
- ప్రభుత్వంపై హెచ్ఆర్‌సీ సీరియస్
- బాధితులకు రూ.1.25 లక్షల చొప్పున పరిహారం
- చెల్లించాలని ఆదేశం
బషీర్బాగ్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో గడువు ముగిసిన హెపటైటిస్ -బి వ్యాక్సిన్లను ఇవ్వడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. గతంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హెచ్ఆర్‌సీ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన బాధితుల ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన మౌలిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించిందని కమిషన్ అభిప్రాయపడింది.
వ్యవస్థాగత లోపాలను గుర్తించి 2014లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లో తెలిపిన సెక్షన్ 18(ఏ)(ఐ) ప్రకారం.. పై కేసులో ప్రతి బాధితునికి రూ.1,25,000 చొప్పున పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. మందుల సేకరణ, నిర్వహణ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. ఈ సిఫార్సులు రెండు నెలల్లోపు అమలు చేయాలని ఆదేశించింది.