వాకింగ్.. ఎంత నడవాలి? ఎలా నడవాలి?

వాకింగ్.. ఎంత నడవాలి? ఎలా నడవాలి?

నడవాలి, నడవాలి... నడవాలి. హెల్త్​కి చాలా మంచిది. నడవాలి నిజమే... కానీ, ఎలా నడవాలి? ఏదైనా తిని నడవాలా? తినకుండా నడవాలా? షూస్ వేసుకోవాలా? చెప్పులైనా ఓకేనా? గడ్డి మీద నడవాలా? ఎత్తు పల్లాల్లోనా? స్ట్రెయిట్ రోడ్​ బెటరా? ఏదో అలా నడుచుకుంటూ పోయేదానికి ఇన్ని ప్రశ్నలు అడగాలా? అనిపిస్తోంది కదా!  అడగాలి మరి.. ఏ పని చేసినా దానికో లెక్క ఉండాలి. అందుకే వాకింగ్ చేయాలంటే ఇలాంటివే చాలా గుర్తుపెట్టుకోవాలి.

నడక అనేది కూడా ఒక వ్యసనం లాంటిదే కొందరికి. కొందరేమో అప్పుడప్పుడు నడుస్తుంటారు. రెగ్యులర్​గా నడవాలన్నదేమీ ఉండదు వీళ్లకు. ఇంకొందరుంటారు... వీకెండ్స్, సెలవుల్లో టైం దొరికిందని ఎక్కువసేపు వాకింగ్ చేస్తారు. దాంతో శరీరం బాగా అలసిపోతుంది. అందుకే ఇలా చేయకూడదు. కంటిన్యూస్​గా ఒకే స్పీడ్​లో నడిచేవాళ్లు ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. మరి ఎలా నడవాలి? కాసేపు మెల్లగా, కాసేపు ఫాస్ట్​గా నడవాలి. అప్పుడు బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అదే అన్నివిధాలా మంచిది.

నడవాలనే ఉద్దేశం మంచిదే. నడవాలని మనసులో అనుకోవడం, నడిచే ఉత్సాహం ఉంటే సరిపోదు. నడిచేందుకు సరైన షూ వేసుకోవాలి. లేదంటే కొత్త సమస్యలు నడిచి వచ్చేస్తాయి. చెమట పీల్చే సాక్స్​లు వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్​. వాకింగ్​ చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు కాకుండా... ప్రతి అడుగును ఎంజాయ్​ చేస్తూ చేయాలి. అలా చేసినప్పుడు మనసు, శరీరం రెండూ హెల్దీగా తయారవుతాయి. అందుకని ఒకే దారిలో లేదా ప్లేస్​లో కాకుండా వారం రోజులకు ఒకసారి ప్లేస్​ మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వాకింగ్​ బోర్​ కొట్టదు. 
వాకింగ్ అంటే కాళ్లకు మాత్రమే పని అనుకుంటారు. కానీ, కాళ్లతోపాటు చేతులు కూడా రిథమిక్​గా కదపాలి. ఎడమ కాలు ముందుకేస్తే, కుడి చెయ్యి ముందుకు రావాలి. ఇలా ఒక టెక్నిక్​ ఫాలో అవుతూ నడవాలి. దానివల్ల గుండెకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగని రెండు చేతులు వేలాడేసి నడవకూడదు. ఫాస్ట్​గా ఊపకూడదు. సగం వరకు వంచుతూ చేతులు కదపాలి. అలా చేయడం వల్ల కండరాలకు మంచి ఎక్సర్​సైజ్​ అవుతుంది. క్యాలరీలు కూడా ఎక్కువ ఖర్చవుతాయి. క్యాలరీలు ఒక్కటి కరిగితే ఏం లాభం? ఎన్ని నెలల నుంచి నడుస్తున్నా పొట్ట ఇంచు కూడా తగ్గలేదని బాధపడేవాళ్లకు ఒక గుడ్​న్యూస్​. అదేంటంటే... వాకింగ్ చేసినా, పొట్ట తగ్గనివాళ్లు నడిచేటప్పుడు పొట్టని కొంచెం లోపలికి లాగుతూ నడవాలి. అప్పుడు లోపలి కండరాలు కూడా కదిలి, పొట్ట తగ్గుతుంది. 

తోడొకరుండిన...
ఏ పనికైనా పక్కనే ఒక తోడు ఉంటే బాగుంటుంది. అందుకే వాకింగ్​కు కూడా జతగా ఒక వాకర్​ను పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ , ఫ్యామిలీ, పార్ట్​నర్​​, పెట్స్​​తో వాకింగ్​కి వెళ్తే యాక్టివ్​గా నడవొచ్చు. ఫోన్​లో పాటలు వింటూ నడిచే అలవాటు ఉందా? అయితే చెవులు పేలిపోయే సౌండ్​ కాకుండా కాస్త తక్కువ సౌండ్​ పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా సిటీల్లో రోడ్ల మీద నడిచేవాళ్లు, పరిసరాలు గమనిస్తూ నడవకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాకింగ్​కు మరోముఖ్యమైనవి వాకింగ్​కు వేసుకునే బట్టలు. ఈ బట్టలు మరీ లూజ్​గా, టైట్​గా ఉండకూడదు. అలాగే కాటన్​ డ్రెస్​లు వేసుకుంటే అన్ని రకాలుగా కంఫర్ట్​గా ఉంటుంది. ఈ మధ్య ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది ఎండ. అందుకని నెత్తికి టోపీ, కూలింగ్​ గ్లాసెస్​ తప్పనిసరి. అదే వానాకాలంలో అయితే రెయిన్​ కోట్​, గొడుగు దగ్గర ఉండాల్సిందే. వాకింగ్​కు అంతా రెడీ అయ్యాక బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అదేంటంటే వాకింగ్​ మొదలుపెట్టేముందు నీళ్లు తాగడం మర్చిపోవద్దు. నీళ్లు తాగమన్నారు కదాని మరీ ఎక్కువ తాగొద్దు. అలా తాగితే బ్లడ్ సర్క్యులేషన్​ను పొట్ట వైపుకు మళ్లిస్తుంది. దాంతో ఎనర్జీ తగ్గుతుంది. ఎక్కువసేపు వాకింగ్​ చేయలేరు. ఆయాసం కూడా వస్తుంది. ఎండాకాలంలో 200 నుంచి 300 ఎం.ఎల్. నీళ్లు తాగాలి. నీళ్లు​ తాగలేకపోతే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగొచ్చు. కొందరికి వాకింగ్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల నడిచి ఉపయోగం ఉండదు.

