
యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్బుక్.. ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా ఇటీవల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో తెగ వైరల్ అవుతున్నది. ‘‘చాలామంది నకిలీ వెబ్‌సైట్‌లలో డబ్బు పెట్టి మోసపోతుంటారు. ఇకపై అలాంటి తప్పు చేయొద్దు. ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. మీరు 21 వేలతో అకౌంట్ ప్రారంభించగానే ఏఐ ఆధారిత ట్రేడింగ్ సిస్టమ్ రంగంలోకి దిగి మీ డబ్బును ఉత్తమమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టి, మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది.
ఆరు నెలలుగా చాలామంది నెలకు రూ.10 లక్షల చొప్పున సంపాదిస్తున్నారు’’ అంటూ అత్యంత నమ్మకంగా చెబుతుంటారు. నిజానికి అందులో ఉన్నది నిర్మలా సీతారామన్ కాదు. సైబర్ నేరగాళ్లు ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియోను చూసి హైదరాబాద్‌కు చెందిన 71 ఏండ్ల రిటైర్డ్ డాక్టర్ రూ.20 లక్షలు పెట్టి మోసపోయాడు.
రూ.14.47 కోట్లు హుష్ కాకి..
ప్రముఖులతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోల ద్వారా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి. గతేడాది జనం రూ.14.47 కోట్లు నష్టపోయారని నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ గణాంకాలు చెప్తున్నాయి. ఈఏడాది వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ ఈ మొత్తం అనేక రెట్లు పెరిగిఉంటుందని అంచనా. ఈ డీప్ఫేక్వీడియోల్లో ఏ మాత్రం గుర్తించలేని ‘జనరేటివ్ అడ్వర్షియల్ నెట్‌వర్క్ టెక్నా లజీ’ని సైబర్‌నేరగాళ్లు వినియోగిస్తున్నట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను సైబర్ నిపుణులు, అత్యాధునిక టూల్స్ వాడే వాళ్లు తప్ప ఇతరులు గుర్తించే అవకాశాలు లేవంటున్నారు.
నిజమైనవా కాదా.. ? టెక్ నిపుణులకే అంతు చిక్కడం లేదు:
సైబర్‌నేరగాళ్లు ఎస్‌బీఐ సహా పలు జాతీయ బ్యాంకుల పేర్లతో డీప్‌ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. బ్యాంక్ లోగోను వాడుకుంటూ అనేక రకాల స్కీమ్స్ఆఫర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ప్రముఖుల పేర్లతో వచ్చే వీడియోలు, ఫొటోలు, ఈ మెయిల్స్, టెక్స్ట్, కాల్స్, వీడియో కాల్స్.. నిజమైనవా? కాదా? అని గుర్తించడం సైబర్క్రైమ్విభాగాలకు సాధ్యం కావడం లేదు. ఒకదానిని గుర్తించి, వెరిఫై చేసుకొని తొలగించేసరికి వందల్లో కొత్త వీడియోలు అప్లోడ్అవుతున్నాయి. ప్రస్తుతం షేర్‌మార్కెట్, మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. సోషల్ మీడియా పుణ్యమా అని షేర్మార్కెట్మీద ఎలాంటి అవగాహన లేని సామాన్యులు సైతం పెట్టుబడులకు ఆసక్తిచూపుతున్నారు.
ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌కు తెర తీశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి సెలబ్రెటీల వీడియోలను డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోల కిందే క్యూఆర్ కోడ్స్, హ్యాకింగ్ చేసేందుకు అవసరమైన లింకులు పెట్టి తాము చెప్పిన కంపెనీల అకౌంట్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని సూచిస్తున్నారు. ఒక్కసారి వారు చెప్పిన అకౌంట్లలో డబ్బులు వేయగానే భారీగా లాభాలు వచ్చినట్టు చూపి మళ్లీ మళ్లీ డిపాజిట్ చేసేలా రెచ్చగొడుతున్నారు. తాము చెప్పే దాకా ఆయా అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దని, సైబర్‌నేరగాళ్లు కండీషన్పెడుతుండడంతో నిజమేనని నమ్ముతున్న బాధితులు పెద్దమొత్తంలో కోల్పోయేదాకా మోసాన్ని గుర్తించలేకపోతున్నారు.
బాధితులు 1930కి ఫిర్యాదు చేయాలి
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో డీప్ ఫేక్ కీలకంగా మారింది. ప్రముఖులు ప్రమోట్ చేస్తున్నట్టు క్రియేట్ చేసిన వీడియోలను చూసి చాలా మంది మోసపోతున్నారు. నిజమేనని నమ్మి పెట్టుబడులు పెడుతున్నారు. షేర్ మార్కెట్, బ్యాంకులు, ప్రభుత్వ పథకాల పేరుతో ట్రాప్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియో నకిలీదా, నిజమైనదా? అని నిర్ధారించుకునేందుకు రాష్ట్రంలో ఫ్యాక్ట్ చెక్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మోసపోయిన బాధితులు 1930 లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలి. 87126 72222 వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం అందించాలి.
- శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో