యాదాద్రి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు.. ఆగస్టులో 1.19 మీటర్లు వృద్ధి

యాదాద్రి జిల్లాలో  పెరిగిన భూగర్భ జలాలు.. ఆగస్టులో 1.19 మీటర్లు వృద్ధి
  • 11.02 నుంచి 9.96 మీటర్లకు చేరిక
  • 3 మండలాల్లో తగ్గుముఖం
  • యాదాద్రి జిల్లాలో 425.8 మి.మీ.కు గానూ 732 మి.మీ. కురిసిన వాన

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఇప్పుడు తరచూ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతం ఎక్సెస్​రేటును చేరుకుంది. చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు పెరగడంతో బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో రైతులకు ఈ వానాకాలం సీజన్​లో సాగు నీటిపై బెంగ తీరింది.

బావులు, బోర్లే ఆధారం

జిల్లాలో బోర్లు, బావుల ఆధారంగానే వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సాగునీటి వనరులు, కాలువలు ఉన్నాయి. అక్కడ నాగార్జున సాగర్​, మూసీ, డిండి, ఎస్సారెస్పీ ద్వారా ఆయకట్టుకు నీరందుతోంది. యాదాద్రి జిల్లాలో మూసీ కాలువలు తప్ప మరో సాగునీటి వనరులు లేవు. అవి కూడా బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, భూదాన్​పోచంపల్లి మండల్లాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. మిగతా చోట్ల అన్నదాతలు బోర్లు, బావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు.

పెరిగిన సాగు విస్తీర్ణం

జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్​లో జులై మొదటి వారం వరకు వర్షాలు కురవలేదు. ఫలితంగా సాగుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో జులై రెండో వారం నుంచి కంటిన్యూగా వానలు పడుతున్నాయి. జూన్​1 నుంచి ఇప్పటివరకు 425.8 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 732 మి.మీ. కురిసింది. దీంతో లోటు వర్షపాతం నుంచి 80 శాతం ఎక్సెస్​కు చేరుకుంది. ఆగస్టు మొదటి వారం వరకు 1.33 లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న వరి చివరి నాటికి 2.54 లక్షల ఎకరాలకు చేరింది.1.13 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు.

10.26 మీటర్ల లోతులో జలాలు

జిల్లాలో 2024 ఆగస్టులో 11.02 మీటర్ల లోతులో నీరుండగా ఈ ఏడాది జులైలో 11.87 మీటర్లకు పడిపోయింది. ఆ తర్వాత కురిసిన వానల కారణంగా ఈ ఆగస్టులో 9.96 మీటర్ల(1.91 మీటర్లు)కు పెరిగిందని గ్రౌండ్​వాటర్ డిపార్ట్​మెంట్​లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని మోటకొండూరు, రాజాపేట, బీబీనగర్, ఆలేరు, భువనగిరి, రామన్నపేట, ఆత్మకూరు(ఎం) మండలాల్లో 10.26 నుంచి 15.81 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. సంస్థాన్​నారాయణపురం మండలంలో 21.65 మీటర్ల లోతులో నీరుంది. ఆలేరు మండలంలో 0.40 మీటర్లు, భువనగిరిలో 0.61 మీటర్లు, సంస్థాన్​ నారాయణపురం మండలంలో 2.31 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు చేరాయి.