అలా వద్దే వద్దు
వాకింగ్​ షూ లేకపోతే నడవకూడదా? అనే ప్రశ్న అడుగుతుంటారు కొందరు. అవును వాకింగ్​ షూ వేసుకునే నడవాలి.  లేదంటే రెగ్యులర్​ షూ అయినా వేసుకోవచ్చు. కానీ, చెప్పులు మాత్రం వాకింగ్​కి వాడొద్దు. ఇవేవీ లేకుండా... అంటే చెప్పులు, షూస్​ ఏం లేకుండా ఒట్టి కాళ్లతో వాకింగ్ చేస్తే యాక్టివ్​గా ఉండొచ్చు. అయితే రాళ్లు, రప్పలు, ముళ్లు, గాజు పెంకులు లేని ప్లేస్​లో నడవాలి. కొన్ని రోడ్ల మీద అలాంటివేం లేకున్నా రోడ్డే గతుకులుగా ఉంటుంది. అది కూడా ఇబ్బందే. నడవడానికి వీలుండదు. అందుకని వాకింగ్​ ఏరియా బాగుంటేనే షూస్​ లేకుండా నడవాలి. లేదంటే మాత్రం కచ్చితంగా షూస్ వేసుకోవాలి. నిజానికి ఒట్టి కాళ్లతో వాకింగ్ చేయడం మంచిది. కానీ, ఎలాంటి రోడ్డు లేదా ప్లేస్​లో చేస్తున్నారనేది ఇంపార్టెంట్. 

అందరూ చేయాల్సిందే
రోజూ కాసేపు వాకింగ్ చేయమంటే.. కొందరేమో ‘‘కాళ్లు నొప్పులొస్తాయి. కీళ్లు అరిగిపోతాయి. ఆయాసం వస్తుంది’’ అని రకరకాల కారణాలు చెప్తుంటారు. ఇంకొందరేమో వాకింగ్ మొదలుపెట్టాలంటే రేపు, ఎల్లుండి అని వాయిదా వేస్తుంటారు. అలాంటి వాళ్లకు వాకింగ్ చేయడం వల్ల బోలెడు లాభాలున్నాయని తెలిస్తే.. బద్ధకం పటాపంచలైపోతుంది. రోజూ కాసేపు నడిచి చూడండి... మీ ఆరోగ్యం రిమోట్​ మీ దగ్గరే ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వాకింగ్​ చేయాల్సిందే అంటారు డాక్టర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే నడక మానేస్తే అనుకున్నంత బాగా లైఫ్ నడవదు. వాకింగ్​ చేయకపోవడం ఒక ఎత్తైతే....  వాకింగ్ సరైన పద్ధతిలో చేయరు. ఇలాంటి వాళ్లు రోజుకి ఎంతసేపు చేయగలుగుతున్నాం? అనే విషయాన్నే పట్టించుకోరు. ఇలాంటి వాళ్లంతా వాకింగ్​ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

వాకింగ్​ వరాలబుట్ట
ఇప్పుడున్న లైఫ్ స్టైల్​ వల్ల చాలామందికి బీపీ, షుగర్, ఆర్థరైటిస్​, స్ట్రెస్, ఒబెసిటీ వంటి జబ్బులున్నాయి. వీటన్నింటికీ వాకింగ్ అవసరం. క్రమం తప్పకుండా రోజూ వాకింగ్ చేస్తే కండరాలు బలంగా తయారవుతాయి. వాకింగ్ చేయడం వల్ల టెండెన్సీ ఫాల్... అంటే పెద్ద వయసు వాళ్లు బాడీ బ్యాలెన్స్​ లేక ఊరికే పడిపోతుంటారు. వాకింగ్ చేయడం వల్ల ఆ బ్యాలెన్స్ వస్తుంది. బాడీ కో–ఆర్డినేషన్​ పెరుగుతుంది. అలాగే నడవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కాబట్టి ఎముకలు విరిగే రిస్క్ తగ్గుతుంది. మూడ్​ మారి, డిప్రెషన్ తగ్గుతుంది. బుర్ర చురుకు​గా ఉండటం వల్ల అల్జీమర్స్ రాదు. రక్తప్రసరణ పెరుగుతుంది. కాబట్టి బీపీ తగ్గి, స్ట్రోక్​ రాకుండా ఉంటుంది. వాకింగ్ చేయడం అనేది బాడీ పార్ట్స్​ అన్నింటికీ మంచిదే. ఫిట్​గా, యాక్టివ్​గా ఉండొచ్చు. చేసే పనిలో ఏకాగ్రత ఉంటుంది. దానికి తగ్గట్టే మంచి రిజల్ట్ వస్తుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. గర్భిణులకు అబార్షన్స్​ కావు. సీజనల్ ఫీవర్స్ రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే వాకింగ్ చాలా అవసరం. అయితే, ఈరోజుల్లో చాలామందికి కామన్​గా ఉండే సమస్యలు రెండే. ఒకటి ఓవర్ వెయిట్. రెండోది స్ట్రెస్​. వీటినుంచి బయటపడాలని ఎన్నో చేస్తుంటారు. కానీ, వాటన్నింటికంటే ముందు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. 

బరువు తగ్గుతారు
ప్రపంచం మొత్తంగా ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య బాగా  లావవ్వడం. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిది. క్యాలరీలు కరిగి... కచ్చితంగా బరువు తగ్గుతారు. కాకపోతే వాకింగ్​తో పాటు డైట్ కూడా కరెక్ట్​గా ఫాలో కావాలి. అలాకాకుండా ‘‘వాకింగ్ చేస్తున్నాం కదా’’ అని ఏది పడితే అది తింటే లాభంలేదు. రోజుకి ఎన్ని క్యాలరీలు లోపలికి పంపిస్తున్నామో... అన్ని క్యాలరీలు ఖర్చు చేయాల్సిందే. వాకింగ్​తో క్యాలరీలు ఖర్చు చేయలేకపోతే, వేరే ఏవైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేసి కూడా క్యాలరీలు కరిగించొచ్చు.

