
- చౌటుప్పల్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన
చౌటుప్పల్, వెలుగు: ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నార్త్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించి, ధర్నా నిర్వహించారు. ట్రిపుల్ ఆర్ లో భూములు, ప్లాట్లు కోల్పోతున్న చౌటుప్పల్, వలిగొండ, సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్, భువనగిరి మండలాలకు చెందిన వందలాది మంద నిర్వాసితులు ఆర్డీవో ఆఫీస్ ఎదుట బైఠాయించారు.
ట్రిపుల్ ఆర్ వద్దని చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆందోళనకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం హైవేపై రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే నార్త్ అలైన్మెంట్ను ఓఆర్ఆర్ కు 40 కిలోమీటర్ల వద్దకు మార్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పేదల భూములు కొల్లగొడుతూ పెద్దలను కాపాడే కుట్రలకు వ్యతిరేకమన్నారు.
ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి చౌటుప్పల్ వద్ద 28 కిలోమీటర్ల దూరంలోనే అలైన్మెంట్ ఖరారు చేయడంతో చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల్లో విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్లో దివిస్ ఫ్యాక్టరీ కోసం అలైన్మెంట్ మార్చారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులను మోసం చేస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు.