
న్యూయార్క్: ప్రపంచంలో అపర కుబేరులుగా పేరొందిన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్ తదితరులు ఆదాయపు పన్ను కట్టకుండా ఎగ్గొట్టారు. ఈ వివరాలను తాజాగా ప్రో పబ్లికా అనే వార్తా సంస్థ ప్రచురించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు కడుతున్న ట్యాక్స్ రిటర్నులను తాము పరిశీలించినట్లు ఈ వెబ్‌సైట్ చెప్పింది. అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ 2007, 2011 సంవత్సరాల్లో, ఎలాన్ మస్క్ 2018లో అసలు ట్యాక్స్ చెల్లించినట్లు దాఖలాలే లేవని చెప్పింది. బ్లూమ్‌బర్గ్ ఎల్పీ ఫౌండర్ మైఖల్ బ్లూమ్‌బర్గ్, ఇన్వెస్టర్స్ కార్ల్ ఇకాన్, జార్జ్ సోరోస్ కూడా ఇటీవలి సంవత్సరాల్లో అతి తక్కువ ట్యాక్స్‌లు కట్టినట్లు తెలిసింది. 2014, 2018 మధ్య వారెన్ బఫెట్ ఆదాయం 2,430 కోట్ల డాలర్లు పెరుగగా, 2.37 కోట్ల డాలర్లు మాత్రమే ట్యాక్స్ చెల్లించినట్లు ప్రో పబ్లికా డేటాలో వెల్లడైంది. ఈ ట్యాక్స్ వివరాలు బయటకురావడం చట్ట వ్యతిరేకమని, దీని గురించి ఎఫ్‌బీఐ, ట్యాక్స్ ఆఫీసర్లు విచారణ చేస్తున్నారని వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు. ఆదాయపు పన్ను వివరాలకు సంబంధించిన పత్రాలు బయటపడటం సెక్యూరిటీ అంశాలను తెరపైకి తెచ్చిందని, వీటిని బయటపెట్టిన వారి గురించి తెలుసుకుంటామని న్యూయార్క్ మాజీ మేయర్ అన్నారు. ప్రత్యేకంగా ఏ ఒక్కరి గురించి ప్రస్తుతం తాను ఏమీ మాట్లాడలేనని, ఈ వివరాలు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) నుంచి లీక్ అయ్యాయనే విషయంపై మాత్రం విచారణ జరగుతోందని యూఎస్ ఐఆర్‌ఎస్ కమిషనర్ చార్లెస్ రెట్టిగ్ చెప్పారు. డేటా లీక్ చేసిన వారు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు.