
- రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- అల్లర్ల బాధితులకు పరామర్శ
- రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (సెప్టెంబర్ 13) మణిపూర్‌లోని చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌లో పర్యటించనున్నారు. సుమారు రూ.8,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. చురాచాంద్‌పూర్‌లోని పీస్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి ఇంఫాల్ వెళ్తారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మణిపూర్ సీఎస్ పునీత్ కుమార్ గోయెల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
కాగా, 2023, మేలో మణిపూర్‌లో కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లు చెలరేగాయి. 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మోదీ మణిపూర్‌లో పర్యటించలేదు. తాజాగా పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.
వర్చువల్‌గా శంకుస్థాపనలు
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ శనివారం ఉదయం మణిపూర్‌లోని చురాచాంద్పూర్కు చేరుకుంటారు. హింసాత్మక ఘటనల సమయంలో ఈ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా పలువురు బాధితులను మోదీ పరామర్శిస్తారు. అక్కడి నుంచి పీస్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. రూ.7,300 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడి నుంచి ఇంఫాల్ వెళ్లి రూ.1,200 కోట్లు విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు రాష్ట్ర, కేంద్ర బలగాలను మోహరించారు.
కాంగ్రెస్ పార్టీ విమర్శలు
అలర్లు చెలరేగిన రెండేండ్ల తర్వాత మణిపూర్‌లో మోదీ పర్యటించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మోదీ మణిపూర్‌లో కేవలం 3 గంటలు మాత్రమే పర్యటిస్తున్నారని, అంత తొందరపాటు ప్రయాణం ద్వారా ఆయన ఏం సాధించాలని ఆశిస్తున్నారో తెలియట్లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.