్తికర్  లంచాలు, కమీషన్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.