భార‌త ఆర్మీ అధికారుల‌ను పాక్ గూఢ‌చారులు ఎలా ట్రాప్ చేస్తున్నారంటే..

భార‌త ఆర్మీ అధికారుల‌ను పాక్ గూఢ‌చారులు ఎలా ట్రాప్ చేస్తున్నారంటే..

భార‌త్ పై ఎప్పుడూ విషం క‌క్కే దాయాది దేశం పాకిస్థాన్ కుట్ర‌లు మ‌రోసారి భ‌గ్న‌మ‌య్యాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే దౌత్య సిబ్బంది ముసుగులో తిష్ట వేసి.. పాక్ గూఢ‌చ‌ర్య సంస్థ ఐఎస్ఐ త‌ర‌ఫున ప‌ని చేస్తున్న ఇద్ద‌రు అధికారుల‌ను గుట్టు ర‌ట్టు చేశారు ఢిల్లీ పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు. స‌రిహ‌ద్దు ర‌హ‌స్యాలు, సైనిక స్థావ‌రాల వివ‌రాల‌ను దొంగ‌లించేందుకు ప్ర‌యత్నిస్తుండ‌గా.. రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. పాక్ హైక‌మిష‌న్ లో ప‌ని చేసే అబిద్ హుస్సేన్, ముహ‌మ్మ‌ద్ త‌హీర్ ఖాన్ అనే ఇద్ద‌రు పాక్ అధికారులు.. భార‌త్ చెందిన ఓ అధికారిని క‌లిసేందుకు వెళ్తుండ‌గా వ‌ల ప‌న్ని ప‌ట్టేశారు. ఫేక్ ఆధార్ కార్డుల‌తో భార‌తీయులుగా ప‌రిచ‌యం చేసుకుని డ‌బ్బు ఆశ చూపి సైనిక ర‌హ‌స్యాల‌ను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. వారిని అదుపులోకి తీసుకున్న స‌మ‌యంలో వారి ద‌గ్గ‌ర నుంచి కొన్ని కీల‌క డాక్యుమెంట్లు, రూ.15 వేల న‌గ‌దు, రెండు ఐ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అస‌లు ఈ పాక్ గూఢ‌చారులు మ‌న దేశంలోని ఆర్మీ జ‌వాన్లు, ప్ర‌భుత్వ అధికారుల‌ను ఎలా ట్రాప్ చేస్తున్నార‌నే దానిపై ఆర్మీ ఇంటెలిజెన్స్ నిఘా వేసి గుట్టు లాగే ప్ర‌య‌త్నం చేస్తోంది.

వీసా కోసం అప్లై చేసే అధికారుల బంధువులే మార్గం..

ఢిల్లీలోని పాక్ హైక‌మిష‌న్ అధికారులుగా ప‌ని చేస్తూ భార‌త ఆర్మీ, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌ను ఎలా ట్రాప్ చేయ‌గ‌లుగుతున్నార‌నే దానిపై పోలీసులు, కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. పాకిస్థాన్ వీసా కోసం వ‌చ్చే ఆర్మీ, ప్ర‌భుత్వ ఆధికారుల బంధువుల‌ను మొద‌ట టార్గెట్ చేసిన‌ట్లు గుర్తించారు. వారి వివ‌రాల‌న్నీ తీసుకుని.. భార‌త్ కు చెందిన వారిగా ప‌రిచ‌యం పెంచుకుని నెమ్మ‌దిగా కొన్ని నెల‌ల సాన్నిహిత్యం త‌ర్వాత డ‌బ్బు ఆశ చూపి ర‌క్ష‌ణ స‌మా‌చారాన్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. వీసాకు అప్లై చేసిన వారిని త‌మ వీసా ప్రాసెస్ వేగంగా పూర్తి చేయ‌డాలంటే.. ప్ర‌భుత్వ అధికారుల వివ‌రాలు కూడా కోరుతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇలా ర‌క‌ర‌కాల మార్గాల్లో ఆర్మీ, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల వివ‌రాల‌ను సేక‌రించి.. వారి వీక్ పాయింట్ తెలుసుకోవ‌డం.. ఆ త‌ర్వాత సెన్సిటివ్ డాక్యుమెంట్స్ రాబ‌ట్టుకోవ‌డమే పాకిస్థానీలు చేసిన ప‌ని. కొంత‌మందికి ఒక్కో డాక్యుమెంట్ కు రూ.25 వేల చొప్పున ఇచ్చి… తొలి ఫైల్ అందిన త‌ర్వాత బ్లాక్ మెయిలింగ్ దిగ‌డం ద్వారా వారికి కావాల్సిన స‌మాచారం అంతా లాగేసేందుకు వాళ్ల‌కు కుట్ర‌లు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ మార్కెట్ ఏరియాలో యువ జ‌వాన్ల‌కు త‌మ‌ని ఇండియ‌న్స్ గా ప‌రిచ‌యం చేసుకుని, మ‌రికొంద‌రిని ఫేస్ బుక్ చాట్ ద్వారా ట్రాప్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు మార్గాల్లో వారి ట్రాప్ లో ప‌డ్డార‌ని అనుమానిస్తున్న 12 మంది అధికారుల‌పై ఇప్పుడు కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు నిఘా పెట్టారు. ఏ మాత్రం వారి ద‌గ్గ‌ర నుంచి స‌మాచారం లీక్ అయిన‌ట్లు ఆధారాలు దొరికినా క‌స్ట‌డీలోకి తీసుకునే చాన్స్ ఉంది.