ఒత్తిడి తగ్గుతుంది
ఒత్తిడి ఒంటికి చేసే హాని అంతా ఇంతా కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎండోక్రైన్ హార్మోన్స్​ రిలీజ్ అవుతాయి. వాకింగ్ చేస్తే ఆ హార్మోన్స్​ రిలీజ్​ అయ్యే ప్రాసెస్​ మారిపోయి ఒత్తిడి​ నుంచి బయటపడేస్తుంది. కాకపోతే వాకింగ్ చేసేటప్పుడు నడక మీదే దృష్టి పెట్టాలి. అప్పుడు శరీరంలో ఎండార్ఫిన్​లు రిలీజ్​ అవుతాయి. ఇవి నేచురల్ పెయిన్ కిల్లర్స్​లా పనిచేస్తాయి. దాంతో మూడ్ మారిపోతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్​గా అనిపిస్తుంది. వాకింగ్ రెగ్యులర్​గా చేయడం వల్ల నిద్రలేమి (ఇన్​సోమ్నియా) సమస్య దరిచేరదు.

మార్నింగ్​ వాక్ మంచిదే...
ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాకింగ్​ చేయడం మంచిదే. అయితే అదేదో పొద్దునపూట నడిస్తే కాస్త ఎక్కువ మంచిది. ఎందుకంటే అప్పుడు వాతావరణంలో తాజా గాలి ఉంటుంది. లంగ్స్​లో బ్లడ్​ని ఫిల్టర్​ చేయడానికి ఆ గాలి బాగా ఉపయోగపడుతుంది. చుట్టూ చెట్లు ఉన్న చోట, పార్కుల్లో నడిస్తే ఇంకా మంచిది. రోడ్డు మీద నడిస్తే పొల్యూషన్​లో వాకింగ్ చేసినట్టే. దీనివల్ల దగ్గు, తుమ్ములు, డస్ట్ అలర్జీలు వస్తాయి. అందుకని రోడ్డు మీద వాకింగ్ చేస్తూ, పొల్యూషన్​ బారినపడటం కంటే మొక్కలు, చెట్ల గాలి పీలుస్తూ ప్రశాంతంగా వాకింగ్ చేయడం బెటర్. మార్నింగ్ వాక్​ వల్ల డి–విటమిన్ కూడా అందుతుంది. మాకు సాయంత్రాలే టైం కుదురుతుంది అప్పుడు వాకింగ్​ చేయకూడదా? అంటే... ఎందుకు చేయకూడదు. చేయొచ్చు. కాకపోతే సాయంకాలానికి కాలుష్యం పెరిగిపోతుంది. పొద్దంతా పనిచేసి మీరు కూడా అలసిపోతారు. అందుకని వాకింగ్ సరిగా చేయలేరు. ఆస్తమా, న్యుమోనియా ఉన్నవాళ్లు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాకింగ్​కి వెళ్లకపోవడం మంచిది.

వామప్ అవసరమా?
వాకింగ్​ చేయడమే ఎక్సర్​సైజ్​ కదా... మళ్లీ దానిముందు వామప్​ లాంటివి చేయడం అవసరమా? అనిపించొచ్చు. కానీ వామప్​ అనేది చాలా అవసరం. ఎందుకంటే జాయింట్స్​ అన్నీ టైట్​గా ఉంటాయి. అందుకనే వాకింగ్​కు ముందు కాళ్లు చేతులు కదిలించి వామప్ చేయాలి. ఆ తర్వాత వాకింగ్​ చేయాలి. అలాగే బ్రిస్క్ వాకింగ్ చేయాలనుకుంటే ముందు మామూలుగా వాకింగ్​ చేయాలి. ఆ తరువాతే బ్రిస్క్​ వాక్​ మోడ్​లోకి వెళ్లాలి. ఇదీ వాకింగ్ చేసే పద్ధతి. ఏదో డాక్టర్‌‌‌‌‌‌‌‌ చేయమన్నారని హడావిడిగా పది నిమిషాలు వాకింగ్​ చేసి అయింది అనిపించడం కాదు. ప్రతిరోజు ఎంతసేపు నడవాలనే గోల్ పెట్టుకోవాలి. అలాగే ఏ ఏరియాలో నడవాలనేది కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ లేకుండా, స్ట్రెయిట్​గా, ఫ్లాట్​గా ఉండే రోడ్డు మీద వాకింగ్​ చేయడం బెటర్.

ట్రెడ్​మిల్ వాకింగ్ 
నార్మల్ వాకింగ్ చేసేవాళ్లు చెమట వచ్చేంతవరకు చేయాలి. ట్రెడ్​మిల్ మీద చేసేవాళ్లు కూడా అంతే. ట్రెడ్​మిల్ వాకింగ్ కూడా మంచిదే. ఫిట్​నెస్, డైటింగ్ చేస్తూ ఫిజిక్ మెయింటెయిన్ చేయాలనుకునేవాళ్లు ట్రెడ్​మిల్ వాకింగ్ చేస్తారు. అలాంటి వాళ్లు నార్మల్ వాకింగ్ చేయలేరు. చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ల లెక్క ప్రకారం రోజుకి ఇన్ని క్యాలరీలు ఖర్చవ్వాలి అనే టార్గెట్ ఉంటుంది. పైగా క్యాలరీల్లో కూడా రకరకాలుంటాయి. నార్మల్ వాకింగ్ చేసేవాళ్లలో తక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. బ్రిస్క్ వాకింగ్ చేసేవాళ్లలో ఇంకొంచెం ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ట్రెడ్​మిల్ మీద చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. అయితే, ట్రెడ్​మిల్​ వాకింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి డయాబెటిస్, బీపీ పేషెంట్స్​కి సడెన్​గా కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంటుంది.​ హార్ట్ పేషెంట్స్​కి సడెన్​గా చెస్ట్ పెయిన్​ వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మాత్రం ఏది చేసినా జాగ్రత్తగా చేయాలి. ఎక్స్​పర్ట్స్​ సలహాలతో చేయాలి.

తిన్నాకా..? తినకముందా?
మార్నింగ్ లేదా ఈవెనింగ్ ఎప్పుడైనా తినక ముందే వాకింగ్ చేయాలి. కడుపు నిండా తిని మాత్రం అస్సలు వాకింగ్ చేయకూడదు. వాకింగ్ అనేది ఖాళీ కడుపుతోనే చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు కాళ్లు, చేతుల్లోని కండరాలు ఎక్కువగా కదులుతాయి. దాంతో వాటికే బ్లడ్ ఎక్కువ సరఫరా అవుతుంది. వాటి నుంచి మిగతా పార్ట్స్​కి వెళ్తుంది. అలాకాకుండా తిన్నాక చేస్తే, బ్లడ్ సర్క్యులేషన్ డైజెషన్​ వైపు మళ్లుతుంది. దాంతో డైజెషన్ ప్రాసెస్​కి ఇబ్బంది అవుతుంది. కాకపోతే కొంతమందికి లైట్​గా ఫుడ్, లిక్విడ్స్​ తీసుకుని చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఉంటే కనుక వాళ్ల ప్రిఫరెన్స్​ బట్టి లైట్​గా టీ, కాఫీ, ఫ్రూట్, జ్యూస్ తాగాక చేయొచ్చు

వాకింగ్​ మీద రీసెర్చ్​లు ఎన్నో...
వాకింగ్​ గురించి చెప్పుకుంటే ఇలా చాలానే విషయాలు ఉన్నాయి. అయితే ఇవేకాకుండా... వాకింగ్​ మీద ఇప్పటికే రకరకాల రీసెర్చ్​లు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి కూడా. ఇంతవరకు చేసిన రీసెర్చ్​ల్లో కొన్ని ఏం చెప్తున్నాయంటే...

సెప్టెంబర్ ఛాలెంజ్  
పోయినేడాది ఆస్ట్రేలియాలో ప్రజలు లాక్​డౌన్​ టైంలో ఫిట్‌‌‌‌నెస్​ మీద దృష్టి పెట్టారు. రోజూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. కొందరేమో ‘స్టెప్​టెంబర్’​ అనే ఛాలెంజ్​లో చేరారు. ఈ ఛాలెంజ్​లో.. సెప్టెంబర్​ నెలలో నడిచారు. కానీ, వీళ్లు నడిచేది వాళ్ల ఫిట్​నెస్ కోసమో, గిన్నిస్ రికార్డు కోసమో కాదు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వాళ్లకు కావాల్సిన ట్రీట్​మెంట్, రీసెర్చ్​కోసం ఫండ్స్​ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ మొదలుపెట్టారు. ఈ ఛాలెంజ్​లో పాల్గొన్నవాళ్లు సెప్టెంబర్​ నెల మొత్తంలో పదివేల అడుగులు నడవాలి. ఆ టైంలోనే పదివేల అడుగులు గోల్​ కంప్లీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకునేందుకు ఒక జపనీస్​ కంపెనీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. వాళ్లు తయారుచేసిన కొత్తరకం స్టెప్ ట్రాకర్​ని ప్రమోట్​ చేసుకునేందుకు ఈ ఛాలెంజ్​ వాడుకుంది. ఆ పీడోమీటర్(అడుగుల్ని లెక్కించేది) బ్రాండ్ పేరు ‘మన్పొ కై’. అంటే పది వేల స్టెప్ మీటర్ అని అర్థం. ‘సిట్ లెస్... మూవ్ మోర్​’ అంటే.. తక్కువ టైం కూర్చొని... ఎక్కువ టైం నడవాలి అనే స్లోగన్​ వాడారు. స్టెప్​టెంబర్​ వంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ప్రజల్లో కూడా అవేర్​నెస్ వస్తుందనేది ‘పబ్లిక్ హెల్త్ మెసేజ్’ అనే ఆర్గనైజేషన్​ మాట. 
ఇలాంటిదే ఆస్ట్రేలియాలో మరో ఛాలెంజ్ జరిగింది. దానిపేరు ‘మూవ్ ఇట్’ క్యాంపెయిన్. అందులో భాగంగా ఫిజికల్ యాక్టివిటీలో ‘ఎవ్రీ మూవ్ కౌంట్స్’ అని చెప్పింది. దాంతో ప్రజలు చాలా యాక్టివ్​గా ఈ ఛాలెంజ్​లో పాల్గొన్నారు.

మెటా... మెగా రీసెర్చ్​
రీసెంట్​గా ‘మెటా ఎనాలసిస్’ జరిగింది. అందులో నాలుగు ఖండాల నుంచి 50వేల మందిపై రీసెర్చ్​ చేశారు. మొత్తం15 స్టడీలు చేసి కొన్ని విషయాలు తేల్చారు. మసాచుసెట్స్​ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమియాలజిస్ట్ అమండా పలచ్ చీఫ్​గా ఇంటర్నేషనల్ సైంటిస్ట్​ల గ్రూప్ ఈ రీసెర్చ్ చేసింది. స్టెప్స్ ఫర్ హెల్త్ కొలాబరేటివ్ పేరుతో రోజుకి ఎక్కువసార్లు నడిచినవాళ్లలో ప్రిమెచ్యూర్ డెత్ రిస్క్ తగ్గినట్టు గుర్తించారు. 60 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు దాదాపు 8,000 అడుగులు వేస్తే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంది. అంతకంటే ఎక్కువ నడిచినా ప్రయోజనం లేదని కూడా చెప్పింది. అరవై ఏండ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు పది వేల అడుగులు వేస్తే మంచిదని తేలింది ఈ రీసెర్చ్​లో. అయితే వాకింగ్ స్పీడ్ గురించి మాత్రం రీసెర్చ్​ నివేదికలో చెప్పలేదు. 
ఈ స్టడీలో18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లనే తీసుకున్నారు. నాలుగు గ్రూప్​ల రీసెర్చ్​లలో రోజుకి ఒకటి 3,500 అడుగులు, రెండోది 5,800 అడుగులు, మూడోది 7,800 అడుగులు, నాలుగోది 10, 900 అడుగులు వేశారని తేలింది. వాటిలో మూడు హయ్యర్ యాక్టివ్ గ్రూపుల్లో ఎక్కువ అడుగులు వేశారు. వాళ్లు 40 నుంచి 53 శాతం డెత్​ రిస్క్ తప్పించుకుంటారని మెటా ఎనాలసిస్ చెప్పింది.

వాకింగ్ సిటీస్
ఆఫ్రికా​లో ఎక్కువశాతం పేద ప్రజలే ఉన్నారు. వాళ్ల దగ్గర ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్స్​ చాలా తక్కువ ఉంటాయి. అందుకని వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా నడిచే వెళ్తుంటారు. ఊరికి దూరంగా, ఎక్కడ చోటు ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుని బతికిస్తుంటారు. దాంతో ఊళ్లోకి వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. వెహికల్స్​ కొనే స్తోమత వాళ్లకి ఉండదు. గవర్నమెంట్​ కూడా వాళ్లని సరిగా పట్టించుకోదు. అందుకని ఆఫ్రికా సిటీలను ‘వాకింగ్ సిటీస్​’ అంటారు. అయితే, పోయినేడాది జరిగిన రీసెర్చ్​లో ఆఫ్రికన్​ సిటీల్లో వాకింగ్ చేయడం వల్ల సామాజికంగా, ఆర్థికంగా లాభాలున్నాయని తేలింది. స్కూల్​, టెంపుల్, వాటర్ ప్లాంట్, కిరాణా షాప్​ వంటివి నడిచి వెళ్లే దూరాల్లోనే ఉంటాయి. కాబట్టి నడక అనేది ఫిజికల్​, మెంటల్​గా మంచిది. అంతేకాదు సామాజికంగా, ఆర్ధికంగా కూడా ఉపయోగపడుతుందని ఆ రీసెర్చ్​లో తేలింది. అందుకని, ‘‘ఫ్యూచర్​లో ట్రాన్స్​పోర్టేషన్​కి వెహికల్స్​ ఫెసిలిటీ వచ్చినా.. నడక మాత్రం మానుకోవద్దు’’ అంటున్నారు రీసెర్చర్లు. దారులు కూడా నడిచేందుకు వీలుగా, ప్రశాంతంగా ఉండేలా ఆలోచించాలని సజెస్ట్ చేశారు.

బైపెడలిసిమ్​ 
ఇథియోపియాలో 1994లో మొదటి మానవ శిలాజాలు కనిపించాయి. అవి చూస్తే బైపెడలిసిమ్ లక్షణాలు కనిపించాయి. అంటే... ఇప్పుడు మనకు ఉన్న కాలి వేళ్లలానే అప్పట్లో వాళ్లకు ఉన్నాయి. పూర్వం చేతుల్ని కూడా నడవడానికి ఉపయోగించేవాళ్లని, మనిషి జంతువు నుంచే వచ్చాడని చదివే ఉంటారు. అందువల్ల ఇథియోపియాలో కనిపించిన శిలాజాల్లో ఇప్పటి మనుషుల్ని పోలి ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు రీసెర్చర్​లు. ఈ పోలిక ఎలా తెలిసిందంటే.. జంతువుల్లా నడిస్తే, కాలి వేళ్లు సగం వంగినట్టు లేదా ముడుచుకున్నట్టు కనిపిస్తాయి. కానీ, ఇవి అలా లేవు. మన కాలి వేళ్లలాగానే నార్మల్​గా ఉన్నాయి. అయితే ఆ శిలాజాలు ఒక మహిళవి. ఆమెకి ఆర్డిపితెకస్​ రామిడస్ అనే పేరు పెట్టారు. ఆర్డి అని పిలిచేవాళ్లు. ఆర్డి ఇప్పటి మనుషుల్లా నడవలేదు. కానీ, నడిచే పద్ధతి మాత్రం ఇప్పుడు మనం నడుస్తున్నట్టే  ఉంది. పదేండ్ల తర్వాత ఆర్డి జాతి నుంచి మరో వందకు పైగా శిలాజాలు కనిపించాయి. అవి నాలుగు మిలియన్​ సంవత్సరాల క్రితం నాటివిగా గుర్తించారు.

వాకింగ్ యాప్స్​ 
యాప్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాకపోతే అందులో వచ్చే రిజల్ట్ చూసినప్పుడు మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమందికి అదొక అలవాటు. ఏ పని చేసినా, లెక్క తెలియాలి. అది తెలిస్తేనే ప్రశాంతంగా ఉంటారు. వాళ్లని వాళ్లు మోటివేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈరోజు తక్కువ నడిస్తే, దాని రిజల్ట్ లెక్క రూపంలో కనిపిస్తుంది. దాన్నిబట్టి తర్వాత రోజు ఇంకొంచెం ఎక్కువ నడుస్తారు. ఆ విధంగా వాళ్లకి యాప్స్ హెల్ప్ అవుతాయి. 

వాకింగ్​లో రకాలు 
సింపుల్ వాకింగ్ – అంటే రోజూ నడిచే నడక. కానీ దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే వాకింగ్ చేస్తే చెమట పట్టాలి. అప్పుడే నడిచిన ప్రయోజనం ఉంటుంది. సింపుల్ వాకింగ్ రోజూ చేసేదే. చాలామంది అది కూడా నెగ్లెట్ చేసి అనవసరంగా రోగాలు తెచ్చుకుంటుంటారు. అలా జరగకుండా ఉండాలంటే వీలైనంత వరకు నడవాలి. ఒక పద్ధతి ప్రకారం నడవాలనుకుంటే.. వాకింగ్​లో స్లో, బ్రిస్క్ వాకింగ్​ అని రెండు రకాలుంటాయి.

స్లో వాకింగ్– స్లోగా వాకింగ్ చేస్తే చెమట రాదు. అందుకని క్యాలరీలు ఖర్చవ్వాలంటే స్లో వాకింగ్ సరిపోదు. కాకపోతే, ఆర్థరైటిస్, బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్స్​, వయసు మళ్లిన వాళ్లు చేయాలి. 
బ్రిస్క్ వాకింగ్ – వాకింగ్​తో పాటు రన్నింగ్ లేదా నడుస్తూ మాట్లాడాలి. అలా చేయడం వల్ల చెమట పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్ (డబ్య్లూ.హెచ్.​ఓ) ప్రకారం, వారానికి 150 నిమిషాలు చేయాలి. అంతకంటే ఎక్కువ చేసినా మంచిదే. కానీ, బలవంతంగా చేయకూడదు. వారానికి రెండున్నర గంటలు బ్రిస్క్ వాక్ చేయడం హెల్త్​కి మంచిది. నిద్ర తక్కువ అవ్వడం వల్ల వచ్చే ఎర్లీ డెత్ రిస్క్​లు తగ్గుతాయి. వాకింగ్ అలవాటున్నవాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. స్టార్టింగ్​ నుంచే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. 
మరోలా చెప్పాలంటే.. ఒక కిలోమీటర్​ని పది నిమిషాల్లో కవర్ చేయడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. అంతకంటే ఎక్కువ దూరాన్ని తక్కువ టైంలో కవర్ చేయగలిగితే, దాన్ని రేస్ వాకింగ్ అంటారు.
రేస్ వాకింగ్ – అథ్లెటిక్స్, ఒలింపిక్స్​లో ఈ కాంటెస్ట్​ జరుగుతుంది. ఈ రేస్​లో జరిగే అన్ని లెవల్స్​లో రేసర్స్ కాళ్లు నేలకు ఆనేలా నడవాలి. అలా నడుస్తున్నప్పుడు కాళ్లు నిటారుగా ఉంటాయి.  
ట్రెడ్​మిల్ వాకింగ్​ – ట్రెడ్ మిల్ మీద వాకింగ్ స్పీడ్ పెరుగుతుంది. ట్రెడ్ మిల్​ మీద స్లో వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ రెండూ ఒకటే. చెమట వస్తేనే క్యాలరీలు ఖర్చయినట్లు. అప్పుడే వాకింగ్ చేసినందుకు రిజల్ట్ కనిపిస్తుంది.

మెట్లు ఎక్కితే..
వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం రెండూ వేర్వేరు. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు. మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. నార్మల్, స్ట్రెయిట్​గా ఉన్న ప్లేస్​ల్లో లేదా గ్రౌండ్​లో వాకింగ్ చేస్తే చాలా తక్కువ ఒత్తిడి పడుతుంది. మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు మెట్లు వాడొద్దు. 

ఆశ్చర్యపరిచే నిజాలు 

  • కొందరు ఎక్సర్​సైజ్​ లేదా వాకింగ్ చేయరు. సరిగా నిద్ర కూడా పోరు. అలాంటివాళ్లకు 60 శాతం డెత్ రిస్క్​ ఉంది. 70 శాతం గుండె సంబంధిత వ్యాధులు, 45 శాతం క్యాన్సర్​ వచ్చే ప్రమాదాలున్నాయి. అందుకే18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వారానికి150 నుంచి 300 నిమిషాలు బ్రిస్క్​ వాకింగ్​ చేయాలి. లేదంటే చిన్న చిన్న ఎక్సర్​సైజ్​లు, రన్నింగ్ వంటివి 75 నుంచి150 నిమిషాలపాటు చేయాలని డబ్ల్యు.హెచ్.​ఓ. చెప్పింది. 
  • హార్వర్డ్​ రీసెర్చర్లు 32 ఏండ్ల వయసులో ఒబెసిటీని పెంచే జీన్స్​ గురించి స్టడీ చేశారు. అందుకోసం12వేల మంది మీద రీసెర్చ్ చేశారు. అయితే ఆ పార్టిసిపెంట్స్​లో ఎవరైతే రోజుకి ఒక గంట బ్రిస్క్ వాకింగ్ చేశారో.. వాళ్లలో ఈ జీన్స్​ సగానికి తగ్గిపోయినట్లు గుర్తించారు. 
  • స్ట్రెస్​లో ఉన్నప్పుడు బాగా చాకొలెట్స్ తింటారు. దానివల్ల క్యాలరీలు పెరుగుతాయి. అయితే పావుగంట నడిస్తే చాకొలెట్ తినాలనిపించడం తగ్గిందనీ, తినాలనిపించినా చాకొలెట్ మోతాదు తగ్గిందని ఎక్జెటర్ యూనివర్సిటీ చేసిన రెండు స్టడీల్లో తేలింది.
  •  ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశాలున్నాయని రీసెర్చ్​ల్లో ఎప్పుడో తేలింది. అయితే, అమెరికన్​ క్యాన్సర్ సొసైటీ స్టడీ ప్రకారం.. వారానికి మూడు గంటలు మాత్రమే నడిచేవాళ్లతో పోలిస్తే ఏడు గంటలకు పైగా నడిచేవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం తక్కువ అని తేలింది. అన్ని గంటలు నడవడం వల్ల బరువు కూడా తగ్గుతారంటోంది ఈ స్టడీ.   
  • వాకింగ్​తో ఆర్థరైటిస్​ వల్ల కలిగే బాధ తగ్గుతుంది. వారానికి దాదాపు ఆరు మైళ్లు నడిస్తే ఆర్థరైటిస్ రాకుండా జాగ్రత్తపడొచ్చు. వాకింగ్ చేయడం కీళ్లకు మంచిది. ముఖ్యంగా మోకాళ్లు, తుంటి భాగాలకు మంచిది. ఎందుకంటే వీటికి ఆస్టియోఆర్థరైటిస్​కి గురవుతుంటాయి. దాన్నుంచి తప్పించుకోవాలంటే వాకింగ్ చేయాల్సిందేనని మరో స్టడీ చెప్పింది.
  • వాకింగ్ చేయడం వల్ల సీజనల్​గా వచ్చే జలుబు, జ్వరం రావు. ఆడవాళ్లు, మగవాళ్లు కలిపి మొత్తం వెయ్యిమంది మీద ఈ స్టడీ చేశారు. వాళ్లంతా రోజుకి 20 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడిచేవాళ్లు. వాళ్లలో వారానికి ఒకసారి ఎక్సర్​సైజ్​ చేసేవాళ్లలో 43 శాతం తక్కువ అనారోగ్యానికి గురయ్యారు. కొంతమందికి ఏం కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది.
  • రోజుకి ఏడు వేల అడుగులు వేయడం వల్ల గుండెకు చాలామంచిదని మరో కొత్త స్టడీలో తేలింది. ముఖ్యంగా మిడిల్​ ఏజ్​ వాళ్లలో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్​కి ఇది మంచి సొల్యూషన్​. రోజుకి ఏడువేల అడుగులు, అంతకంటే ఎక్కువ నడిచేవాళ్లు, ఎవరైనా ఎక్కువకాలం బతుకుతారు. అలాగని, పదివేల కంటే ఎక్కువ అడుగులు వేసేవాళ్లు ఇంకా ఎక్కువ కాలం బతుకుతారని చెప్పలేం!  
  • ఫిట్​నెస్ లేకపోతే శారీరకంగా, మానసికం​గా దెబ్బతింటారు. ముఖ్యంగా లాక్​డౌన్​లో ఎక్సర్​సైజ్​, ఫుడ్, మెడికల్ కేర్ చాలా అవసరమని హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ చెప్పారు. అంతేకాకుండా లండన్​లో​ చేసిన ఒక పెద్ద స్టడీలో లాక్​ డౌన్​ కండిషన్స్​ వల్ల రోజుకి 3,500 అడుగులు మాత్రమే వేశారని చెప్పింది. చాలామంది వాకింగ్​ చేయడానికి బద్ధకించారని తెలిసింది. ప్రపంచ జనాభాలో పావు భాగం ఇంట్లోనే బద్ధకంగా గడిపేశారు. ఇప్పుడు గుమ్మం దాటి బయటకు వెళ్లాలంటే ఈజీ సొల్యూషన్స్​ వెతుకుతున్నారు. కానీ, నిజానికి నడవడం, లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల అన్నింట్లో స్పీడ్​ పెరుగుతుంది. 

