
బ్యాంకు సేవల్లో లోపాలు
చాలా మంది బ్యాంకు సేవలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు. అకౌంట్, లోన్స్, డిపాజిట్స్ వంటి సమస్యలపై ముందుగా సంబంధిత బ్యాంకులోనే కంప్లైంట్ చేయాలి. చాలా బ్యాంకులు కంప్లైంట్ రిజిస్టర్ మెయిన్‌టైన్ చేస్తుంటాయి. అందువల్ల సమస్య ఏదైనా ఉంటే ముందుగా అక్కడే కంప్లైంట్ చేయాలి. ఒకవేళ బ్యాంకు సిబ్బంది సరిగ్గా స్పందించకుండా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్‌కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా మెసేజ్ చేయడం ద్వారా కూడా ఈ ఆప్షన్ ఉంది. ప్రతి బ్యాంక్‌కి ఒక అంబుడ్స్‌మన్ ఉంటారు. కస్టమర్ల నుంచి వచ్చే కంప్లైంట్‌ను పరిష్కరించడం అంబుడ్స్‌మన్ రెస్పాన్సిబిలిటీ. అంబుడ్స్‌మన్‌ను ఆర్‌బీఐ నియమిస్తుంది. బ్యాంకులో నెల రోజుల్లోపు ప్రాబ్లమ్ సాల్వ్ కాకుంటే అంబుడ్స్‌మన్‌కు మెయిల్ ద్వారా, ఆన్‌లైన్‌లో బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఆర్‌బిఐ వెబ్‌సైట్ (https://cms.rbi.org.in) నుంచి కూడా ఫిర్యాదు చేయొచ్చు.
టీవీ కంటెంట్
కొన్ని టీవీ షోలు చాలా అభ్యంతర కరంగా ఉంటున్నాయి. వల్గర్‌గా, మూఢనమ్మకాలు, హింసను ప్రేరేపించేవిగా, విద్వేషాలు రెచ్చగొట్టేలా, పిల్లల్ని తప్పుతోవ పట్టించేలా ఉండవచ్చు. ఇలాంటి వాటిపై ‘బీసీసీసీ (బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్)’కి ఫిర్యాదు చేయొచ్చు. ఇది ‘ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్’కు సంబంధించిన ప్రభుత్వ సంస్థ. నాన్–న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్స్‌పై ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు.
మెడికల్ సర్వీసెస్
ఒక ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు వెళ్తే ఎంత బిల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కో హాస్పిటల్ ఒక్కో రకమైన చార్జెస్ వసూలు చేస్తుంది. అలాగే కొన్నిసార్లు ట్రీట్మెంట్లో లోపాలుండొచ్చు. ఎక్కువ చార్జీలు వసూలు చేసినట్లు అనిపించినా, ట్రీట్‌మెంట్ సరిగ్గా లేకపోయినా, హాస్పిటల్ సర్వీసెస్ బాగోలేకపోయినా ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్’కు ఫిర్యాదు చేయాలి. https://www.mciindia.org పై కంప్లైంట్ చేయొచ్చు.
యూనివర్సిటీల్లో ర్యాగింగ్
యూనివర్సిటీతోపాటు స్కూళ్ళు, కాలేజీలో ర్యాగింగ్ నిషేధం. అయినా ఇంకా సంస్కృతి కొనసాగుతూనే ఉంది. దీన్ని అడ్డుకునేందుకు కేంద్రం పలు కఠిన చట్టాల్ని రూపొందించింది. అలాగే ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్’ ఆధ్వర్యంలో ‘యాంటీ ర్యాగింగ్ సెల్’ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కాలేజ్, యూనివర్సిటీల్లో ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైనా ర్యాగింగ్ చేస్తే అక్కడ కంప్లైంట్ చేయాలి. లేదా1800-180-5522 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు.
ఆన్‌లైన్‌లో https://www.antiragging.in/ పై కూడా కంప్లైంట్ చేసే వీలుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో కూడా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు.
విమాన సర్వీసుల్లో లోపాలపై
ఫ్లైట్ టైమ్‌కు టేకాఫ్ కాకుండా ఆలస్యమైనా, ఎయిర్‌పోర్ట్‌లో ఫెసిలిటీస్ బాగోలేకపోయినా, విమాన సిబ్బంది పనితీరులో లోపాలున్నా ‘సుగమ్’కు ఫిర్యాదు చేయొచ్చు. ఇది డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఏర్పాటు చేసిన స్పెషల్ సెల్. ప్యాసింజర్లు ఎవరైనా మెయిల్ ద్వారా sugam@dgca.nic.inపై ఫిర్యాదు చేయొచ్చు.
చెట్ల నరికివేతపై
మొక్కలు పెంచాలని ఒక పక్క ప్రభుత్వం, పర్యావరణవేత్తలు ప్రచారం చేస్తుంటే మరికొందరు మాత్రం అకారణంగా చెట్లను నరికేస్తున్నారు. రకరకాల కారణాలతో వెళ్లి చెట్లను నరికేస్తున్నారు. ఇలా అతిగా చెట్లను నరికేస్తుంటే జిల్లాకు చెందిన ‘ట్రీ ఆఫీసర్’కు ఫిర్యాదు చేయాలి. ప్రతి జిల్లాకు ఒక ట్రీ ఆఫీసర్ ఉండాలి. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలుంటాయి.