హనుమాన్ భక్తులను లాఠీలతో కొడ్తారా?

హనుమాన్ భక్తులను లాఠీలతో కొడ్తారా?
  • సీపీవా ... రౌడీవా?
  • కేసీఆర్ ఆదేశాలతోనే ఈ దాడులు
  • కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నడు
  • వరి వేస్తే ఉరి అని ఆయనే అన్నడు
  • కేంద్రం  ధాన్యాన్ని కొంటుంది : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: ‘హనుమాన్ భక్తులను లాఠీలతో కొడ్తారా? హిందువులంటే అంత చులకనా’ అంటూ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బోధన్ లో హిందూ యువకులపై టీఆర్ఎస్, ఎంఐఎం, పోలీసులు కలిసి దాడి చేశారని ఆయన ఆరోపించారు. బోధన్ లో శివాజీ విగ్రహ ఏర్పాటు బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిన చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మునిసిపాలిటీ అనుమతితో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన హిందూ యువకులపై సీపీయే స్వయంగా దాడికి దిగడం సిగ్గు చేటన్నారు. సీపీవా లేక రౌడీవా అంటూ సీపీపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అనుమతితోనే కొంత మంది పోలీసు అధికారులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో షెరియత్ చట్టాలను అమలు చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకే హిందూ సమాజంపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బోధన్ లో శివాజీ విగ్రహం పెట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 

వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఫాంహౌజ్ లో మంత్రులతో మీటింగ్ పెట్టి కేంద్రంపై యుద్ధం చేద్దామని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వరి కోనుగోలు విషయంలో కేంద్రం రైతులను మోసం చేస్తుందని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొంటానని చెప్పిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తున్నట్లు ఎందుకు చెప్పారని కేసీఆర్ని ప్రశ్నించారు. వానాకాలానికి సంబంధించి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని, కానీ కేసీఆర్ ఈ విషయంలో డ్రామాలాడుతున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని వేశాలేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ధాన్యాన్ని కొంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.