
స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం ‘జనాభా గణన శాఖ (Census Department)’ ఆధ్వర్యంలో కులగణనను అధికారికంగా నిర్వహించబోతోంది. 2011లో జరిగిన గణన మాత్రం గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల ద్వారా నిర్వహించడం జరిగింది. ఈసారి కేంద్రం రాజ్యాంగబద్ధంగా , సమగ్రంగా, దేశవ్యాప్తంగా సామాజిక న్యాయానికి మార్గం వేయాలని ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా బీసీ వర్గాలు ఈ నిర్ణయాన్ని హర్షాతిరేకంతో స్వాగతిస్తున్నాయి. ఇది బీసీల చారిత్రక డిమాండ్లకు న్యాయం చేస్తోంది.
రిజర్వేషన్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు (1992) ప్రకారం సాధారణంగా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. కానీ, కొన్ని సందర్భాల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. దీనికి కఠిన న్యాయ ప్రమాణాలు పాటించాలి. అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే. 50 శాతం పైగా రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి. అలాంటి పరిస్థితులు న్యాయంగా సమర్థించదగినవి కావాలి. అవి గణాంకాల ఆధారంగా నిరూపించాలి. రిజర్వేషన్ల అమలుకు ముందు సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతులపై సముచిత గణాంకాలు సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
కులగణన తప్పనిసరి
వెనుకబడిన వర్గాల స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు న్యాయస్థానాలను సమర్థవంతంగా నమ్మించలేవు. రాజ్యాంగం చెప్పిన సామాజిక న్యాయం అందించాలంటే ప్రభుత్వానికి గణాంకాలు తప్పనిసరి.
కులగణన ద్వారా అసాధారణ పరిస్థితులు ఉన్నాయని న్యాయంగా నిరూపించవచ్చు. గణాంక ఆధారాలు సమకూర్చి పాలనా నిర్ణయాలకు న్యాయబద్ధత చూపవచ్చు. అవసరమైతే రిజర్వేషన్లు 50 శాతం మించడానికి న్యాయపరమైన ధృవీకరణ పొందవచ్చు. అందుకే ఇందిరా సాహ్నీ తీర్పులో పేర్కొన్న ప్రక్రియలు పూర్తిగా అనుసరించాలి. జస్టిస్ పుట్టస్వామి తీర్పు ప్రకారం, ప్రభుత్వానికి సామాజిక సంక్షేమం కోసం గణాంకాలు సేకరించే అధికారం ఉందని స్పష్టం చేశారు. సమాజ సంక్షేమం, ప్రజాస్వామ్య పాలన కోసం సేకరించే గణాంకాలు మౌలిక హక్కులకు వ్యతిరేకం కావు. కులగణన గోప్యత హక్కును ఉల్లంఘించదని న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది.
2011 గణనలో లోపాలు
2011లో జరిగిన సామాజిక, ఆర్థిక, కులగణనలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. గణన విధానంలో స్పష్టత లేకపోవడం, కులాల పేర్లలో తప్పులు రావడం, వృత్తుల గుర్తింపు సరిగా జరగకపోవడం వంటి లోపాలు తలెత్తాయి. డేటా ఖచ్చితంగా లేకపోవడం వల్ల పాలనా నిర్ణయాలలో వాడలేమని 2021లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది రూ.5000 కోట్ల ప్రజాధనం ఖర్చు అయినా గణన ఉపయోగకరంగా మారలేదు. 2015లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. 2011 గణనలో అనేక తప్పులతో 46 లక్షల కులాల పేర్లు నమోదు అయ్యాయి. ఆ కులాల పేర్లు, ఉపకులాలు, సమానార్థక పదాలు, ఇంటిపేర్లు, వంశాలు, గోత్రాల వివరాలను వర్గీకరించడం, సరిచేయడం. సామాజిక న్యాయ, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖలు కమిటీకి సహాయం అందించాల్సి ఉంది. అయితే, ఇతర సభ్యుల ఎంపిక జరగలేదు. కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. చర్యలు నిలిచిపోయాయి. 2018లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2021 జనగణనలో ఓబీసీ గణన నిర్వహిస్తామని ప్రకటించారు. 25 లక్షల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. కానీ, కరోనా కారణంగా జనగణన వాయిదా పడింది.
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ అవసరం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినవిధంగానే వచ్చే జనాభా గణనతోపాటు కులగణన కూడా చేపట్టనుంది. ఇది బీసీల సామాజిక న్యాయ సాధనలో కీలక ముందడుగు. తప్పిదాలు జరగకుండా ముందస్తుచర్యలు తీసుకోవాలి. 2011లో జరిగిన లోపాలు పునరావృతం కాకూడదు. దీనికి సంబంధించి
ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్నాపత్రం స్పష్టంగా ఉండాలి. పద్ధతుల రూపకల్పన నిపుణుల సూచనలతో జరగాలి. ఎన్యూమరేటర్లకు గైడ్ పుస్తకం అందించాలి. శిక్షణ అన్ని రాష్ట్ర భాషల్లో ఇవ్వాలి. ప్రత్యేక సాఫ్ట్వేర్ లేదా మొబైల్ యాప్ ద్వారా సమాచారం నమోదు చేయాలి. పారదర్శకత పాటించాలి. జనాభా గణన ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది.
కులగణన ప్రత్యేకత దృష్ట్యా బీసీ మంత్రిత్వ శాఖ అవసరం ఉంది. రాష్ట్రాల మధ్య సమన్వయం, గణన పర్యవేక్షణ, ప్రజలకు సమాచారం అందించడం, నిధుల కేటాయింపు తదితర బాధ్యతలు ఈ శాఖకు అప్పగించాలి. జాతీయ నిపుణుల కమిటీ అవసరం కూడా ఉంది. ఈ కమిటీలో.. రాష్ట్ర బీసీ కమిషన్ల మాజీ చైర్మన్లు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు, ఎన్ఎస్ఓ, రిజిస్ట్రార్ జనరల్, నీతి ఆయోగ్ నిపుణులు, న్యాయవేత్తలు సభ్యులుగా ఉండాలి. నిపుణుల కమిటీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి. ప్రశ్నాపత్రాల రూపకల్పన, కులాల పేర్ల ప్రామాణికత, తప్పుల్లేని డేటా సేకరణకు మార్గదర్శకత్వం ఇవ్వడం.
ఈసారి కులగణన చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా జరగాలి. బీసీ మంత్రిత్వ శాఖ, నిపుణుల కమిటీ, ఆధునిక సాంకేతిక మద్దతుతో ఇది సామాజిక న్యాయ సాధనగా మారాలి. ఇదే రాజ్యాంగ సమానత్వం. ఇదే ప్రజాస్వామ్య పురోగతి.
కులగణన ఎందుకు అవసరం?
దేశ జనాభాలో బీసీ, ఓబీసీ వర్గాలు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ, వారికి సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు లేవు. విద్య, ఉపాధి, రాజకీయాలు, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో వారికివ్వాల్సిన న్యాయమైన వాటా నిర్ణయించడానికి గణాంకాలు అవసరం. కులగణన ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులు, అవసరాలు స్పష్టంగా తెలుస్తాయి. దీనిద్వారా ప్రభుత్వ విధానాలు లక్ష్యంగా రూపొందించవచ్చు. ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలిమెట్టు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(4), 16(4), 340 ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అధికారం కల్పించింది.
- డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు,
మాజీ చైర్మన్,
తెలంగాణ బీసీ కమిషన్