టీచర్లు, హెచ్ఎంల సొంత ఖర్చుతో వజ్రోత్సవాలు

టీచర్లు, హెచ్ఎంల సొంత ఖర్చుతో వజ్రోత్సవాలు
  • కొన్నిచోట్ల దాతల సాయంతో ఆట పాటలు
  • వేడుకలు నిర్వహించాలని ఆదేశించి వదిలేసిన అధికారులు
  • ఇస్తామన్న మొత్తం కూడా ఇంతవరకు అకౌంట్లలో పడలే

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్కూళ్ల హెడ్​మాస్టర్లు చెబుతున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 22 వరకు ప్రతిస్కూల్​లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన విద్యాశాఖ అధికారులు అందుకు అయ్యే ఖర్చును పట్టించుకోవడం లేదు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రైమరీ స్కూళ్లకు రూ.1000, హైస్కూళ్లకు రూ.1,500 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆ మొత్తం కూడా ఇంతవరకు స్కూళ్ల అకౌంట్లలో జమ కాలేదు. వందల మంది పిల్లలున్న ప్రభుత్వ స్కూళ్లకు వెయ్యి, పదిహేను వందలు ఎలా సరిపోతాయని టీచర్లు, హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.15 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు అయ్యాయని వాపోతున్నారు. కొన్నిచోట్ల టీచర్లు, హెచ్ఎంలు సొంత ఖర్చుతో వేడుకులు నిర్వహిస్తుండగా, వెయ్యి, 1,200 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ల హెచ్ఎంలు దాతలను సంప్రదిస్తున్నారు. 22న నిర్వహించే ముగింపు వేడుకలకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. 

వేలల్లో ఖర్చు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలో డీఈఓ ఆఫీసు నుంచి స్కూళ్లకు ముందుగానే లిస్ట్​వచ్చింది. అందులో  వజ్రోత్సవ వనమహోత్సవం, సింగింగ్, ఎస్సే రైటింగ్, పెయింటింగ్ పోటీలు, స్కూల్ స్థాయిలో ప్రీడమ్ కమ్ పేరుతో ఆటలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, ఫ్లాగ్ హోస్టింగ్, స్వతంత్ర భారత వజ్రోత్సవం, ప్రభాత భేరీ, మోనో యాక్షన్ రిఫ్లెక్టింగ్ ది స్పిరిట్ ఆఫ్ ది నేషన్, నేషన్ మీద రంగోళి కాంపిటీషన్, బహుమతుల అందజేత ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. కనీసం కావాల్సిన వస్తువులు కూడా అందించలేదు. టీచర్లు, హెచ్ఎంలే తమ జేబుల్లోంచి తీసి ఖర్చు పెడుతున్నారు.

సిలబస్ మరింత ఆలస్యం

పుస్తకాలు లేటుగా రావడంతో జులై 31వరకు ప్రభుత్వ స్కూళ్లలో బ్రిడ్జ్​కోర్సులు నడిచాయి. వరుస వానలతో సెలవులు, క్లాస్​రూములు సరిపోక, బయట కూర్చోబెట్టలేక పరీక్షలు పెట్టలేదు. హైస్కూల్​పిల్లలకు ఇప్పటివరకు ఒకటి, రెండు చాప్టర్లకు మించి సిలబస్​పూర్తి కాలేదు. రెండు వారాల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తుండడంతో సిలబస్​మరింత ఆలస్యం అవుతోందని టీచర్లు 
చెబుతున్నారు.

ఆ పైసలే ఇంతవరకు ఇయ్యలే

స్టూడెంట్స్ సంఖ్యని బట్టి ఏటా స్కూళ్లకు టాయిలెట్, స్కూల్ మేనేజ్​మెంట్ గ్రాంట్లు విడుదలవుతాయి. ప్రైమరీ స్కూళ్లకి రూ.5 వేల నుంచి 25 వేలు, హైస్కూళ్లకి 25 వేల నుంచి 50 వేలు, లక్ష వరకు గ్రాంట్లు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్​ఒకటో తేదీనే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు స్కూళ్లకు ఆ ఫండ్సే అందలేదు. ఎలాగోలా హెచ్ఎంలు నెట్టుకొస్తున్నారు. మళ్లీ కొత్తగా వజ్రోత్సవాల పేరుతో హెచ్ఎంలపై మరో భారం పడింది. ప్రభుత్వం, అధికారులు ఆదేశించిన ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలంటే వేలల్లో ఫండ్స్​కావాలి. అలా చేయాలి.. ఇలా చేయాలి అని ఆదేశాలు ఇస్తే సరిపోతుందా.. అందుకు అయ్యే ఖర్చు పరిస్థితి ఏందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. రెండు వారాలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలంటే ఎంతో ఖర్చు అవుతుందని, 1000,1500 ఇస్తే ఎలా సరిపోతాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

దాతల సాయంతో ముగింపు వేడుకలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు మొదలుపెట్టినప్పటి నుంచి 15 వేల వరకు ఖర్చు అయింది. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కావాల్సిన వస్తువులు, బహుమతులు, స్కూల్ డెకరేషన్ అన్నింటికి చాలా ఖర్చు అవుతోంది. ఈ నెల 22న ముగింపు వేడుకలు ఉన్నాయి. వాటి కోసం స్కూల్‌‌‌‌ ని దత్తత తీసుకున్న ఫౌండేషన్ ను సాయం అడిగాం. ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి అందలేదు.

- మల్లికార్జున్, హెచ్‌‌‌‌ఎం, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, భోలక్‌‌‌‌పూర్

పైసలు ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది

విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారే తప్ప డబ్బు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారనేది ఆలోచించడం లేదు. మా స్కూల్‌‌‌‌లో వెయ్యి మందికిపైగా పిల్లలు ఉన్నారు. పాత్రలకు తగినట్లు పిల్లలను రెడీ చేయాలి. డ్రెస్​లు మేమే తీసుకోవాలి. ఇంత మందికి కావాల్సిన వస్తువులు ఎలా కొనాలి. మా దగ్గర చదివే పిల్లలు అందరూ పేదవాళ్లే. వాళ్లు తల్లిదండ్రులను అడగలేరు. అందుకే మేమే అన్నీ సమకూరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే బాగుంటుంది.

- శ్రీనివాస్, టీచర్, గవర్నమెంట్ హైస్కూల్, ఫిలింనగర్‌‌‌‌