20 ఏండ్ల వాకింగ్ జర్నీ
నాకు 58 ఏండ్లు. రోజూ స్టేడియంలో వాకింగ్​కు వెళ్తా. ఉదయం 5 గంటల నుంచి 6.30 లోపు రెగ్యులర్​గా వాకింగ్ చేస్తా. 40 నిమిషాలు వాకింగ్, 20 నిమిషాలు ఎక్సర్ సైజ్ చేస్తా. మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేసి, తర్వాత స్పీడ్ పెంచుతూ జాగింగ్ చేస్తా. వాకింగ్ చేయకముందు బరువు పెరిగి, ఒళ్లంతా బద్ధకంగా అనిపించేది. ఇప్పుడు శరీరంతో పాటు మనసు కూడా తేలిగ్గా అనిపిస్తుంది. వర్షాకాలంలో రెగ్యులర్ వాకింగ్ చేయడం కుదరదు. అప్పుడు కొంచెం బరువు పెరిగిన ఫీలింగ్ వస్తుంది. రెగ్యులర్​గా నలుగురం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ మొదలుపెడతాం. 20 ఏండ్ల క్రితం సరదాగా ఫ్రెండ్స్​తో కలిసి మొదలైన వాకింగ్ జర్నీ.. ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తున్నా. మా అబ్బాయి అమెరికా నుంచి యాపిల్ లేటెస్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ పంపించాడు. అందులో వాకింగ్ హిస్టరీ, హార్ట్ బీట్ వంటివి కనపడతాయి. అవి గమనిస్తూ వాకింగ్ చేస్తా. 
- తాళ్లూరి రామానుజయ్య, ఖమ్మం

25 ఏండ్ల వారితో పోటీ పడతా
నేను దాదాపు 30 ఏండ్ల నుంచి డైలీ వాకింగ్‍ చేస్తున్నా. పొద్దుగాల్నే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్​కి వెళ్తే ఆ ఫీల్‍ వేరే ఉంటది. జోష్‍గా నడవాలనిపిస్తది. ఉదయం చెమట వచ్చేలా వాకింగ్‍ చేస్తే రోజంతా బాగుంటది. టైంపాస్‍ కోసం కాకుండా సీరియస్‍గా వర్కవుట్ చేస్తా. నాకు 55 ఏండ్లు నిండినయ్‍. వాకింగ్‍ చేసే టైంలో 25 ఏండ్ల వారితో పోటీ పడతా. నాతో సమానంగా నడవాలని ఫ్రెండ్లీగా ఛాలెంజ్‍ చేస్తా. నేను వెళ్లేచోట రెగ్యులర్‍గా ఎవరు యాక్టివ్‍గా ఉంటారో తెలుసు. కాబట్టి వెళ్లగానే వారికోసం చూస్తా. వాళ్లతో లేటెస్ట్ విషయాలపై మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ గంట వాకింగ్‍ చేస్తా. మరో గంట ఎక్సర్‍సైజ్‍లు, ప్రాణాయామం చేస్తా. ఇంటికి వెళ్లగానే అలసట అనిపిస్తే.. 20 నిమిషాలు ప్రశాంతంగా నిద్రపోతా. ఆ కాస్త రిలాక్సేషన్‍.. డే అంతటికి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. ఏదైనా పనిబడి ఒకటి, రెండు రోజులు వాకింగ్‍ చేయకుంటే.. ఏదో కోల్పోయినట్లే అనిపిస్తది. కాళ్లు చేతులు గుంజినట్లు అనిపిస్తుంది. బాడీ మొత్తం డల్‍ అనిపిస్తది. నా వరకు నేను స్మార్ట్​ఫోన్​, ఫిట్‍నెస్‍ బ్యాండ్‍లలో వచ్చే వాకింగ్‍ అప్‍డేట్స్​ చూడను. ఎందుకంటే నేనే నా ఎక్స్​పీరియెన్స్​ని కొత్త వారికి చెప్తా. వాకింగ్‍, ఎక్సర్​సైజ్​ ఏదైనా వయసు, శరీరతత్వం, వర్కవుట్‍ మీద ఆధారపడి ఉంటుంది. 
- జీల కుమారస్వామి, హనుమకొండ

ఇప్పుడు స్ట్రెస్ లేదు
నాకు 57 ఏండ్లు. 30సంవత్సరాల నుండి రోజుకు ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నా. గతంలో ఏ పని చేయాలన్నా తరువాత చేద్దామని వాయిదా వేస్తూ బద్ధకించేవాడిని. ఏదైనా అవసరం కోసం బయటకెళ్లినప్పుడు నడవాలన్నా, ఎక్కువసేపు వెయిట్ చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఇలాగే ఉంటే శరీర బరువు పెరిగి రోగాల బారిన పడాల్సి వస్తుందని వాకింగ్ చేయడం మొదలుపెట్టా. వాకింగ్ చేయడం వల్ల ఎంత పని ఉన్నా స్ట్రెస్ అనిపించట్లేదు. ఇప్పుడు వాకింగ్ జీవితంలో ఒక రొటీన్ అయింది. వాకింగ్​తో పాటు మెడిటేషన్ చేస్తా. యోగాసనాలు వేస్తా. వాకింగ్ కంటే ముందు వామప్, ఎక్సర్ సైజ్​లు చేస్తా. ఈ మధ్య కాలంలో స్మార్ట్​ఫోన్​లో ఎన్ని స్టెప్స్ వేశానో, ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయో చూసుకుంటున్నా. వాకింగ్​ చేస్తూ పాత పాటలు వింటున్నా.
- బెల్లంకొండ శ్రీనివాస్ రావు, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా 

బరువు తగ్గాను
ప్రతిరోజు వాకింగ్ చెయ్యడం వల్ల బాడీ యాక్టివ్​నెస్ పెరిగింది. అంతకుముందు ఉదయం చాలా లేజీగా అనిపించేది. ఫిజికల్ యాక్టివిటీ ఏదీ చేయకపోవడం వల్ల..78 కిలోల వరకు బరువు పెరిగా. వాకింగ్ వల్ల ఒక్క సంవత్సరంలోనే...72 కిలోలకు తగ్గా. గత ఐదు సంవత్సరాలుగా స్కూల్ గ్రౌండ్​లో వాకింగ్ చేస్తున్నా. వాకింగ్​లో కొత్తవాళ్లు పరిచయమయ్యారు. ఒంటరిగా కాకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తా. ఎప్పుడైనా వర్క్ ఉండి వాకింగ్ మిస్ అయితే.. ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. వాకింగ్​తో పాటు యోగా కూడా చేస్తా.
- ఎర్రోజు మోహన్ చారి, టీచర్, కొడిమ్యాల, జగిత్యాల జిల్లా

