కూల్చేయాలని ఎట్ల నిర్ణయిస్తారు?

కూల్చేయాలని ఎట్ల నిర్ణయిస్తారు?

హైదరాబాద్‌, వెలుగు: ఎర్రమంజిల్ కూల్చొద్దంటూ దాఖలైన పలు పిల్స్ పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీ లేకుండానే ఎర్రమంజిల్ ను కూల్చి అసెంబ్లీ, శాసనమండలి బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టాలని సర్కారు ఎలా నిర్ణయం తీసుకుంటుందని పిటిషనర్ తరపున లాయర్ నళిన్ కుమార్ వాదించారు. ఎర్రగడ్డ బిల్డింగ్‌ కేసులో హెరిటేజ్‌ కన్సర్వేటివ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితం హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ ఆ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. వారసత్వ కట్టడాల జాబితాలోని బిల్డింగ్‌ తొలగించాలన్నా, చేర్చాలన్నా, రిపేరు చేయాలన్నా కమిటీ పర్మిషన్ అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఎదుట వాదనలు వినిపించారు.

13వ రెగ్యులేషన్‌ హెచ్ఎండీఏ యాక్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌లో కూడా ఉందన్నారు. వారసత్వ కట్టడాన్ని కూల్చాలంటే ఆ యాక్ట్‌లోని 15వ సెక్షన్‌ ప్రకారం చేయాలన్నారు. హెచ్ఎండీఏ యాక్ట్‌లో 13వ రెగ్యులేషన్‌ రద్దు చేసినా  జోనల్‌ రెగ్యులేషన్‌లో కొనసాగిస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని హైకోర్టును కోరారు. 13వ రెగ్యులేషన్ హెచ్ఎండీఏ యాక్ట్‌లో లేదని, మాస్టర్‌ ప్లాన్‌లో ఉందని గతంలో చెప్పారని, ఈరోజు దానికి భిన్నంగా హెచ్ఎండీఏ యాక్ట్‌లో 13వ రెగ్యులేషన్‌ వర్తించదని, జోనల్‌ రెగ్యులేషన్‌కు ప్రతిపత్తి ఉందంటూ ద్వంద్వ పద్ధతుల్లో వాదిస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్​ను హైకోర్టు ఆదేశించింది. విచారణ బుధవారానికి వాయిదా పడింది.