ఎవరైనా చేయాలి
చిన్నపిల్లలు కదా వాకింగ్​ చేయకపోయినా పర్వాలేదు అనుకోవద్దు. వాకింగ్​తోపాటు జాగింగ్, రన్నింగ్​, ఆటలు ఆడటం వంటి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయాలి. అలా చేయకపోతే, చిన్నప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కచ్చితంగా వాకింగ్ చేయాలి. ప్రెగ్నెన్సీ అనేది ఫిజికల్​గా వచ్చే ఒక మార్పు. ప్రెగ్నెన్సీలో షుగర్స్ వస్తాయి. కాబట్టి వాకింగ్ చేయడం చాలా మంచిది. కాకపోతే తమకున్న స్టామినాను బట్టి చేయాలి.

హార్ట్​ హెల్దీగా..
వాకింగ్ కూడా ఒక ఎక్సర్​సైజే. హార్ట్​ హెల్త్​ కోసం తప్పకుండా వాకింగ్​ చేయాలి. అందులోనూ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుంది. గుండె హెల్దీగా ఉండటమంటే.. 60,70ల్లో ఉన్న హార్ట్ రేట్​ని పెంచడం. హార్ట్​ రేట్ పెరిగితే బ్లడ్ పంపింగ్ ఎక్కువ అవుతుంది. సర్క్యులేషన్ పెరుగుతుంది. అప్పుడే హార్ట్ హెల్దీగా ఉన్నట్టు. అంతేకాకుండా కొలెస్ట్రాల్​ వల్ల హార్ట్​లో బ్లాక్​లు ఏర్పడటం కూడా తగ్గుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్​ రాని వాళ్లు, వచ్చిన తర్వాత రికవర్ అయిన వాళ్లు బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు.

హార్ట్​ పేషెంట్స్​​ ...
కొంతమంది గుండె జబ్బున్న పేషెంట్స్​కి సగం ట్రీట్​మెంట్​ అయిపోయి ఉంటుంది. అలాంటివాళ్లు, వాళ్లకున్న ప్రాబ్లమ్​ని బట్టి, డాక్టర్ సజెస్ట్ చేసినట్లు చేయాలి. ఉదాహరణకు ఎవరికైనా గుండె బాగా డ్యామేజ్​ అయి, పూర్తిగా ట్రీట్మెంట్​ చేయలేని పరిస్థితి. అప్పుడు గుండె మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అలాంటి వాళ్లు బ్రిస్క్ వాకింగ్, హెవీ యాక్టివిటీస్ చేయకూడదు. మామూలు వాకింగ్ చేస్తే సరిపోతుంది. వాళ్ల కెపాసిటీకి తగ్గట్టు, బాడీ సహకరించినంత వరకు చేయాలి. ఆయాసం వస్తే ఆపేయాలి. అయితే వాకింగ్ మొదలుపెట్టాలి అనుకునే పేషెంట్, ముందుగా తనను ట్రీట్ చేసే కార్డియాలజిస్ట్​ని అడగాలి. వాళ్లు చెప్పినట్టుగా చేయాలి. ఎందుకంటే పేషెంట్ కండిషన్ ఏంటో డాక్టర్​కే తెలుసు. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు.

వయసును బట్టి..
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్​ వస్తున్నాయి. అయితే, మొదటినుంచి అలవాటున్న వాళ్లు వాకింగ్, ఎక్సర్​సైజ్​లు చేసేవాళ్లు చేయగలుగుతారు. కానీ, అలవాటు లేకుండా 40ల్లో వాకింగ్ మొదలుపెట్టాలంటే ఇబ్బంది పడతారు. కాకపోతే ఓపికగా చేయాలి. అంతేకానీ, వెంటనే బాగైపోవాలి అని శరీరం దానికి అలవాటుపడకముందే, హెవీ యాక్టివిటీస్ చేస్తే, లేనిపోని ప్రాబ్లమ్స్​ కొని తెచ్చుకున్నట్టే. అందుకని ఏ ఏజ్​ వాళ్లైనా వాళ్ల కెపాసిటీకి తగ్గట్టు చేయాలి. ఇప్పటికే ప్రాబ్లమ్​తో బాధపడుతున్నవాళ్లు స్లోగా మొదలుపెట్టి, వాకింగ్ లేదా ఎక్సర్​సైజ్​ కోసం బాడీని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత చేయగలిగినంత వరకు చేయొచ్చు.

నడిచేటప్పుడు..
వాకింగ్​ చేయడానికి అనుకూలంగా ఉండే బట్టలు వేసుకోవాలి. టైట్​గా, ఫిట్​గా ఉండేవి కాకుండా వదులుగా ఉంటే మంచిది. బ్రీతింగ్ సరిగా అందేలా చూసుకోవాలి. హార్ట్ పేషెంట్స్​ అయితే వాకింగ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి, ఆయాసం, కళ్లు తిరగడం, అలసట, గుండె వేగం పెరగడం వంటివి కనిపిస్తే వెంటనే నడక ఆపేయాలి. ఇలాంటివి ఏవైనా అనిపిస్తే వెంటనే కూర్చోవాలి లేదా పడుకోవాలి.
- డాక్టర్ ప్రణీత్, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్

సమ్మర్​లో...
సమ్మర్​లో వాకింగ్ చేయాలంటే హైడ్రేషన్ మెయింటెయిన్​ చేయాలి. లేదంటే డీహైడ్రేషన్​కి గురవుతారు. ముఖ్యంగా ఈ సీజన్​లో పొద్దున్నే వాకింగ్​ చేయడం బెస్ట్. ఎండలో వాకింగ్ అస్సలు చేయొద్దు. వాకింగ్ చేసేటప్పుడు వాటర్, డ్రింక్స్ తీసుకోవడం మంచి పద్ధతి కాదు. మొదలుపెట్టకముందే కొంచెం వాటర్ తాగి, తర్వాత నడక మొదలుపెట్టాలి. మధ్యలో తాగకూడదు. 
- డా. జి. నవోదయ, జనరల్ ఫిజీషియన్

:: మనీష పరిమి, వెలుగు నెట్​వర్క్